NTV Telugu Site icon

Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు

Special Story On Marriages

Special Story On Marriages

Special Story on Marriages: దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి పండుగ ఘనంగా గుర్తుండిపోతుంది. ఫెస్టివల్‌ సీజన్‌లో బిజినెస్‌ బాగా జరగటంతో వాళ్లు మస్తు ఖుషీ అయ్యారు. మళ్లీ అదే రేంజ్‌లో వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14 వరకు భారీ సంఖ్యలో బాజాలు మోగనుండటంతో బిజినెస్‌ సైతం పెద్దఎత్తున జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎన్ని మ్యారేజ్‌లు జరగనున్నాయి? వాటికి ఎంతెంత ఖర్చవుతుంది? అనే విషయాలను విపులంగా తెలుసుకుందాం..

వచ్చే నెల రోజుల పాటు దేశం నలుమూలలా వివాహాలకు శుభ ముహూర్తాలు ఖరారయ్యాయి. సుమారు 32 లక్షల మంది వధూవరులు మూడు ముళ్ల ముచ్చట తీర్చుకోనున్నారు. ఏడడుగులను కలిసి వేయనున్నారు. దీంతో దాదాపు 3 పాయింట్‌ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల బిజినెస్‌ జరగనుంది. పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. వంటల దగ్గర నుంచి మొదలుపెడితే జంటలను ఒక్కటి చేసే వరకు ఒకటి కాదు రెండు కాదు సవాలక్ష పనులుంటాయని తెలిసిందే. ఆ పనులకు డబ్బులు.. లక్షలు, కోట్ల రూపాయల్లో ఖర్చవుతాయని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

read more: Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’

దీనికి సంబంధించి ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం 32 లక్షల పెళ్లిళ్లు జరగనుండగా.. అందులో 5 లక్షల పెళ్లిళ్లకు.. ఒక్కో పెళ్లికి కనీసం 3 లక్షల రూపాయల చొప్పున ఖర్చవుతుందని తెలిపింది. దాదాపు 5 లక్షల రూపాయల బడ్జెట్‌లో జరిగే వివాహాల సంఖ్య సుమారు 10 లక్షలని వెల్లడించింది. 10 లక్షల రూపాయల ఖర్చు పెట్టే పెళ్లిళ్లు కూడా ఇదే స్థాయిలో 10 లక్షల దాకా ఉంటాయి. పాతిక లక్షల రూపాయల విలువైన మ్యారేజ్‌లు 5 లక్షలు, 50 లక్షల ఎక్స్‌పెండీచర్‌ వచ్చే పెళ్లిళ్లు 50 వేలు, కోటి దాకా ఖర్చు చేసే పెళ్లిళ్లు మరో 50 వేల వరకు ఉండొచ్చని సర్వే నివేదిక పేర్కొంది.

ఈ మ్యారేజ్‌లన్నింటికీ కలిపి ఎంతలేదన్నా 3 పాయింట్‌ ఏడు, ఐదు లక్షల కోట్ల రూపాయలను మంచినీళ్ల మాదిరిగా ఖర్చుచేయాల్సిందే. ఈ వెడ్డింగ్‌ సీజన్‌ ముగిశాక మళ్లీ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జులై వరకు మరో పెళ్లిళ్ల సీజన్‌ ఉండటం విశేషం. ప్రస్తుత సీజన్‌లో కేవలం ఢిల్లీలోనే మూడున్నర లక్షలకు పైగా లగ్గాలు ఉన్నాయి. వీటి ద్వారా తక్కువలో తక్కువగా 75 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చని అంచనా. గతేడాది ఇదే సమయంలో 25 లక్షల మంది ఒక ఇంటివారు కాగా 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

ఇదిలాఉండగా.. ఇటీవలే ముగిసిన దీపావళి సీజన్‌లో రికార్డు లెవల్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సెంటిమెంట్‌ కొనసాగుతుందనే అంచనాతో వ్యాపారులు తమ ఏర్పాట్లలో తాము నిమగ్నమయ్యారు. మొత్తం పెళ్లి ఖర్చులో 20 శాతం.. వధువు తరఫున జరుగుతుందని, మిగతా 80 శాతం ఇతర థర్డ్ ఏజెన్సీల తరఫున ఉంటుందని ట్రేడర్స్‌ చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అంటుంటారు. అందుకే.. పెళ్లి కన్నా ముందు ఇల్లు బాగుచేసుకుంటారు. కొంత మంది.. కొత్త ఇల్లు కట్టుకుంటారు. మరికొంత మంది.. ఉన్న ఇంటికే రిపేర్లు చేయిస్తారు.

దీంతోపాటు.. బంగారం, బట్టలు, సామాన్లు, రెడీమేడ్‌ వస్త్రాలు, పెళ్లి చెప్పులు, వెడ్డింగ్‌ మరియు గ్రీటింగ్‌ కార్డులు, పండ్లు, ఫలాలు, పూజా సామగ్రి, సరుకులు, కూరగాయలు, గృహలంకరణ వస్తువులు, కరెంట్‌ సామాను, గిఫ్టులు.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ చిట్టా చాంతాడంత ఉంటుంది. పెళ్లిళ్లకు జనాలు వీటన్నింటినీ కొనుగోలు చేస్తారు కాబట్టి వ్యాపారం జోరుగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. బ్యాంకెట్‌ హాళ్లు, హోటళ్లు, ఓపెన్‌ లాన్స్‌, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్‌ పార్కులు, ఫామ్‌హౌజ్‌లు, వివాహాలకు అనువైన ప్రదేశాలను సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తారు. అందువల్ల అన్ని రకాల బిజినెస్‌లకు ఢోకా ఉండదు.

ఇవే కాదు. ఇంకా చెప్పుకోవాల్సిన సంగతలు చాలా ఉన్నాయి. పెళ్లి అనగానే.. టెంట్‌ సామాన్లు, పెళ్లి పీటలు, పెళ్లి కుండలు, క్యాటరింగ్‌ సర్వీస్‌, ప్రయాణాలకు వాహనాల ఏర్పాట్లు, క్యాబ్‌ సర్వీసులు, వంట మనుషులు, ఫొటో మరియు వీడియోగ్రాఫర్లు, ఆర్కెస్ట్రా, డీజే, పెళ్లి కొడుకును, పెళ్లి కూతురును ఊరేగించేందుకు గుర్రాలు, లైట్లు, బండ్లు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాండ్‌ మేళం తదితర హంగామా మామూలుగా ఉండదు. ఈ బాజాలకు తగ్గట్లే బడ్జెట్‌ ఉంటుంది. బడ్జెట్‌కు అనుగుణంగానే ఆయా పెళ్లిళ్లు పది కాలాల పాటు బంధుమిత్రుల నోళ్లల్లో నానతాయి.