OYO Rooms: హోటల్ గోడల మీద ఓయో అని రాసి ఉండటాన్ని మనమంతా గమనించే ఉంటాం. కానీ.. అసలు.. ఆ.. ఓయో అంటే ఏంటి? అనేది మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు. తర్వాతర్వాత.. అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఓయో అనేది.. ఇండియాలోని.. ది బెస్ట్ ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్.
read more: Cinema to the people: ప్రజల వద్దకు సినిమా. ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఇంట్లోనే చూసేందుకు ఏపీలో ఏర్పాట్లు
ఆ సంస్థ ఓనర్ పేరు రితేష్ అగర్వాల్. ఆయనొక కాలేజీ డ్రాపౌట్. చదువును మధ్యలోనే వదిలేసిన ఆ వ్యక్తి ఇవాళ ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించాడు. సింగిల్ రూమ్‌తో జర్నీ మొదలుపెట్టి గ్లోబల్ రేంజ్‌కి ఎదిగాడు. అసాధారణం అనిపించేలా సాగిన ఈ ఇన్‌స్పిరేషనల్ జర్నీ ఎలా సాధ్యమైందో ఇవాళ్టి మన డిఫైనింగ్ పర్సనాలిటీలో చెప్పుకుందాం..
రితేష్ అగర్వాల్.. దాదాపు 30 ఏళ్ల కిందట.. 1993 నవంబర్ 16న ఒడిస్సాలోని రాయగడ అనే ప్రాంతంలో జన్మించారు. ఉన్నత విద్య కోసం ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో చేరిన ఆయన.. కోర్సును పూర్తిచేయకుండా సగంలోనే బయటికొచ్చేశారు.
చిన్నప్పటి నుంచీ కొత్తగా ఆలోచించే రితేష్ అగర్వాల్‌కి ఆ చదువు ఎక్కలేదు. దీనికితోడు ఆయనకు సొంతగా వ్యాపారం
చేయాలని ఉండేది. దీంతో ఆ దిశగా పయనం ప్రారంభించాడు. ముందుగా.. కోడింగ్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌ను స్వతహాగా నేర్చుకున్నాడు.
దానికి తగిన వనరులు మరియు విద్యార్హత లేకపోయినప్పటికీ అమితాసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాడు. రితేష్ అగర్వాల్.. 17 ఏళ్ల చిన్న వయసులో.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే గట్టి పట్టుదలతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆయన దగ్గర అతికొద్ది మొత్తంలో మాత్రమే డబ్బు ఉండటం గమనించాల్సిన విషయం.
రితేష్ అగర్వాల్ వద్ద కాసులు తక్కువే ఉన్నప్పటికీ కలలకు మాత్రం కొదవలేదు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవటం కోసం అహర్నిశలు ప్రయత్నించాడు. మన దేశం మొత్తం కలియ తిరిగాడు. తన బడ్జెట్‌కి తగ్గినట్లు తక్కువ రేటుకు దొరికే హోటల్స్‌లో గడిపేవాడు. ఆ సమయంలో.. ఇండియాలో.. ఆతిథ్య రంగం తీరుతెన్నులను దగ్గరగా పరిశీలించాడు.
అందుబాటు ధరల్లో.. హై క్వాలిటీ వసతులు లేకపోవటాన్ని గుర్తించాడు. రితేష్ అగర్వాల్.. హాస్పిటాలిటీ మార్కెట్ లోటుపాట్లను వినియోగదారుల కోణంలో నుంచి గమనించాడు. అలాంటి లోపాలులేని అకామడేషన్ కల్పించాలని సంకల్పించాడు. అందుకోసం Oravel Stays అనే సంస్థను ప్రారంభించాడు.
సరసమైన రేట్లకే సకల సదుపాయాలు కలిగిన హోటల్ గదులను అందుబాటులోకి తేవటం కోసం ఏర్పాట్లు చేశాడు. ముందుగా.. ఆహా అనిపించే వసతులు ఏ హోటల్స్‌లో ఉన్నాయో గుర్తించి వాటితో లిస్టు తయారుచేశాడు. ఆ హోటల్ రూమ్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించాడు.
ఆధునిక ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా ఆ హోటల్ గదులను రీడిజైన్ చేయించాడు. ఎట్టకేలకు.. అతని శ్రమ ఫలించింది. Oravel Staysని లాంఛ్ చేసిన స్వల్ప కాలంలోనే రితేష్ అగర్వాల్‌కి ఫైనాన్షియల్‌గా మంచి సపోర్ట్ లభించింది. థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ రూపంలో లక్ష డాలర్ల గ్రాంట్ చేతికందింది.
దీంతో అతను ఇక వెనుదిరిగి చూడలేదు. కంపెనీ పేరును ఓయోగా మార్చాడు. ఓయో అంటే.. ఆన్ యువర్ ఓన్ అని అర్థం. కొత్తగా ఏదైనా కనిపెట్టాలి.. సొంతగా ఏదైనా సాధించాలి.. అనే రితేష్ అగర్వాల్ మనస్తత్వానికి ఈ పేరు సరిగ్గా సరిపోయింది. ఆయన ఆశించినట్లే.. ఓయో.. పెద్ద సక్సెస్ అయింది.
మన దేశంలోని మధ్య తరగతి ప్రజల బడ్జెట్ యాంగిల్‌లో.. ఓయో.. బిగ్ హిట్ కొట్టింది. దీంతో.. 2018లో బిలియన్
డాలర్ల ఫండ్‌రైజ్ చేసింది. ఏడాది తిరిగే సరికి రితేష్ అగర్వాల్.. ఓయోలో 2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనగలిగే స్థితికి వచ్చాడు. తద్వారా ఆ సంస్థలోని తన వాటాను మూడు రెట్లు చేసుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఫోర్బ్స్ సంస్థ.. ఆసియాకి సంబంధించి రూపొందించిన.. 30 అండర్ 30 లిస్టులో 2వ యంగెస్ట్ బిలియనీర్‌గా నిలిచాడు. ఆ టైమ్‌లో ఆయన సంపద విలువ దాదాపు ఒకటీ పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా నమోదైంది.
సింగిల్ రూమ్‌తో బిజినెస్ మొదలుపెట్టిన రితేష్ అగర్వాల్‌కి ఇప్పుడు ఇండియాలోనే 2 వేలకు పైగా హోటల్స్.. ఓయో గొడుగు కిందికి వచ్చాయి. దీంతో ఆయన నేపాల్, మలేషియా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఓయో సర్వీసులు అందిస్తున్నాడు.
మన దేశంలోని ఒక చిన్న మారుమూల పట్టణంలో పుట్టి పెరిగిన ఓ యువకుడు.. ఈ రోజు గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్నాడు. సాధించాలని మనసు కలిగితే.. కాదేదీ మీకసాధ్యం అని నిరూపించాడు. అందరి కన్నా భిన్నంగా ఆలోచించి.. కష్టపడి పనిచేస్తే.. జీవితంలో తప్పకుండా పైకొస్తామని పది మందికీ చాటాడు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని.. రితేష్‌లవుతారని.. స్ఫూర్తి నింపాడు.