NTV Telugu Site icon

Special Story on Indian Digital Currency: మన రూపాయి మరో రూపంలో. ప్రత్యేక కథనం..

Indian Digital Currency

Indian Digital Currency

Special Story on Indian Digital Currency: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్‌ యూనిట్లను ప్రారంభించారు. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’’పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త డిజిటల్‌ కరెన్సీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

డిజిటల్ కరెన్సీని టెక్నికల్‌గా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు. షార్ట్ కట్ లో సీబీడీసీగా పేర్కొంటారు. దీన్నే ఫ్యూచర్ మనీ అని, భవిష్యత్ నగదు అని వ్యవహరిస్తున్నారు. డిజిటల్ కరెన్సీని మన దేశ నగదు చరిత్రలో 4వ తరంగా చెప్పుకోవచ్చు. పురాతన కాలంలో వస్తు మార్పిడి ద్వారా కొనుగోళ్లు జరిగేవి. అది ఒకటో తరం. ఆ తర్వాత లోహపు నాణేలను చెల్లించి కొనేవారు. అది రెండో తరం. ఇప్పుడు నోట్లు, నాణేల రూపంలో నగదు చెలామణిలో ఉంది. ఇవి మూడో తరం కిందికి వస్తాయి. భవిష్యత్తులో ఫోర్త్‌ జనరేషన్‌ డిజిటల్‌ కరెన్సీ రాబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల కేంద్ర బ్యాంకులు డిజిటల్ కరెన్సీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. మన దేశంలో ఇంటర్నెట్, మొబైల్, ఆన్ లైన్ బ్యాంకింగ్స్ ద్వారా పెద్ద సంఖ్యలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారు. కానీ ఈ లావాదేవీలను డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్లుగా పేర్కొనలేం. ఎందుకంటే వీటికీ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్లకూ కొన్ని తేడాలు ఉన్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, చెల్లింపుల విధానంలో వచ్చిన కొత్త పద్ధతులు మన డబ్బు రూపాన్ని, విధులను మార్చేశాయి. ఫ్యూచర్‌లో కరెన్సీ గమనాన్ని కూడా నిర్దేశిస్తాయి. డిజిటల్ రూపీ.. ప్రస్తుతం ఉన్న నగదు రూపాలకు అదనమే తప్ప పూర్తిగా భిన్నమైందేమీ కాదు. ఇలాంటి క్లారిటీతోపాటు సీబీడీసీ లక్ష్యాలను, అవకాశాలను, ప్రయోజనాలను, సమస్యలను వివరించేందుకే ఆర్బీఐ ఈ కాన్సెప్ట్ నోటును రిలీజ్ చేసింది.

డిజిటల్ కరెన్సీ వల్ల లావాదేవీలు ఈజీగా, ఫాస్ట్ గా, చీప్‌గా జరుగుతాయి. ప్రస్తుత నగదు లాగా కూడా ఇచ్చిపుచ్చుకోవచ్చు. పేమెంట్ల కోసం వాడుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో చూపించొచ్చు. భౌతిక రూపంలోని నగదు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనేది కూడా డిజిటల్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురావటానికి మరో ముఖ్య కారణం. కరెంట్, మొబైల్ డేటా లేకపోయినా సీబీడీసీని ఆఫ్‌లైన్‌లోనూ వాడుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో క్రిప్టోకరెన్సీ లాంటి ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు సంప్రదాయ నగదు చెలామణికి, ఉనికికి సవాల్ విసురుతున్నాయి. దేశంలో కరెన్సీకి రక్షణదారైన రిజర్వ్ బ్యాంక్.. క్రిప్టోకరెన్సీల వల్ల తలెత్తుతున్న విపరిణామాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతోంది. అదే సమయంలో క్రిప్టోకరెన్సీ మాదిరి వర్చువల్ నగదును ఎలాంటి సమస్యలు లేకుండా జనానికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

డిజిటల్ కరెన్సీ అంటే ప్రస్తుత కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపం. అందువల్ల ఫిజికల్ కరెన్సీకి ఉండే ఫీచర్లన్నీ డిజిటల్ కరెన్సీకి కూడా ఉండాల్సిందే. ఇక.. డిజిటల్ కరెన్సీ డిజైన్ అనేది.. అది నిర్వర్తించాల్సిన విధుల పైన ఆధారపడి ఉంటుంది. హోల్ సేల్, రిటైల్, డైరెక్ట్, ఇన్ డైరెక్ట్, హైబ్రిడ్, టోకెన్ బేస్డ్, అకౌంట్ బేస్డ్, రెమ్యునరేటెడ్, నాన్-రెమ్యునరేటెడ్, డిగ్రీ ఆఫ్ అనానిమిటీ తదితర అంశాల్ని పరిగణనలోకి డిజిటల్‌ రూపీ డిజైన్‌ని ఫైనల్ చేయాలి.

వాడకాన్నిబట్టి డిజిటల్ కరెన్సీని 2గా విభజించొచ్చు. 1. జనరల్ పర్పస్ లేదా రిటైల్. ఇందులోకి ప్రైవేట్, నాన్-ఫైనాన్షియల్ కన్జ్యూమర్లు వస్తారు. 2. హోల్ సేల్. ఇందులోకి ఇంటర్-బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు, రిలేటెడ్ హోల్ సేల్ లావాదేవీలు వస్తాయి. నిర్వహణను బట్టి కూడా డిజిటల్ కరెన్సీని 2గా విభజించొచ్చు. 1. డైరెక్టు. దీనికి ఆర్బీఐదే బాధ్యత 2. ఇన్-డైరెక్టు. దీనికి ఆర్బీఐతోపాటు బ్యాంకులు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు బాధ్యత వహించాలి.

సీబీడీసీ 2 రూపాల్లో ఉండొచ్చు. 1. టోకెన్ బేస్డ్. ఇందులో డిజిటల్ కరెన్సీ.. బ్యాంక్ నోట్ల మాదిరిగా ఉంటుంది. వాటిని కస్టమర్ తీసుకోవచ్చు. కాకపోతే.. తీసుకునే ముందు అది తనదా కాదా అనేది అధికారికంగా ధ్రువీకరించుకోవాలి. రెండోది.. అకౌంట్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ. అందులో బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ల రికార్డులను మెయిన్టెయిన్ చేయాలి. అది ఫలానా వ్యక్తిదేనా కాదా అనేది మధ్యవర్తి వెరిఫై చేయాల్సి ఉంటుంది.

డిజిటల్ కరెన్సీ డిపాజిట్లకు వడ్డీ ఇవ్వరు. ఎందుకంటే జనమంతా తమ ఫిజికల్‌ మనీని సీడీబీసీ రూపంలోకి మారిస్తే ఓపెన్ మార్కెట్లో నగదు కొరత నెలకొంటుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. డిజిటల్ కరెన్సీ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కాన్సెప్ట్, డెవలప్మెంట్, పైలట్ తదితర దశల్లో ఉంది. అందువల్ల దీన్ని వాడుకలోకి తీసుకొచ్చే ముందు అన్ని వర్గాల వారితో చర్చించి, తగిన సలహాలు సూచనలు తీసుకోవాలి.