NTV Telugu Site icon

Special Story on Amazon’s Logistics Business: ట్రక్కులు, ఓడలు, విమానాల్లో డెలివరీ

8wfljhqiu W Hd

8wfljhqiu W Hd

Special Story on Amazon’s Logistics Business: అమేజాన్ బ్రాండ్ లోగోలో.. A టు Zను తెలియజేస్తూ బాణం గుర్తుంటుంది. అది ఆ కంపెనీ డెలివరీ చేసే ప్రొడక్టుల రేంజ్‌కి అద్దం పడుతోంది. అంటే.. అమేజాన్‌ అందించని సేవలంటూ ఏమీ లేవని కూడా పరోక్షంగా అర్థంచేసుకోవచ్చు. ఇ-కామర్స్‌ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగిన అమేజాన్‌.. ఇటీవల ఇండియాలో ‘అమేజాన్‌ ఎయిర్‌’ అనే సరికొత్త సర్వీసును లాంఛ్‌ చేసింది. దీంతో.. విమానాల ద్వారా కూడా ఉత్పత్తుల చేరవేతను ప్రారంభించింది. తద్వారా.. లాజిస్టిక్స్‌ బిజినెస్‌కి సంబంధించి.. ఆకాశ మార్గంలో సైతం ఆధిపత్యం చెలాయించాలనేది తన ప్రపంచవ్యాప్త ప్రణాళిక అని అమెజాన్‌ చెప్పకనే చెప్పింది.

గ్లోబల్‌గా చూసుకుంటే.. అమేజాన్‌ సంస్థకు సొంతగా 11 విమానాలున్నాయి. వీటికితోడు దాదాపు మరో వంద జెట్‌లను లీజుకు తీసుకుంది. మొత్తమ్మీద రోజుకి 200 ఫ్లైట్లను నడుపుతోంది. ఇదంతా తనకుతానుగా చేయట్లేదు. 7 ఎరోప్లేన్‌ కంపెనీల సాయం తీసుకుంటోంది. అసలు.. ఇలా ఆకాశ మార్గంలో డెలివరీ చేయాలనే ఆలోచనను తొలిసారిగా 2014లో ప్రారంభించింది. ఆ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా కిండిల్‌ అనే ఇ-రీడర్స్‌ సిరీస్‌లను వాషింగ్టన్‌లోని సీటెల్‌ ప్రాంతంలో ఎరోప్లేన్ల ద్వారా కస్టమర్లకు విజయవంతంగా చేరవేయగలిగింది. ఈ పరిణామాన్ని అప్పట్లో ఒక అద్భుతంగా అభివర్ణించారు.

read more: India EV Market: ఏటా కోటి విద్యుత్‌ వాహనాల విక్రయాలు

గత రెండున్నరేళ్లలో.. అమేజాన్‌ ఎయిర్‌పోర్ట్‌కి 100 మైళ్ల దూరంలో నివసించే అమెరికా ప్రజల సంఖ్య 55 శాతం నుంచి ఏకంగా 75 శాతానికి జంప్‌ అయింది. దీంతో డిమాండ్‌ సైతం అదే స్థాయిలో పెరిగింది. ఈ గిరాకీని తట్టుకోవటానికి అమేజాన్‌ కంపెనీ జల మార్గ రవాణాలోకి కూడా రంగ ప్రవేశం చేసింది. తద్వారా లాజిస్టిక్స్‌ సెక్టార్‌ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. తర్వాత కాలంలో.. తన అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతాన్ని నౌకల ద్వారానే నిర్వహించే రేంజ్‌కి అమేజాన్‌ ఎదిగింది. ఈ క్రమంలో సొంతగా కార్గో షిప్‌లను, షిప్పింగ్‌ కంటెయినర్లను సమకూర్చుకోగలిగింది.

2021లో కరోనా నేపథ్యంలో జల రవాణా మార్గంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. షిప్పింగ్‌ కంటెయినర్ల కొరత ఏర్పడింది. సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. 2019లో 2 వేల డాలర్లుగా ఉన్న ఖర్చు 2021లో 20 వేల డాలర్లకు ఎగబాకింది. దీంతో ఇతర కంపెనీలు ఈ భారాన్ని కన్జ్యూమర్ల పైన మోపాయి. అమెజాన్‌ మాత్రం పోటీ సంస్థల కన్నా భిన్నంగా ఆలోచించింది. సొంతగా షిప్పింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని డెలివరీ డిలే కాకుండా, ఖర్చులు తడిసి మోపెడవకుండా చూసుకోగలిగింది.

సరుకును అన్‌లోడింగ్‌ చేసుకునే విషయంలో వెయిటింగ్‌ పీరియడ్‌ను కుదించటం కోసం రద్దీ తక్కువగా ఉండే నౌకాశ్రయాలకు చేరుకొని స్టాక్‌ను సొంత ట్రక్కుల్లోకి చేర్చి నిల్వ ఉంచేది. తద్వారా వేరే కంపెనీల కన్నా త్వరగా సరుకును డెలివరీ చేసేది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఆర్డర్లు సత్వరం తమ ఇంటికి చేరాలనేదే వినియోగదారుల ఆకాంక్ష అని, మరో 50 ఏళ్లయినా ఈ మౌలిక సూత్రంలో మార్పు రాదని అమేజాన్‌ పేర్కొంటోంది. విమానాల్లో, ఓడల్లో సరుకు రవాణా వల్ల ఖర్చు పెరిగినప్పటికీ డెలివరీ అనేది సూపర్‌ఫాస్ట్‌గా జరుగుతోందని చెబుతోంది.

మారుతున్న కాలానికి తగ్గట్లు అమేజాన్‌ తన లాజిస్టిక్స్‌ బిజినెస్‌ వ్యూహాలను సవరించుకుంటోంది. ప్రస్తుతం క్లౌడ్‌ సర్వీసుల పైన ఫోకస్‌ పెట్టింది. అమేజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. AWSకి శ్రీకారం చుట్టింది. డెలివరీ స్పీడ్‌ తగ్గకుండా మెయింటెయిన్‌ చేసేందుకు ట్రక్కులు, ఎరోప్లేన్లు, షిప్‌లను కొనటం, లీజుకి ఇవ్వటం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లోనే గూడ్స్‌ డెలివరీ చేసేందుకు డాలర్ల కొద్ది డబ్బు ఖర్చు పెడుతోంది. ఈ మౌలిక సదుపాయాలను కూడా ఒక సర్వీసు మాదిరిగా విక్రయించటం తదుపరి లాజికల్‌ స్టెప్‌ అని అమెజాన్‌ గ్రహించి అమలుచేస్తోంది.

2022వ సంవత్సరంలో అమేజాన్‌ సంస్థ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ అనే కాన్సెప్ట్‌ని తెర మీదికి తెచ్చింది. ఇది.. అమేజాన్‌ మాదిరి డెలివరీ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇతర సంస్థలకు, వ్యాపారులకు అందిస్తుంది. దీని ద్వారా డెలివరీ మరింత వేగంగా జరగనుందని భావిస్తోంది. ఈ విధానంలో వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అమేజాన్‌ డెలివరీ సర్వీసులను వాడుకోవచ్చు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో కస్టమర్లు అమేజాన్‌ కాకుండా ఇతర వెబ్‌సైట్లలోనూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసుకోవచ్చు. అమెరికాలో తలపెట్టిన ఈ ప్రణాళికను ఇండియాలో కూడా అమలుచేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలో.. అమేజాన్‌ విమానాలు, నౌకలు, ట్రక్కులు భవిష్యత్తులో ఆ సంస్థ ఉత్పత్తులనే కాకుండా అన్ని కంపెనీల ప్రొడక్టులనూ డెలివరీ చేస్తాయి. తద్వారా.. నింగీ.. నేలా.. నీరు.. ఇలా అన్ని దారుల్లోనూ అమేజాన్‌ మన దరికి చేరుతుంది. ఏ టూ జెట్‌.. తన ముద్ర ఉండేట్లు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. దీంతో.. ఇక.. అమేజానా.. మజాకా.. అనకతప్పదేమో.