IT Companies Lay offs: ఆర్థిక సంక్షోభ భయాలతో ఉద్యోగులను ఇంటికి పరిమితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల జాబితాలోకి ఇప్పుడు సిస్కో కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నెట్ వర్కింగ్ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన సిస్కో.. 4 వేలకు పైగా కొలువులకు లేదా మొత్తం వర్క్ ఫోర్సులో 5 శాతానికి కోత పెట్టనుందని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ వార్తల్ని ధ్రువీకరించట్లేదు. అలాగని.. పూర్తిగా తోసిపుచ్చటం కూడా చేయలేదు. కొన్ని బిజినెస్ లను ‘‘రైట్ సైజింగ్’’ చేస్తున్నామని, ‘‘రీబ్యాలెన్సింగ్’’ నిర్వహిస్తున్నామని చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది ఉద్యోగులు గల సిస్కో సంస్థ దాదాపు 41 వందల మంది స్టాఫ్ ని తొలగించనుందని సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13 పాయింట్ 6 బిలియన్ డాలర్ల రెవెన్యూని నమోదు చేసింది. ఇది గతేడాదితో పోల్చితే 6 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఆదాయం పెరుగుతున్నప్పటికీ కాస్ట్ కటింగ్ దిశగా ఆలోచిస్తుండటానికి ప్రధాన కారణం అత్యంత చేరువలో ఉన్న ఆర్థిక సంక్షోభమని నిపుణులు పేర్కొంటున్నారు.
read more: ‘‘Bisleri’’ Ramesh Chauhan: మన దేశంలో మంచి నీళ్ల సీసాలకు మంచి ప్రజాదరణ తెచ్చిన వ్యక్తి
అయితే.. సిస్కో సీఈఓ అండ్ చైర్మన్ చుక్ రాబిన్స్ మాత్రం ఈ ఉద్యోగుల తీసివేతలకు సంబంధించిన వివరాలేమీ వెల్లడించలేదు. ఎంప్లాయీస్ తో మాట్లాడిన అనంతరమే ఏదైనా చెప్పటానికి వీలుపడుతుందని, అప్పటి వరకూ స్పష్టత రాదని అన్నారు. కొన్ని వ్యాపారాలను రైట్ సైజింగ్ చేస్తున్నామని మాత్రం తాను ధ్రువీకరించగలనని పేర్కొన్నారు.
‘‘మేమేదో చేయబోతున్నామని మీరనుకోవచ్చు. కానీ.. అది నిజంగా జరగాలనేమీ లేదు. అలా అని.. మేము దేనికీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వం. బిజినెస్ లను రైట్ సైజింగ్ అయితే చేస్తున్నాం’’ అని చుక్ రాబిన్స్ చెప్పారు. దీన్నిబట్టి.. అవసరమైతే జాబ్ కటింగులకైనా వెనకాడబోమని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు.
సిస్కో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్కాట్ హెరెన్ మాత్రం ఈ పరిణామాన్ని ‘‘రీబ్యాలెన్సింగ్ యాక్ట్’’గా అభివర్ణించారు. ‘‘దీన్నొక హెడ్ కౌంట్ గా, కాస్ట్ సేవింగ్ గా పరిగణించొద్దు. ఇది నిజంగా బిజినెస్ ల రీబ్యాలెన్సింగే. ఇంకొన్ని సెగ్మెంట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. చుక్ రాబిన్స్ కూడా అదే చెప్పారు. సెక్యూరిటీ, ప్లాట్ ఫామ్స్, క్లౌడ్ డెలివర్డ్ ప్రొడక్ట్స్ పై ఫోకస్ పెట్టబోతున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో ఎంత మందిని కొత్త బిజినెస్ లకి షిఫ్ట్ చేయొచ్చనేదానిపైన చర్చిస్తున్నాం. అంతే తప్ప స్టాఫ్ ను తొలగించే ఉద్దేశంలేదు. ఒకవేళ తీసేసినా అది అతికొద్ది మందికే పరిమితమవుతుంది’’ అని సిస్కో సీఎఫ్ఓ చెప్పారు.