Site icon NTV Telugu

Gold Rules: మీ ఇంట్లో బంగారం ఉందా! అయితే తస్మాత్ జాగ్రత్తా..

Gold Rules

Gold Rules

Gold Rules: ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, మరొక వైపు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల ఆభరణాలు వారసత్వంగా కలిగి ఉన్న వాళ్లు, ఎప్పుడో కొనుగోలు చేసిన పసిడికి సంబంధించిన బిల్లులు పోగొట్టుకున్న వారికి ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే.. మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకుంటే సేఫ్‌గా ఉంటారో తెలుసుకోండి, అలాగే మీ ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఎంత బంగారం ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!

వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ ఇంట్లో ఉన్న బంగారం ధరను చూడరు, దాని బరువును చూస్తారు. నిజానికి భారతదేశంలో బంగారం అనేది కేవలం పెట్టుబడి పెట్టే మార్గం మాత్రమే కాదు, మన సంప్రదాయాలలో కూడా ఇది ఒక భాగం. మన దేశంలో బంగారాన్ని స్త్రీధనంగా భావించి, వివాహ సమయంలో మహిళలకు ఆభరణాలుగా చేయిస్తారు. ఇంకా పుట్టినరోజులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలలో బంగారాన్ని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది.

మీ ఇంట్లో బిల్లులు లేకుండా ఎంత బంగారం ఉంచుకోవచ్చు..
భారతదేశంలో కేంద్ర పన్ను శాఖ (CBDT) వివాహాలు, సంప్రదాయాల ఆధారంగా బంగారు పరిమితిని నిర్ణయించింది. ఈ పరిమితిలోపు మీ దగ్గర బంగారం ఉంటే, మిమ్మల్ని అధికారులు ప్రశ్నించరు.

* వివాహిత స్త్రీ తన వద్ద 500 గ్రాముల బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు.
*పెళ్లికాని స్త్రీ తన వద్ద 250 గ్రాముల బంగారం ఉంచుకోవచ్చు.
*కుటుంబంలోని ప్రతి పురుషుడు 100 గ్రాముల వరకు బంగారాన్ని ఎటువంటి భయం లేకుండా పెట్టుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆభరణాల బిల్లు మీ వద్ద లేకపోయినా, ఆదాయపు పన్ను దాడుల సమయంలో వాటిని జప్తు చేయలేరు.

ప్రజలు తరచుగా మరచిపోయే ఒక కీలకమైన విషయాన్ని చూద్దాం. పైన పేర్కొన్న మినహాయింపు బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే మీరు బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా బార్‌లను కలిగి ఉంటే, దానికి ఈ నియమం వర్తించదు. నాణేలు లేదా బిస్కెట్లకు చెల్లుబాటు అయ్యే బిల్లు లేదా ఆదాయ రుజువును కలిగి ఉండటం చాలా ముఖ్యం అని అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన రుజువు లేకపోతే పన్ను అధికారులు వెంటనే వాటిని జప్తు చేయవచ్చు. ఒక వేళ మీ ఇంట్లో పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే భయపడకండి, మీరు ఆ బంగారాన్ని వారసత్వంగా పొందారని, లేదంటే బహుమతిగా తీసుకున్నారని, మీ ఆదాయం నుంచి కొనుగోలు చేశారని నిరూపించగలిగితే, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు. అలాగే ఇక్కడ మీ పూర్వీకుల ఆభరణాల విషయంలో, పాత కుటుంబ వీలునామాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయి.

మీ ఇంట్లో 1 కిలో లేదా 5 కిలోల బంగారాన్ని ఉంచుకోవచ్చా అనే ప్రశ్నకు.. సమాధానం ఏమిటంటే, కచ్చితంగా ఉంచుకోవచ్చు. భారతీయ చట్టం ప్రకారం.. మీరు ప్రకటించిన ఆదాయం (ఆదాయపు పన్ను రిటర్న్) నుంచి ఈ బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే, దానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే బిల్లులు మీ దగ్గర ఉంటే, మీరు ఆ మొత్తం బంగారాన్ని కలిగి ఉంచుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే మీ బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన డబ్బు రికార్డు మీ దగ్గర ఉన్నంత వరకు, మీకు కావలసినంత బంగారాన్ని ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం మీ దగ్గర ఉన్న ఆభరణాల గురించి పట్టించుకోదు. దానికి బదులుగా ఆ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన “లెక్కల్లో చూపని” డబ్బు గురించి ఆందోళన చెందుతుంది. మీ కొనుగోలు రికార్డులు ఎంత పక్కాగా ఉంటే, బంగారం ఎంత ఖరీదైనది అయినా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

READ ALSO: Nepal: నేపాల్‌లో మసీదు ధ్వంసం.. భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత..

Exit mobile version