India’s Hiring Intent: అనుభవానికి మించిన గురువు లేడంటారు. కానీ.. కంపెనీలు మాత్రం సీనియర్‌లకు అంత సీన్ లేదంటున్నాయి. జూనియర్‌లను.. ముఖ్యంగా.. ఫ్రెషర్లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. టీమ్ లీజ్ అనే సంస్థ విడుదల చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 4వ త్రైమాసికంలో మన దేశంలోని వివిధ సంస్థల నియామకాల ఉద్దేశాలు, తీరుతెన్నులపై టీమ్ లీజ్ సర్వే నిర్వహించింది.
ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లోని ఫోర్త్ క్వార్టర్‌లో.. అంటే.. జనవరి నుంచి మార్చి వరకు వివిధ రంగాల్లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో సంస్థలు ఉద్యోగ కల్పనకు తెర లేపనున్నాయి. కంపెనీల నియామక ఉద్దేశం 3వ త్రైమాసికం కన్నా 4వ త్రైమాసికంలోనే 3 శాతం అధికంగా వ్యక్తమైంది.
read more: Upcoming Electric Cars in 2023: ఈ సంవత్సరం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు
హైరింగ్ పట్ల Q3లో 65 శాతం కంపెనీలు సానుకూలంగా రియాక్టవగా Q4లో మాత్రం 68 శాతం సంస్థలు అనుకూలంగా స్పందించాయి. నియామక ఉద్దేశం విషయంలో వాణిజ్య పరిశ్రమ ఏకంగా 98 శాతం ఆసక్తిని ప్రదర్శించటం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ, టెలికం మరియు ఎడ్యుకేషనల్ సర్వీస్ సెక్టార్లు ఉన్నాయి. ఓవరాల్‌గా.. అన్ని సర్వీసులు మరియు అన్ని మ్యానిఫ్యాక్షరింగ్ సెక్టార్లలో కలిపి.. యావరేజ్‌గా.. 68 శాతం మంది యజమానులు బలమైన హైరింగ్ సెంటిమెంట్‌ను వెలిబుచ్చారు.
సేవల రంగంలో 77 శాతం సంస్థలు తమ వర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాయి. Q3లో ఈ సెక్టార్‌లో నియామక ఉద్దేశం 73 శాతంగానే నమోదైంది. రెండేళ్ల కిందటి Q3తో పోల్చితే ఈసారి 27 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఒక వైపు భారీఎత్తున లేఆఫ్‌లు ప్రకటిస్తుండటం, రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవటం, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతుండటంతో సర్వీసెస్ సెక్టార్ గణనీయంగా ప్రభావితమైంది.
మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. అయినప్పటికీ మన దేశంలో హైరింగ్ సెంటిమెంట్ పైపైకి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. 77 శాతం కంపెనీలు కొలువుల భర్తీని ఇష్టపడుతున్నాయి. ఈ విషయాన్ని టీమ్ లీజ్ చీఫ్ బిజినెస్ సర్వీసెస్ ఆఫీసర్ మయూర్ తాడే చెప్పారు. టెలికం రంగంలో 5జీ ప్రవేశించటంతో ఈ టెక్నాలజీ బేస్డ్ ఉద్యోగాలకు 65 శాతం డిమాండ్ పెరిగింది.
Q3లో ఈ జాబుల నియామక ఉద్దేశం 90 శాతమే కాగా Q4లో 94 శాతానికి పెరిగింది. 5జీ టెక్నాలజీ ప్రవేశం ఇండియాలో ఉపాధిని పెంచుతుందని ముందుగానే అంచనా వేశారు. అయితే.. దీనివల్ల Q4లో ఉద్యోగ సృష్టి జరగటమే కాకుండా ఓవరాల్‌గా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ వెల్లడించింది.
పెద్ద వ్యాపారాలు అత్యధికంగా 82 శాతం నియామక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. చిన్న వ్యాపారాలు 61 శాతం మరియు మీడియం బిజినెస్‌లు 50 శాతం మాత్రమే రిక్రూట్‌మెంట్లు చేపట్టే ఆలోచనలో ఉన్నాయి. మరో వైపు.. ఎంట్రీ లెవల్ మరియు ఫ్రెషర్ జాబ్‌లకే ఎక్కువ అవకాశాలు.. అంటే.. 79 శాతం ఛాన్స్ ఉన్నాయి. సీనియారిటీ పెరిగే ఉద్యోగుల పట్ల కంపెనీలు పెద్దగా ఆసక్తి ప్రదర్శించట్లేదు.
మిడ్ లెవల్ ఎంప్లాయీస్‌ని తీసుకునేందుకు 50 శాతం సంస్థలు మొగ్గు చూపుతుండగా సీనియర్ లెవల్ పోస్టులకు కేవలం 32 శాతం సంస్థలే ముందుకొస్తున్నాయి. నియామక ఉద్దేశం విషయంలో మెట్రో సిటీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నగరాల జాబితాలో సహజంగానే బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ సిటీ.. ఇండియాకి ఐటీ హబ్‌గా పేరొందినందున రిక్రూట్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తుండటం ఆశ్చర్యం కలిగించలేదు.
బెంగళూరు అత్యధికంగా 97 శాతం హైరింగ్ ఇంటెంట్ కలిగి ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. 94 శాతంతో చెన్నై రెండో ప్లేసులో ఉంది. 90 శాతంతో ఢిల్లీ మూడో ర్యాంక్ పొందింది. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్ 86 శాతం, ముంబై 85 శాతం నియామక ఉద్దేశాలను తెలియజేశాయి. మెట్రో మరియు టైయర్-1 సిటీల్లో ఓవరాల్‌గా 99 శాతం హైరింగ్ ఇంటెంట్ వ్యక్తమైంది. గ్రామీణ ప్రాంతాలు అతి తక్కువగా.. పాతిక శాతమే.. నియామక ఉద్దేశాన్ని వెలిబుచ్చాయి.