NTV Telugu Site icon

Indian Rupee: ఇండియన్‌ కరెన్సీ ఎందుకు పడిపోతోందంటే..

Indian Rupee

Indian Rupee

Indian Rupee: అమెరికా డాలర్‌తో పోల్చితే మన రూపాయి మారకం విలువ రోజు రోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం 83 రూపాయల దిశగా పయనిస్తోంది. ఆ స్టేజ్‌ కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్‌ కరెన్సీ ఇంతలా బక్క చిక్కటానికి చాలా కారణాలున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే భయం.. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం.. క్రూడాయిల్‌ రేట్లు పెరగటం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా వృద్ధి చెందటం.. దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

2023వ సంవత్సరంలో రూపాయి మారకం విలువ 82 రూపాయల 75 పైసలతో ప్రారంభమైంది. జనవరి 20వ తేదీ నాటికి బాగానే బలపడింది. 80 రూపాయల 98 పైసలకి కోలుకుంది. 2022 నవంబర్‌ తర్వాత ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. అయితే.. ఆ లాభాలన్నీ ఆవిరి కావటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రూపాయి మారకం విలువ గతేడాది అక్టోబర్‌లో ఒకసారి 83కు పతనమైంది. రానున్న నెల రోజుల్లో 82 నుంచి 83 రూపాయల 50 పైసల వరకు విలువ కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరించారు.

read more: Google and Twitter: గూగుల్‌, ట్విట్టర్‌ తాజా నిర్ణయాలు

రూపాయి మారకం విలువ పతనం అక్కడితో కూడా ఆగబోదని, రానున్న 3 నెలల్లో 82 నుంచి 84 రూపాయల 50 పైసల వరకు సైతం నేల చూపులు చూస్తుందని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు చౌకగా వస్తోందని భారతదేశం భారీగా కొనుగోలు చేస్తుండటం కూడా రూపాయి పరిస్థితిని మరింత దిగజారుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా-ఇండియా మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో అంతరం నెలకొనటం కారణంగా ఆ దేశానికి వాణిజ్య చెల్లింపులను రూపాయల్లో చేసే ప్రణాళిక.. లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో రష్యా వాటా కేవలం సున్నా పాయింట్‌ 2 శాతానికే పరిమితమైంది. కానీ.. 2022 నవంబర్‌ నుంచి మన దేశానికి రష్యా చమురు దిగుమతులు ఏకంగా దాదాపు 23 శాతానికి చేరాయి. ఫలితంగా ఆ దేశంతో ఇండియా వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలోని 6 బిలియన్‌ డాలర్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 25 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దీనివల్ల భారతదేశ నగదు తమ వద్ద ఎక్కువగా పోగుపడటానికి రష్యా ఇష్టపడలేదు.

రూపాయి విలువ ఊగిసలాటకు గురికావటానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. వడ్డీ రేట్లు తక్కువగానే పెంచుతారనే అంచనాలు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్లు తరలిపోవటం.. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌, అమెరికా మరియు ఇండియా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం.. తదితర కారణాల వల్ల రూపాయి విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోందని అనలిస్టులు వివరించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ తన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ని వెనక్కి తీసుకోవటం కూడా దీనికి దారితీసిందని చెబుతున్నారు.

కొత్త సంవత్సరం జనవరి నెలలో మొదటి 3 వారాల వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకోవటం, కార్పొరేట్‌ డాలర్‌ అమ్మకాలను పెంచటంతో రూపాయి బలపడిందని పరిశీలకులు గుర్తు చేశారు. రూపాయి బక్క చిక్కిన సంగతి.. రియల్‌ ఎఫెక్టివ్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌.. REERలో కూడా ప్రతిబింబించింది. 6 కరెన్సీ బాస్కెట్‌లో నవంబర్‌లో 100 పాయింట్‌ తొమ్మిది ఆరుగా ఉన్న REER.. డిసెంబర్‌లో 97 పాయింట్‌ నాలుగు ఐదుకి పడిపోయింది.

REER అనేది.. ఇతర ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే మన కరెన్సీ సగటు విలువను తెలియజేస్తుంది. REER పెరిగితే.. ఎగుమతులు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని, దిగుమతులు చౌకగా వస్తున్నాయని అర్థం. దీనికి విరుద్ధంగా.. REER తగ్గితే.. ఎగుమతులు చౌకగా జరుగుతున్నాయని, దిగుమతుల ఖర్చు పెరుగుతోందని చెప్పుకోవచ్చు. నవంబర్‌ నుంచి డిసెంబర్‌కి వచ్చేసరికి REER తగ్గింది కాబట్టి ఇండియా ఎగుమతులు తక్కువ రేటుకు జరుగుతున్నాయని, దిగుమతులకు మాత్రం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నవంబర్‌లో ఇండియన్‌ కరెన్సీ బలపడటానికి.. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనంగా ఉండటమే కారణం. ఆ నెలలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడిదారులు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటి విలువ 33 వేల 847 కోట్ల రూపాయలుగా నమోదు కావటం విశేషం. జనవరికి వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డాలర్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం దాక తగ్గిపోయినప్పటికీ విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు తరలిపోవటం బాగా మైనస్‌ అయింది. ఈ మధ్య కాలంలో 32 వేల 198 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్లిపోయాయి.

గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. జనవరి నెలలో అత్యధిక స్థాయిలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు తరలిపోయాయి. ఈ విలువ 28 వేల 851 కోట్ల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. వీటన్నింటినీ పరిశీలిస్తే.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు.. రూపాయి విలువ పతనానికి కూడా పలు పరిణామాలు దారితీశాయని పేర్కొనొచ్చు.

Show comments