NTV Telugu Site icon

Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‌‘ పవన్‌ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ

Skyroot Aerospace

Skyroot Aerospace

Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్‌లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీ ఫౌండర్‌ పవన్‌ చందన. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనేది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌.

ఈ కంపెనీ ‘విక్రమ్-ఎస్‌’ పేరుతో రూపొందించిన రాకెట్‌ను నవంబర్‌ 18న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నింగిలోకి విజయవంతంగా పంపిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఒక ప్రైవేట్‌ కంపెనీ నిర్మించిన రాకెట్‌ను ఇస్రో ప్రయోగించటం ఇదే తొలిసారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అంతరిక్ష రంగంలో అవకాశాలకు ఆకాశం కూడా హద్దు కాదంటున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు పవన్‌ చందనతో ‘ఎన్-బిజినెస్‌‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూ ఇది. పవన్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

2018లో ‘స్టార్ట్’ప్ 

స్కైరూట్ ఏరోస్పేస్‌ను 2018లో ప్రారంభించాం. ఇస్రోలో 2012 నుంచి 2018 వరకు ఆరేళ్లపాటు సైంటిస్ట్‌గా పనిచేశాను. ఆ సమయంలోనే ఈ సెక్టార్‌లో ప్రైవేట్‌ కంపెనీని స్టార్ట్‌ చేయాలనిపించింది. అఫ్‌కోర్స్‌.. ఇస్రో కూడా అప్పట్లో కొన్ని ప్రైవేట్‌ ప్రాజెక్టులు చేసేది. దీంతో నేను, నా ఫ్రెండ్‌ భరత్‌ ఈ దిశగా ఎంతో అనాలసిస్‌, స్టడీ చేశాం. ఎన్నో ఛాలెంజ్‌లు ఉంటాయని అర్థమైంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తామనే నమ్మకం కుదిరాక ఇస్రోలో ఉద్యోగాలు వదులుకొని 2018 జూన్‌/జులైలో స్కైరూట్‌కి శ్రీకారం చుట్టాం.

కంపెనీ ప్రారంభించటం అద్భుతమైన అనుభవంగా మిగిలిపోయింది. ఫస్ట్‌ రాకెట్‌ లాంఛింగ్‌ కోసం నాలుగేళ్లు ఎదురుచూశాం. రాకెట్‌ లాంఛింగ్‌ కన్నా ముందు.. సంస్థను ప్రారంభించటం.. స్టాఫ్‌(బిగ్‌ టీమ్‌)ను రిక్రూట్‌ చేసుకోవటం.. ఇలా చాలా పనులు చేశాం. వాటన్నింటికీ కలిపి సుదీర్ఘ సమయం పట్టింది. రాకెట్‌ లాంఛింగ్‌కు నెల రోజుల ముందు ఎంతో హడావుడి అయింది. ముఖ్యంగా వాతావరణం సహకరించలేదు. సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. దీంతో రాకెట్ లాంఛింగ్‌ ఆలస్యమైంది.

అందుకే ‘ప్రారంభ్’ పేరు

అనుకున్నవన్నీ అనుకున్నట్లు సమయానికి జరగకపోయేసరికి టెన్షన్‌ అనిపించింది. చివరికి అంతా బాగానే జరిగింది. మా ప్రాజెక్టు కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. మీడియా కూడా బాగా ఫోకస్‌ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అందరూ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇది దేశానికి, మాకు, మా టీమ్‌కు శుభపరిణామమని చెప్పొచ్చు. అందుకే ఈ మిషన్‌కి ‘‘ప్రారంభ్‌’’ అనే పేరు పెట్టాం. విక్రమ్-ఎస్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. దాని తర్వాత మేం లాంఛ్ చేయబోయే ప్రాజెక్ట్‌ పేరు విక్రమ్‌-1.

ఈ ప్రాజెక్టును ఏడాదిలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ఏడంతస్తుల భవనమంత ఎత్తులో ఉండే పెద్ద రాకెట్‌. విక్రమ్‌-ఎస్‌ కన్నా 4 రెట్లు పెద్దది. ఇందులో మల్టిపుల్‌ శాటిలైట్లు ఉంటాయి. ఈ ఏడాది మొత్తం దీనిపైనే ఫోకస్‌ పెడతాం. తర్వాత మరిన్ని లాంఛింగ్‌లు చేస్తాం. ఒక ప్రైవేట్‌ కంపెనీ.. రాకెట్‌కు రూపకల్పన చేసి తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా అంతరిక్షంలోకి పంపటం చాలా పెద్ద విషయం. ఇది సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో మమ్మల్ని మంత్రి కేటీఆర్‌ కూడా ‘స్పేస్-ఎక్స్‌’ అధిపతి ఎలాన్‌ మస్క్‌తో పోల్చారు.

ఎలాన్ మస్క్ ఆదర్శం

మేం ఎలాన్‌ మస్క్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన ఈ పనిని ఎప్పుడో చేశారు. ప్రపంచం అడ్వాన్స్‌గా ఉంది. మనం ఎంతో సాధించటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అంతరిక్ష రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మన ఆలోచనా విధానం కూడా మారింది. ఏదేమైనా మేం ముందడుగు వేశామనే సంతృప్తి కలుగుతోంది. మంత్రి కేటీఆర్‌ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. స్పేస్‌ సెక్టార్‌లో ప్రైవేట్‌ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. నిజం చెప్పాలంటే భారతదేశానికి తెలంగాణే పెద్ద స్టార్టప్‌.

ప్రజలు మొదట ఏదైనా ఒక చిన్నది చేసి, విజయం సాధించాక పెద్దది చేపడదామనుకుంటారు. పెద్దదైనా, చిన్నదైనా మనం పెట్టాల్సిన ఎఫర్ట్‌ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే తొలిసారి ప్రారంభిస్తున్నాం కాబట్టి. అందువల్ల ముందే పెద్దగా ఆలోచించటం బెటర్‌. ఒక్కసారే పెద్ద పని మొదలుపెడితే ఫెయిల్‌ అవుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్‌ కాదు. పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సాధించబోయే విజయం కూడా పెద్దగానే ఉంటుంది. అందరూ మనకు మద్దతుగా ఉంటారు. మనతో భాగస్వాములవుతారు.

స్పేస్ కెరీర్ బెస్ట్

అంతరిక్ష రంగంలో ఏదైనా ఒక ప్రాజెక్టును మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. ఈ నాలుగేళ్లలో మాకు 26 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. ఫ్యూచర్‌ ప్రాజెక్టుల కోసం, ఫ్యూచర్‌ టెక్నాలజీ కోసం నిధుల సమీకరణను కొనసాగిస్తూనే ఉన్నాం. 2 వేల కోట్ల రూపాయల వరకు ఫండ్‌ రైజ్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాం. జర్నీ ఇప్పుడే స్టార్ట్‌ అయింది కాబట్టి మూలధన వ్యయం ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే మేం పెద్దఎత్తున ప్రాజెక్టులను చేపడతామో అప్పుడు మాకు రెవెన్యూ కూడా జనరేట్‌ అవుతుంది.

పిల్లలను ఇప్పటినుంచే స్పేస్‌ కెరీర్‌ దిశగా ఎంకరేజ్‌ చేయాలని పేరెంట్స్‌కి సూచిస్తున్నాను. ఎందుకంటే.. ఈ రంగంపైన ప్రతిఒక్కరికీ ఇంట్రస్ట్‌ ఉంటుంది. రాకెట్లు.. శాటిలైట్లు.. సహజంగానే అందరినీ ఆకర్షిస్తాయి. పిల్లల్లో ఈ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే.. ముందు.. పిల్లల్లో ఒక స్ఫూర్తిని రగిలించాలి. ఆ దిశగా పయనించేట్లు గైడెన్స్‌ ఇవ్వాలి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సెక్టార్‌ని ప్రోత్సహించటంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎనలేనిది. నిజం చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే స్పేస్‌ సెక్టార్‌లో సంస్కరణలు లేవు. అవే లేకపోతే మేం లేం. మా సంస్థ లేదు.

ప్రభుత్వ ప్రోత్సాహం అద్భుతం

ప్రభుత్వపరంగా అనుమతులు, ఆథరైజేషన్లు, లైసెన్సులు ఇవ్వటం చాలా ముఖ్యం. దేశంలోనే మొదటిసారిగా ప్రాజెక్టు చేపట్టాం కాబట్టి ఇవి ఇంకా ఆలస్యమవుతాయేమో అని అనుకున్నాం. కానీ.. ఈ విషయంలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ కనీసం ఒక్క రోజు కూడా లేట్‌ చేయలేదు. మా కంటే ఎక్కువగా గవర్నమెంట్‌ ఆఫీసర్లు ఈ దిశగా ఉత్సాహం ప్రదర్శించారు. ఈ రంగంలోనే కాదు. ఏ రంగంలోనైనా ఏదైనా కొత్తగా చెయ్యాలనుకునేవాళ్లను వెన్నుతట్టి ఎంకరేజ్‌ చేయటానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది.

స్కైరూట్‌ సంస్థను స్థాపించి ఇంత తక్కువ సమయంలో రాకెట్‌ ప్రయోగాన్ని పూర్తి చేశామంటే భారతదేశంలో సాధించలేనిది ఏదీ లేదనేంత ఆత్మవిశ్వాసం మాలో పెరిగింది. మమ్మల్ని చూసి చాలా మంది ఈ రంగంలో స్టార్టప్‌లను మొదలుపెట్టారు. ఎన్నో సంస్థలు ప్రభుత్వం వద్ద పేర్లను నమోదుచేసుకున్నాయి. ఈ పరిశ్రమ చాలా పెద్దది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశం కూడా హద్దు కాదు. ప్రభుత్వం సైతం సపోర్ట్‌ చేస్తోందనే నమ్మకం ఎంట్రప్రెన్యూర్లలో పెరిగింది. అందుకే ఈ సెక్టార్‌ని మరింత విస్తరించేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.

రెవెన్యూ జనరేషన్ కూడా..

మా సంస్థ ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. మనం రాకెట్‌ను, శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపటంతోనే పనైపోదు. ముందు వాటిని స్పేస్‌లోకి పంపటానికి లాంఛింగ్‌ కంపెనీలతో కొలాబరేట్‌ అయ్యాం. రాకెట్‌ని, శాటిలైట్‌ని అంతరిక్షంలో మూమెంట్‌ చేయటానికి ‘ఇన్‌ స్పేస్‌’ కంపెనీలతో టైఅప్‌ అయ్యాం. విక్రమ్‌-ఎస్‌ రూపకల్పనని మేం రెండు సంవత్సరాల కిందట మాత్రమే ప్రారంభించాం. కానీ.. నెక్‌స్ట్‌ లాంఛ్‌ చేయబోయే విక్రమ్‌-1పైన మాత్రం 2018 నుంచి పనిచేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్నాయి.

రాకెట్లను, శాటిలైట్లను లాంఛ్‌ చేయటం ఎంత ముఖ్యమో.. వాటి ద్వారా రెవెన్యూ జనరేట్‌ చేయటం కూడా అంతే ముఖ్యం. అందుకే కమర్షియల్‌ స్పేస్‌ సెక్టార్‌ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా బిజినెస్‌ పెంచాలని భావిస్తున్నాం. గ్లోబల్‌ మార్కెట్‌లో ఇండియా షేర్‌ పెరగాల్సిన అవసరం ఉంది. ప్రయాణంలో మేం ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాం. విక్రమ్‌-1 కోసం 526 కోట్ల రూపాయల ఫండ్‌ రైజ్‌ చేశాం. విక్రమ్‌-ఎస్‌ లాంఛింగ్‌ నాటికి 400 కోట్లు ఖర్చు చేశాం.