NTV Telugu Site icon

Special Story on Global Recesssion Fears: అదిగదిగో ఆర్థికమాంద్యం.. భయపడుతున్న ప్రపంచం..

Special Story On Global Recesssion Fears

Special Story On Global Recesssion Fears

Special Story on Global Recesssion Fears: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం శరవేగంగా దూసుకొస్తోంది. ఈ మేరకు పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు వెలువడకపోయినప్పటికీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలు సూచాయగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, జీరో కొవిడ్‌ పాలసీలో భాగంగా చైనా పాల్పడుతున్న క్రూరమైన చర్యలు, ద్రవ్యోల్బణం మరియు మంకీపాక్స్‌ కేసులతో స్టాక్‌ మార్కెట్లలో, ఎకానమీల్లో ఉత్సాహం కరువైంది. దీనికితోడు ఒక వైపు.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మరో వైపు.. బ్రిటన్‌ కొత్త ప్రధాని లిజ్‌ట్రస్‌ ఆర్థిక విధానాలు ఆ దేశ ప్రజల్లో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ప్రపంచం పూర్తి ఆర్థికమాంద్యాన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
YouTube video player

వాల్‌ స్ట్రీట్‌.. ఫాల్‌ డౌన్‌..

ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అగ్రరాజ్యం అమెరికా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అయిన వాల్‌స్ట్రీట్‌ గణనీయంగా పతనమవుతోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీ మరియు డెట్‌ మార్కెట్లలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఇన్వెస్టర్లు జంకుతున్నారు. టెస్లా, యాపిల్‌, ఎన్‌విడియా కార్పొరేషన్‌ వంటి టెక్నాలజీ దిగ్గజ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నాయి. నాస్‌డాక్ జూన్ నెల మధ్యలో అంచనా వేసినట్లుగానే ఈ ఏడాది కనిష్ట స్థాయి దగ్గరికి చేరుకుంది.

యూరప్‌లో చమురు ధరలను చక్కదిద్దే చర్యలు

యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు చమురు ధరలను చక్కదిద్దే చర్యలు చేపట్టాయి. ఇంధన సంస్థల విండ్‌ఫాల్‌ లాభాలపై అత్యవసర సుంకాల విధింపునకు ఆమోదం తెలిపాయి. క్రూడాయిల్‌కి కొరత రాకుండా ఉండేందుకు తదుపరి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఖరారు చేసేందుకు చర్చలు ప్రారంభించాయి. ఈ చర్చల అనంతరం గ్యాస్‌ ధరపై పరిమితి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌లోని 27 సభ్య దేశాల ఇంధన మంత్రులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదలను నియంత్రించాలని, లేకపోతే రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక మాంద్యాన్ని చవిచూడాల్సి వస్తుందని భావిస్తున్నాయి.

ఆసియా షేర్ల చెత్త ప్రదర్శన

కొవిడ్‌ ప్రారంభం తర్వాత ఆసియా ఖండ దేశాల షేర్లు ఈ నెలలో చూపినంత చెత్త ప్రదర్శన మరెప్పుడూ చూపలేదు. సెంట్రల్‌ బ్యాంకుల నుంచి వడ్డీ రేట్ల పెంపు ప్రకటనలు వరుసగా వెలువటం, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు, భౌగోళిక, రాజకీయ విపత్కర పరిస్థితులు కరెన్సీ మరియు బాండ్‌ మార్కెట్లలో గందరగోళానికి దారితీశాయి.

ఆర్బీఐ రేట్లు

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కీలకమైన రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5 పాయింట్‌ తొమ్మిదీ సున్నాకు చేర్చుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఆర్బీఐ రెపో రేటును పెంచటం ఇది నాలుగోసారి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం అద్దం పడుతోంది.

కొనసాగుతున్న కొలువుల కోతలు

జర్మన్‌-స్పానిష్‌కి చెందిన గాలి మరల తయారీ సంస్థ సీమెన్స్‌ గేమ్సా దాదాపు 2 వేల 900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు లేటెస్ట్‌గా ప్రకటించింది. డెన్మార్క్‌లో 800 మందిని, స్పెయిన్‌లో 475 మందిని, జర్మనీలో 300 మందిని నౌకరీల నుంచి తీసేయనున్నామని తెలిపింది. ఇలాగే చాలా సంస్థలు కొలువుల కోతలు విధిస్తున్నాయి. ఇది కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యానికి సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జర్మనీలో 10 శాతానికి చేరువలో ఇన్‌ఫ్లేషన్‌

జర్మనీలో ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. తాజాగా సుమారు 10 శాతానికి చేరువవుతోంది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో కూడా ఇన్‌ఫ్లేషన్‌ ఇదే రేంజ్‌కి చేరినట్లు అధికారిక డేటా వెల్లడిస్తోంది.

దక్షిణ కొరియాలో పడిపోయిన ఉత్పత్తి

సౌత్‌ కొరియాలో ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ వరుసగా రెండోసారి అంటే ఆగస్టు నెలలో కూడా పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల పడ్డ ప్రతికూల ప్రభావానికి ఇది గుర్తు అని చెప్పుకోవచ్చు.

టోక్యో స్టాక్స్‌ దిగువ స్థాయిలో ప్రారంభం

టోక్యో స్టాక్స్‌ శుక్రవారం దిగువ స్థాయిలో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. వాల్‌ స్ట్రీట్‌ స్టాక్స్‌ పతన ప్రభావం జపాన్‌ వరకు విస్తరించినట్లు దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఇన్‌ఫ్లేషన్‌ మరియు ఆర్థికమాంద్యం భయాలు అమెరికాలో మళ్లీ కనిపిస్తున్నాయనటానికి ఇవే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

బ్యారెల్‌ ఆయిల్‌ ధర 90 డాలర్లకు పైనే

చమురు ధరలు గురువారం అస్థిరమైన ట్రేడింగ్‌ అనంతరం తక్కువగా సెటిల్‌ అయ్యాయి. ఒకానొక దశలో బ్యారెల్‌ ఆయిల్‌ రేటు 90 డాలర్ల కన్నా ఎక్కువకు పెరిగి అనంతరం పడిపోయింది. ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తికి వచ్చే వారం కోత విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రేట్లు పడిపోయాయి.

పైన చెప్పుకున్న అన్ని అంశాలతోపాటు జర్మనీలో గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక ద్రవ్యోల్బణం నమోదుకావటం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మరింత సంకోచించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఎకానమీల్లోనే ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటే ఇక చిన్న దేశాల సంగతి చెప్పాల్సిన పనేలేదు. ప్రపంచ ఆర్థికమాంద్యానికి ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణలు కూడా అవసరం లేదేమో.