IPL Cricket: ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని. కానీ.. ఐపీఎల్‌ని ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్ అని సైతం అభివర్ణించొచ్చు. మన దేశంలోని అత్యంత విజయవంతమైన, అత్యధిక లాభదాయకమైన నవతరం స్టార్టప్‌లలో ఒకటిగా ఐపీఎల్ ఇప్పటికే తననుతాను నిరూపించుకుంది. బిజినెస్ విషయంలో.. విలువ పరంగా.. ఐపీఎల్.. యూనికార్న్ లెవల్ నుంచి డెకాకార్న్ స్థాయికి ఎదిగింది. ఈ క్రికెట్ లీగ్ వ్యాల్యూని డీ అండ్ పీ అడ్వైజరీ అనే కన్సల్టింగ్ సంస్థ వెల్లడించింది.
సంస్థ విలువ ఒక బిలియన్ డాలర్లు దాటితే దాన్ని యూనికార్న్ అంటారనే సంగతి తెలిసిందే. అదే.. 10 బిలియన్ డాలర్లు దాటితే డెకాకార్న్‌గా పేర్కొంటారు. వంద డాలర్లు దాటిన సంస్థను హెక్టాకార్న్ అని లేదా సూపర్ యూనికార్న్ అని వ్యవహరిస్తారు. ఐపీఎల్ అనే ఈ పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీ ఇప్పుడు డెకాకార్న్ స్టేటస్ పొందిన స్టార్టప్‌ల లిస్టులోకి చేరటం విశేషం. కరెక్టుగా చెప్పాలంటే ఐపీఎల్ వ్యాల్యుయేషన్ ప్రస్తుతం 10 పాయింట్ 9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
read also: BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ.. ఆసక్తికరంగా బుక్‌మైషో రిపోర్ట్
ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్ విలువ గత రెండేళ్లలో ఏకంగా 75 శాతం పెరగటం గొప్ప విషయం. ఈ ఆట ద్వారా ఏటా కనీసం 80 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో సగం కన్నా ఎక్కువే.. అంటే.. 47 వేల 500 కోట్ల రూపాయలు ప్రసార హక్కుల రూపంలోనే జనరేట్ అవుతోంది. స్టార్ టీవీ మరియు వయాకామ్.. వచ్చే ఐదేళ్లకు ఈ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాయి. ఇది ఏడాదికి యావరేజ్‌గా 9 వేల 500 కోట్ల రూపాయలని చెప్పొచ్చు.
ఒక్కో టీమ్ ద్వారా డైరెక్ట్ స్పాన్సర్‌షిప్ రూపంలో ఫ్రాంచైజీల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 60-70 కోట్ల రూపాయలు వస్తాయి. అవి మొత్తం కలిపితే 700 కోట్ల రూపాయలు అవుతాయి. దీనికితోడు.. ఒక్కో టీమ్ అమ్ముకునే టికెట్లతో ఏటా 40 కోట్ల రూపాయల రెవెన్యూ యాడ్ అవుతుంది. తద్వారా అన్ని టీమ్‌లకూ కలిపి.. 400 కోట్లు.. ఖాతాలో పడతాయి. కొత్తగా రెండు టీమ్‌లు వచ్చాయి. ఇవి 12 వేల 700 కోట్ల రూపాయలను జమ చేస్తాయి. అంటే.. ఏడాదికి 12 వందల 70 కోట్ల రూపాయలన్నమాట.
సెంట్రల్ స్పాన్సర్‌షిప్స్ మరో 800 కోట్ల రూపాయలను ఆర్జించి పెడతాయి. ఇవి ఎంత లేదన్నా ఒక్కో సంవత్సరానికి 13 వేల కోట్ల రూపాయలను పోగేస్తాయి. వీటితోపాటు మరిన్ని రూపాల్లో రాబడి వస్తుంది. మ్యాచ్‌ల సంఖ్య పెరగనుండటం, పెద్ద పెద్ద సెంట్రల్ స్పాన్సర్‌షిప్ డీల్స్, స్టేడియం తెచ్చిపెట్టే సంపాదనలతో ఐపీఎల్ ఇన్‌కమ్ ఇంకా వృద్ధి చెందుతుంది. ఫలితంగా బీసీసీఐకి వేరే వ్యాపారాలతో పోల్చితే ఐపీఎల్ ద్వారానే భారీ స్థాయిలో మార్జిన్లు సొంతమవుతాయి.
మ్యాచ్‌ల ప్రసార హక్కుల రూపంలో వచ్చే ఆదాయంలో అన్ని ఖర్చులు పోను మినిమం 40 శాతం.. అంటే.. 3 వేల 800 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇతరత్రా రెవెన్యూలో కనీసం 50 శాతం.. అంటే.. వెయ్యి కోట్ల రూపాయలు సమకూరతాయి. ఈవెంట్ నిర్వహణ వ్యయాలను తీసేస్తే.. బీసీసీఐ.. 6 వేల కోట్ల రూపాయల అనూహ్య లాభాన్ని కళ్లజూస్తుంది. ట్యాక్స్‌లు చెల్లించాక కూడా నికరంగా గతంలో ఎన్నడూ లేనంత డబ్బు ఆ సంస్థ ఖజానాకు చేరుతుంది.