(ఏప్రిల్ 24న రాజ్ కుమార్ పుట్టినరోజు)
తెలుగులిపికి, కన్నడ లిపికి అత్యంత సామీప్యం ఉంటుంది. అలాగే తెలుగువారికి, కన్నడిగులకు కూడా ఎంతో అనుబంధం. కన్నడనాట మన తెలుగు సినిమా వారి ప్రాభవం ఈ నాటికీ వెలుగొందుతూనే ఉంది. స్వరాజ్యానికి పూర్వం ప్రస్తుతం కన్నడనాట ఉన్న పలు కేంద్రాలు ఆ నాడు తెలుగువారి ప్రాభవంతో సాగాయి. అందువల్ల తొలినుంచీ కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో తెలుగువారిదే పైచేయిగా సాగింది. అలాంటి కన్నడ చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా సాగిన రాజ్ కుమార్ అంటే తెలుగువారికీ ఎంతో అభిమానం. ఎందువల్ల అంటే, రాజ్ కుమార్ నటజీవితం ఆరంభంలో నటించిన ‘బేడర కన్నప్ప’ చిత్రం తెలుగులో ‘కాళహస్తి మహాత్మ్యం’ పేరుతో రూపొందింది. తెలుగునాట కూడా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఘంటసాల పాడిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఆ తరువాత కన్నడ రాజ్ కుమార్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. నటునిగానే కాకుండా, గాయకునిగానూ కన్నడిగులను ఎంతగానో మురిపించారు రాజ్ కుమార్. అందుకే ‘నటసార్వభౌమ’గా, ‘కన్నడ కంఠీరవ’గా, ‘గానగంధర్వ’గా ఆయన కన్నడ సీమను పులకింప చేశారు.
తెలుగువారితో బంధం
అంతకు ముందు కన్నడ సీమలో కొందరు రంగస్థల నటులు రాజ్యమేలారు. రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ ముగ్గురూ తరువాతి రోజుల్లో కన్నడ చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ఈ ముగ్గురినీ ‘కన్నడ చిత్రసీమ త్రిమూర్తులు’ అని పిలిచేవారు. అయితే వారిలో అత్యధిక కాలం స్టార్ గా వెలుగొందింది మాత్రం రాజ్ కుమార్ అనే చెప్పాలి. తనను ‘కాళహస్తి మహాత్మ్యం’లో ఎంతగానో ఆదరించిన తెలుగువారంటే రాజ్ కుమార్ కు ఎంతో అభిమానం. ఇక ఆయన ఇష్టదైవం తెలుగునేలపై కొలువైన మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి.
యన్టీఆర్ తోనే పోటీ!
తెలుగునాట సూపర్ స్టార్స్ గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య, యన్.టి.రామారావు, ఏ.నాగేశ్వరరావు అంటే రాజ్ కుమార్ కు ఎంతో గౌరవం. వారిలో యన్టీఆర్ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు – యన్టీఆర్ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్ కుమార్ హీరోగా రీమేక్ అయ్యాయి. అంతేకాదు, యన్టీఆర్ లాగా తానూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి కన్నడ వాసులను అలరించారు రాజ్ కుమార్. యన్టీఆర్ నటించిన “పెళ్ళిచేసి చూడు, సత్య హరిశ్చంద్ర, భూకైలాస్, బందిపోటు, కదలడు-వదలడు” వంటి చిత్రాల కన్నడ రీమేక్స్ లో రాజ్ అభినయించారు. యన్టీఆర్ నటజీవితంలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కులగౌరవం’. ఈ చిత్రానికి కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘కులగౌరవ’ ఆధారం. యన్టీఆర్ లాగే కన్నడనాట శ్రీరామ, శ్రీకృష్ణ వంటి దేవతామూర్తుల పాత్రల్లో నటించి, రావణ, హిరణ్యకశ్యప, కంస, శిశుపాల వంటి ప్రతినాయక పాత్రల్లోనూ అలరించారు రాజ్. ఇక బెంగళూరు, బళ్ళారి, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో యన్టీఆర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆ యా ప్రాంతాల్లో యన్టీఆర్ తో పోటీగా రాజ్ కుమార్ సినిమాలు విడుదలయ్యేవి. వారిద్దరి మధ్యనే కన్నడవాసులు పోటీ ఉందని భావించేవారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయాలు చూశాయి. అక్కడ తమిళ స్టార్ హీరోస్ ఎమ్జీఆర్, శివాజీగణేశన్ చిత్రాలు విడుదలైనా, ఎందుకనో రామారావునే రాజ్ కుమార్ అభిమానులు పోటీగా భావించేవారు. అయితే, రాజ్ కుమార్ మాత్రం యన్టీఆర్ ను తన అన్నలాగే అభిమానించేవారు. మరో విశేషమేమంటే, రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇక రాజ్ కుమార్ మరో కుమారుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో జూనియర్ యన్టీఆర్ “గెలెయ గెలెయా..” అంటూ సాగే కన్నడ పాట పాడి ఆకట్టుకున్నారు.
మనవారితో రాజ్ చిత్రబంధం!
కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘సంత తుకారాం’ను ఏయన్నార్ తో ‘తుకారాం’గా తెరకెక్కించారు. ‘భక్త కుంబార’ చిత్రాన్ని తెలుగులో అక్కినేనితో ‘చక్రధారి’గా రూపొందించారు. రాజ్ కుమార్ ‘శ్రావణబంతు’ ఆధారంగా ఏయన్నార్ ‘వసంతగీతం’ వచ్చింది. ఏయన్నార్ ధరించిన సత్యవంతుడు, కాళిదాసు వంటి పాత్రలను రాజ్ కుమార్ కూడా పోషించడం గమనార్హం!
రాజ్ కుమార్ చిత్రాలను తరువాతి తరం హీరోలయిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా రీమేక్ చేశారు. రాజ్ కుమార్ కెరీర్ లోనే కాదు, కన్నడ నాట అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘బంగారద మనుష్య’ నిలచింది. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో కృష్ణ ‘దేవుడు లాంటి మనిషి’ రూపొందింది. రాజ్ కుమార్ ‘శంకర్ గురు’నే కృష్ణ ‘కుమార రాజా’గా తెరకెక్కింది. రాజ్ కుమార్ నటించిన ‘సనాది అప్పన్న’ తెలుగులో శోభన్ బాబుతో ‘సన్నాయి అప్పన్న’గా, ‘చెలుసువే మోడగళ్’ ఆధారంగా ‘రాజ్ కుమార్’ రూపొందాయి. కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘పులిబిడ్డ’కు రాజ్ నటించిన ‘తాయిగె తక్క మగ’ మాతృక. పాటలతో పులకింప చేసిన రామకృష్ణ ‘పూజ’ సినిమాకు రాజ్ కుమార్ ‘ఎరడు కనసు’ మాతృక. ఇలా పలువురు తెలుగు సినిమా స్టార్స్ రాజ్ కుమార్ చిత్రాల రీమేక్స్ తో సాగారు.
నటగాయకునిగా…
చిత్తూరు నాగయ్య స్ఫూర్తితో రాజ్ కుమార్ నటగాయకునిగా సాగాలని పరితపించేవారు. రాజ్ నాటకాల్లో నటిస్తున్న సమయంలో సొంతగా పద్యాలు, పాటలు పాడుకున్నారు. ఆ అనుభవంతోనే 1956లో రూపొందిన ‘ఓహిలేశ్వర’లో “ఓం నమశ్శివాయ…” పాటను పాడారు రాజ్ కుమార్. ఆ చిత్రానికి మన తెలుగువారయిన జి.కె.వెంకటేశ్ సంగీతం సమకూర్చారు. ఆ తరువాత రాజ్ కుమార్ నటనకు, పి.బి.శ్రీనివాస్ గానానికి జోడీ కుదిరింది. వారిద్దరి కాంబో కన్నడసీమలో జైత్రయాత్ర చేసింది. అయితే నటగాయకుడు కావాలన్న రాజ్ కుమార్ అభిలాషను 1974లో రూపొందిన ‘సంపత్తిగె సవాల్’ చిత్రం తీర్చింది. ఇందులో “యారే కూగాడలి…” అనే పాట పాడి ఆకట్టుకున్నారు రాజ్. ఈ చిత్రం తెలుగులో చలం హీరోగా ‘తోటరాముడు’ పేరుతో రీమేక్ అయి విజయం సాధించింది. ఇక అప్పటి నుంచీ స్వీయగానంతో నటిస్తూ సాగారు రాజ్ కుమార్. ఆయన నోట పలు సూపర్ హిట్ సాంగ్స్ పలికి, అభిమానులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వారిపై రాజ్ కుమార్ పాడిన భక్తిగీతాలు తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. నటునిగా, గాయకునిగా రాజ్ కుమార్ కు ఎనలేని ఖ్యాతి లభించింది. అభినయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు రాజ్ కుమార్. 1992లో రాజ్ కుమార్ నటించిన ‘జీవనచైత్ర’ చిత్రంలో “నాదమయ…” అంటూ సాగే పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ఆయనకు అవార్డు లభించింది. ఓ పాపులర్ స్టార్ కు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డు దక్కడం అదే మొదటి సారి. ఇప్పటి వరకూ మరో స్టార్ హీరో ఈ అవార్డు సాధించలేదు.
కన్నడ సినిమా సేవలో…
కన్నడ సినిమా అభివృద్ధికి రాజ్ కుమార్ ఎంతగానో కృషి చేశారు. మదరాసు నుండి కన్నడ చిత్రసీమను కర్ణాటకకు తీసుకువెళ్ళడంలో రాజ్ పాత్ర మరపురానిది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్ లోనే ఆయన చిత్రాల షూటింగులన్నీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక కన్నడ చిత్రాలకు తెలుగు, తమిళ సినిమాల ద్వారా పెద్ద పోటీ ఉండడంతో, తమ సినమా ఉనికిని చాటుకొనేందుకు కన్నడ చిత్రాలకు ‘యాభై శాతం పన్ను మినహాయింపు’ తీసుకు రావడంలోనూ రాజ్ పాత్ర ఎంతో ఉంది. పన్ను రాయితీ కారణంగానే రాజ్ కుమార్ చిత్రాలు బెంగళూరులో పరభాషా చిత్రాలకు పోటీగా నిలదొక్కుకొని ‘బంగారుద మనుష్య, శంకర్ గురు’ వంటివి సంవత్సరం పైగా ప్రదర్శితమయ్యాయి. కన్నడ సినిమా రంగానికి రాజ్ కుమార్ అందించిన సేవలకుగాను 1983లో పద్మభూషణ్, 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించాయి. 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యన్టీఆర్ జాతీయ అవార్డుతోనూ రాజ్ కుమార్ ను గౌరవించింది. కన్నడ రాజ్ కుమార్ గా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రాజ్. తెలుగువారి మదిలోనూ రాజ్ కుమార్ కు ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు.