NTV Telugu Site icon

New Year 2023: ఫ్యూచర్‌ యూనికార్న్‌లకు న్యూఇయర్ 2023 కలిసొస్తుందని అంచనా

New Year 2023

New Year 2023

New Year 2023: ఇండియాలో గతేడాది 46 కంపెనీలు యూనికార్న్‌ హోదా పొందగా ఈ సంవత్సరం 22 సంస్థలే ఈ స్టేటస్‌ సాధించాయి. అంటే కొత్త యూనికార్న్‌ల సంఖ్య సగం కన్నా తక్కువకు పడిపోయింది. అయితే.. ఫ్యూచర్‌ యూనికార్న్‌లు ఈ ఏడాది భారీగానే పెరిగాయి. ఈ విషయాలను రెండు వేర్వేరు సంస్థల నివేదికలు వెల్లడించాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద స్టార్టప్స్‌ అండ్‌ యూనికార్న్స్‌ ఎకోసిస్టమ్‌గా ఇండియా ఎదగటం విశేషం.

ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది.. ఆటోమొబైల్‌, ఫిన్‌టెక్‌, క్లీన్‌టెక్‌, అగ్రిటెక్‌, లైఫ్‌స్టైల్‌ డీప్‌ టెక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ క్లైమేట్‌ టెక్‌ సెక్టార్లు హయ్యర్‌ వ్యాల్యుయేషన్‌ పొందనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో 20 సంస్థలు యూనికార్న్‌లుగా ప్రమోషన్‌ పొందగా చివరి 6 నెలల్లో కేవలం రెండు కంపెనీలే ఈ పదోన్నతి పొందాయి.

read also: Today (23-12-22) Stock Market Roundup: వారాంతం ఘోరాతిఘోరం. స్టాక్ మార్కెట్ ‘వీక్’ ఎండ్

నిధుల లభ్యత తగ్గిపోవటమే దీనికి ప్రధాన కారణమని రిపోర్టులు పేర్కొన్నాయి. స్టార్టప్స్‌కి ఫండింగ్‌.. ప్రాణంతో సమానం. డబ్బు లేకపోతే అవి మనుగడ సాధించలేవు. వాస్తవానికి ఈ ఫండ్స్‌ సమస్య గతేడాది నాలుగో త్రైమాసికంలోనే కనిపించింది. అప్పటి నుంచి మరింత పెరుగుకుంటూ వచ్చి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పూర్తిగా కుంటుపడింది. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగటం మరియు ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలో.. ఒక స్టార్టప్‌.. సిరీస్‌-ఏ ఫండింగ్‌ స్టేజ్‌ నుంచి యూనికార్న్‌ రౌండ్‌కి వెళ్లటానికి పట్టే యావరేజ్‌ టైం ఈ సంవత్సరంలో కనీసం ఐదేళ్లకు మించిపోయింది. 2021 జనవరి-నవంబర్‌ మధ్య కాలంతో పోల్చితే 2022లో ఇదే సమయంలో ఫండింగ్‌ రౌండ్ల సంఖ్య 30 శాతం పడిపోయింది. పెద్ద పెద్ద డీల్స్‌కైతే నిధుల లభ్యత మరింతగా క్షీణించింది. వంద మిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటేందుకు సమీపంలోకి వచ్చిన కంపెనీల సంఖ్య ఈ ఏడాది 35 శాతం తగ్గిపోయి 55కి దిగొచ్చింది.

కిందటి ఏడాది ఈ కంపెనీల సంఖ్య 85 అని జియో వార్షిక నివేదిక గుర్తు చేసింది. ఫండింగ్‌ రౌండ్ల సంఖ్య తగ్గటంతోపాటు కంపెనీల వ్యాల్యుయేషన్‌ కూడా తక్కువగా ఉండటం సర్వసాధారణంగా మారిందని, అందుకే కొత్త యూనికార్న్‌ల గ్రోత్‌ పడిపోయిందని కేపీఎంజీ వెంచర్‌ ప్లస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు.. యూనికార్న్‌ అనే విశిష్ట గుర్తింపు పొందేందుకు అతిదగ్గరగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య మరియు ఎంట్రప్రెన్యూర్ల సంఖ్య ఈ ఏడాది స్థిరంగా పెరిగింది.

ఇండియాలో ఇప్పుడు 69 వేల స్టార్టప్‌లు ఉండటం గొప్ప విషయం. 2022 సంవత్సరానికి సంబంధించిన మరో ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం.. యూనికార్న్‌ల సంఖ్య కన్నా గజెల్స్‌ అండ్‌ చీతాస్‌ సంఖ్య పెరగటం. రెండేళ్ల వ్యవధిలో యూనికార్న్‌ హోదా పొందగలిగే సామర్థ్యం గల స్టార్టప్‌లను గజెల్స్‌ అంటారు. నాలుగేళ్ల వ్యవధిలో యూనికార్న్‌గా ఎదిగే కెపాసిటీ కలిగిన స్టార్టప్‌లను చీతాస్‌గా పేర్కొంటారు. మన దేశంలో ఇప్పుడు 84 యూనికార్న్‌లు, 51 గజెల్స్‌, 71 చీతాస్‌ ఉన్నాయి. గతేడాది 51 యూనికార్న్‌లు, 32 గజెల్స్‌, 54 చీతాలు మాత్రమే ఉండేవి.