NTV Telugu Site icon

BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ.. ఆసక్తికరంగా బుక్‌మైషో రిపోర్ట్‌

South India Cinema Bookmyshow Report

South India Cinema Bookmyshow Report

South India Cinema-BookMyShow Report: సౌతిండియా సినిమా లెవల్ ఇప్పుడు పాన్ఇండియా రేంజ్‌ని దాటేసి ప్రపంచ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌లను ఓవర్‌టేక్‌ చేసేసింది. ఈ మేరకు బుక్‌మైషో రిపోర్ట్‌ పలు ఉదాహరణలను వెల్లడించింది. ఇందులో ముందుగా కేజీఎఫ్‌ మూవీ గురించి చెప్పుకోవాలి. యశ్‌ హీరోగా రూపొందించిన ఈ చలన చిత్రం సంచలనం సృష్టించింది. కేజీఎఫ్‌ చాప్టర్‌-2 ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

తద్వారా ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన పిక్చర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫిల్మ్‌ టీజర్‌ కూడా రికార్డు నెలకొల్పటం విశేషం. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే ఎక్కువ మంది చూసిన టీజర్‌గా సరికొత్త ఫీట్‌ సాధించింది. కేజీఎఫ్‌ చాప్టర్‌-2 తర్వాత ట్రిపుల్‌ ఆర్‌ గురించి ప్రస్తావించాలి. కొవిడ్‌ ప్రారంభమైన తర్వాత రిలీజై ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్‌ డాలర్లకు పైగా డబ్బులు తెచ్చిపెట్టిన మొట్టమొదటి ఇండియన్‌ మూవీగా ట్రిపుల్‌ ఆర్‌ అరుదైన ఘనత పొందింది.

read also: Tech Layoffs: ఇంటికే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ల సంఖ్య లక్షన్నర. 2008 కన్నా ఈ ఏడాదే అధిక ‘టెక్‌’ లేఆఫ్స్

కేజీఎఫ్‌ చాప్టర్‌-2 మాదిరిగానే ఈ సినిమా కూడా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కాసులు కురిపించింది. ట్రిపుల్‌ ఆర్‌ వివిధ భాషల్లో విడుదలై సక్సెసైనప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ కాలర్‌ ఎగరేసుకొని చెప్పుకునేంత అతిభారీ విజయాన్ని నమోదుచేసింది. ట్రిపుల్‌ ఆర్‌ అనంతరం గొప్ప పేరు తెచ్చుకున్న చిత్రం కాంతార. ఈ కన్నడ సినిమాను 96 రోజుల్లోనే తెరకెక్కించారు. బడ్జెట్‌ సైతం చాలా తక్కువ.

కేవలం 16 కోట్ల రూపాయలతోనే రూపొందించిన ఈ పిక్చర్‌ వరల్డ్‌వైడ్‌గా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ ఫిల్మ్స్‌లో చోటు దక్కించుకుంది. కాంతార తర్వాత కంపల్సరీగా చర్చించుకోవాల్సిన మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’. 1990ల్లో కాశ్మీరీ పండిట్ల వలసల ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, పల్లవీ జోష్‌, దర్శన్‌ కుమార్‌ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

ఈ పిక్చర్‌ ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. విక్రమ్‌, కార్తి, త్రిష, ఐశ్వర్యారాయ్‌ తదితరులు నటించిన పొన్నియన్‌ సెల్వవన్‌-పార్ట్‌ వన్‌ మూవీ.. విడుదలైన వారం రోజుల్లోనే 350 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేయటం విశేషం. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌ మూవీ వరల్డ్‌ వైడ్‌గా 418 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూని జనరేట్‌ చేసింది. ఈ చిత్రం ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన సినిమాల లిస్టులో 6వ స్థానంలో నిలిచింది.

కమల్‌హాసన్‌, ఫహద్ ఫాసిల్, విజయ్‌ సేతుపతి, కాళిదాస్‌ జయరాం, సూరియా తదితరులు నటించిన విక్రం మూవీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 410 కోట్లు రాబట్టింది. అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ ఖన్నా మరియు టబు నటించిన హిందీ దృశ్యం-2 మూవీ.. నెల రోజుల కిందటే రిలీజ్‌ అయినప్పటికీ వరల్డ్‌ వైడ్‌గా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుంది.

ఇది.. గ్లోబల్‌ స్థాయిలో 300 కోట్ల రూపాయల మార్క్‌ దాటిన అజయ్‌ దేవ్‌గణ్‌ మూడో సినిమా కావటం గమనించాల్సిన విషయం. అనీజ్‌ బాజ్మీ డైరెక్షన్‌లో కార్తీక్‌ ఆర్యన్‌, కైరా అద్వానీ మరియు టబు నటించిన భూల్ భులయ్యా-2 మూవీ ఈ ఏడాది 200 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసిన మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలిచింది. వరల్డ్‌ వైడ్‌గా 260 కోట్ల రూపాయల మార్క్‌ను క్రాస్‌ చేసింది.

‘‘డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’’ అనే ఇంగ్లిష్‌ సినిమా.. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా తెరకెక్కించిన మిగతా చిత్రాలతో పోల్చితే తక్కువ వసూళ్లే సాధించింది. విడుదలైన ఐదు వారాల వ్యవధిలో 129 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం 909 మిలియన్‌ డాలర్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. బుక్‌మైషో విడుదల చేసిన నివేదికలోని ఈ డేటాను పరిశీలిస్తే హాలీవుడ్‌, బాలీవుడ్‌ పిక్చర్ల కన్నా సౌతిండియా సినిమాలే మనీ సునామీని సృష్టించాయని స్పష్టంగా తేలిపోతోంది.

Show comments