NTV Telugu Site icon

Special Story on Netflix vs Disney: ఓటీటీ పోటీ.. ఓడేదెవరు? గెలిచేదెవరు?

Special Story On Netflix Vs Disney

Special Story On Netflix Vs Disney

Special Story on Netflix vs Disney: ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సెగ్మెంట్‌లో ఇప్పుడు రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య నువ్వానేనా అనే రేంజ్‌లో పోటీ నెలకొంది. ఇందులో ఒకటి నెట్‌ఫ్లిక్స్ కాగా రెండోది డిస్నీ. ఈ రెండింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా సీనియర్. డిస్నీ బాగా జూనియర్. అయితే.. మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని డిస్నీ అంటుంటే.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన ఫ్యూచర్ ప్లాన్లు తనకు ఉన్నాయని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ యుద్ధంలో గెలుపెవరిది?.

మాస్ మార్కెట్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌లో నెట్‌ఫ్లిక్స్ మస్తు పాపులర్ అయింది. చాలా ప్లాట్‌ఫ్లామ్‌లకు దీన్ని ఒక మార్గదర్శి అని చెప్పొచ్చు. మూవీ చూడాలన్నా, టీవీ షో వీక్షించాలన్నా ముందుగా గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్సే అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ ఇండస్ట్రీలోకి ఇటీవల చాలా మంది పోటీదారులు ఎంటరైనప్పటికీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన డామినేషన్‌ను కొనసాగిస్తూనే ఉండటం విశేషం.

అయితే ఈ ఆధిపత్యానికి డిస్నీ గ్రూపు చెక్ పెడుతుండటం చర్చనీయాంశమైంది. నెట్‌ఫ్లిక్స్ 1997లోనే అమెరికాలో ప్రారంభమైంది. రీడ్ హ్యాస్టింగ్స్, మార్క్ రాండోల్ఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దీనికి శ్రీకారం చుట్టారు. మొదట్లో.. మెయిల్ ఆర్డర్ డీవీడీ రెంటల్ కంపెనీగా వ్యవహరించేది. పదేళ్ల తర్వాత.. అంటే.. 2007లో సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా అవతరించింది. ఆ రోజుల్లో మరికొన్ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంది.

సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ని ఫాలో కావటం, స్టూడియోల నుంచి పెద్దఎత్తున పంపిణీ హక్కులను సొంతం చేసుకోవటం నెట్‌ఫ్లిక్స్‌కి కలిసొచ్చాయి. దీంతో కంపెనీ శరవేగంగా డెవలప్ అయింది. ఇండస్ట్రీ లీడర్‌గా ఎదిగింది. 2007 నుంచి 2022 మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్లు 7 మిలియన్ల నుంచి 221 మిలియన్లకు చేరటం గొప్ప విషయం. ఈ పెరుగుదల దాదాపు 3 వేల శాతం కావటాన్ని ఒక రకంగా అద్భుతమనే అభివర్ణించాలి.

అయితే.. అన్‌స్టాపబుల్‌గా నెట్‌ఫ్లిక్స్ సాగిస్తున్న ఈ జర్నీ ఈమధ్య కాస్త స్లో అవటం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. దీనికి ప్రధాన కారణం ఈ సెక్టార్‌లో డిస్నీ దూసుకెళుతుండటమేనని అనలిస్టులు అంటున్నారు. వీడియో స్ట్రీమింగ్ రంగంలోకి వాల్ట్ డిస్నీ కంపెనీ 2009లో ప్రవేశించింది. ఇది తొలుత హులు అనే సంస్థలో మైనర్ స్టేక్ హోల్డర్‌గా జాయిన్ అయింది.

తర్వాత.. పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటూ 2016లో వీడియో స్ట్రీమింగ్ టెక్నాలజీ కంపెనీ బామ్ టెక్ మీడియాలో 33 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2018లో మరోసారి మెజారిటీ షేరును సొంతం చేసుకొని బ్రాండ్ నేమ్‌ని డిస్నీ స్ట్రీమింగ్ సర్వీసెస్‌గా మార్చుకుంది. డిస్నీ ప్లస్‌తోపాటు ఈఎస్పీఎన్ ప్లస్‌ను లాంఛ్ చేయటం, ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఫాక్స్‌ను అక్వైర్ చేసుకోవటం ద్వారా హులు మరియు స్టార్ ప్లస్‌లలో కూడా ప్రధాన వాటాను చేజిక్కింది.

డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్ కన్నా 12 ఏళ్లు ఆలస్యంగా తెర మీదికి వచ్చినప్పటికీ ఈ రంగంపై పట్టుసాధించటానికి పెద్దగా టైం తీసుకోకపోవటం గమనించాల్సిన అంశం. ఈ ఆర్థిక సంవత్సరంలోని తాజాగా ముగిసిన రెండో త్రైమాసికంలో డిస్నీ గ్రూపులోని అన్ని ప్లాట్‌ఫామ్‌ల కంబైన్డ్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య నెట్‌ఫ్లిక్స్‌ను మించిపోవటం ప్రస్తావించాల్సిన పరిణామం.

ఇదే సమయంలో.. హెచ్‌బీఓ మ్యాక్స్ మరియు అమేజాన్ ప్రైమ్ వీడియో వంటి సర్వీసులు కూడా సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్.. ఇక వెనకడుగు వేసినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నెట్‌ఫ్లిక్స్ క్యూ వన్ రిజల్ట్స్‌ని వెల్లడించింది. అయితే.. ఏకంగా 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్లు ప్రకటించటం ఆశ్చర్యం కలిగింది.

అయినప్పటికీ ఈ ప్లాట్‌ఫాంలో ఇంకా 200 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం మామూలు విషయం కాదు. గత పదేళ్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గటం ఇదే తొలిసారి. దీంతో కంపెనీ స్టాక్ వ్యాల్యూ 200 డాలర్ల లోపుకే పరిమితమైంది. నెట్‌ఫ్లిక్స్ షేర్ విలువ 2017 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావటం కూడా ఇదే మొదటిసారి. ఐదేళ్ల అనంతరం.. అంటే.. 2022 అక్టోబర్ 10వ తేదీన సైతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ వ్యాల్యూ 230 డాలర్ల వద్దే ఉండిపోయింది.

దీన్నిబట్టి.. క్యూ వన్ ఫలితాలతో పోల్చితే 30 శాతానికి పైగా పతనమైందని అర్థంచేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో.. ఈ ఏడాది నవంబర్‌లో తక్కువ ధర కలిగిన, యాడ్ సపోర్టెడ్ సర్వీసును లాంఛ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సేవలను పీకాక్ మరియు పారామౌంట్ ప్లస్ వంటి ప్లాట్‌ఫామ్‌లు గత కొన్నేళ్లుగా అందిస్తున్నాయి. మరి.. నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఈ యుద్ధంలో విజేత ఎవరో కాలమే చెప్పాలి.