Gold Shine in 2023: బంగారం.. విలువైన లోహం. వన్నె కలిగిన వస్తువు. ఆభరణాల రూపంలో అలంకారం పరంగానే కాకుండా ఆర్థిక కోణంలో కూడా పసిడికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే.. ఎకానమీ అనగానే గోల్డ్ గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర్ణం పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు పరిశీలకులందరూ పాజిటివ్‌గానే సమాధానం ఇస్తుండటం విశేషం.
మాంద్యం వచ్చినా, ఆదాయాలు తగ్గినా కొత్త సంవత్సరంలో పుత్తడి మెరుపు తగ్గబోదని, డిమాండ్ పడిపోయే ప్రసక్తే లేదని వివిధ సంస్థలు చెబుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో సర్వత్రా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. గ్లోబల్ ఎకానమీ గత ఏడాది కాలంగా గతుకుల మార్గంలో పయనిస్తోంది. ఫలితంగా ఎన్నో అప్ అండ్ డౌన్స్‌ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కనకంపై కనీస ప్రభావం ఉండదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ పేర్కొంది.
BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ.. ఆసక్తికరంగా బుక్‌మైషో రిపోర్ట్
స్వల్ప ఆర్థిక మాంద్యాలు.. ఆదాయంలో తగ్గుదల వల్ల బంగారం విలువ మరియు బంగారం ధరలు తగ్గినట్లు చరిత్రలో లేదని గుర్తుచేసింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో డాలర్ మరింత బలహీనపడటం పసిడికి కలిసొస్తుందని అంచనా వేసింది. బలహీన ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులు పుత్తడికి సహజంగా మంచే చేస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర బంగారం ఉంటే రిస్క్ ఉండదనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. గోల్డ్ రేట్ భారీగా పెరగపోయినా అమాంతం తగ్గదనే ధీమా కూడా జనంలో నెలకొంది.
ఇదిలాఉండగా.. ద్రవ్యోల్బణం మరియు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నందున ఈ ప్రభావం 2023లో పుత్తడి ధరలపై కనిపించనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ నెల నుంచి.. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్.. వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, అందువల్ల కనకం ధరలు అంచనాలను మించి నమోదయ్యే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది.
ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైసెస్.. రానున్న ట్రేడింగ్ సెషన్లలో 54 వేల 400 రూపాయలు దాటి 54 వేల 600 రూపాయల వరకు చేరుకోవచ్చని తెలిపింది. అమెరికా కేంద్ర బ్యాంక్.. వచ్చే ఏడాది రెండో అర్ధ భాగం నుంచి వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని, 2024 చివరి నాటికి ప్రపంచంలోని ప్రధాన సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే మోడ్‌లోకి రావొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
2023లో ఆర్థిక అస్థిర పరిస్థితులు అసాధారణ రీతిలో ఉంటాయి. కేంద్ర బ్యాంకులు అవసరమైనదాని కన్నా ఎక్కువగా ద్రవ్య విధానాలను కఠినతరం చేస్తాయి. ఫలితంగా వృద్ధి మరింతగా నేలచూపులు చూస్తుంది. అదే సమయంలో.. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకముందే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయటం లేదా గతంలో పెంచుతూ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవటం వంటివి చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ గందరగోళం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దారితీయొచ్చు. గ్లోబల్‌గా నెలకొనే ఈ మిశ్రమ పరిస్థితులన్నీ బంగారంపై పాజిటివ్ ప్రభావాన్నే చూపనున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గ్రోత్ ఈక్విటీ ఫండ్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రైవేట్ క్రెడిట్ మేనేజర్లు.. ఇలా ప్రతి సెక్టార్‌లోనూ ఆస్తుల విలువలు వివిధ స్థాయిల్లో డౌన్ అవుతున్నాయి. ముందు ముందు మరింత తగ్గొచ్చనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో.. మరో వైపు.. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలైన హెడ్జ్ ఫండ్స్ తెరపైకి రావొచ్చు. అవి.. వడ్డీ రేట్లు, కరెన్సీలు మరియు క్రాస్ అసెట్ కోరిలేషన్స్‌పైన ఫోకస్ పెట్టొచ్చు. తద్వారా.. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫయర్స్‌గా అవి తమ సత్తా చాటుకోవచ్చు. ఏదిఏమైనప్పటికీ.. 2023లో డాలర్ వ్యాల్యూ మరియు వడ్డీ రేట్లు పీక్ స్టేజ్‌కి చేరనుండటంతో పబ్లిక్ ఎక్కువగా పసిడి పైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జేపీ మోర్గాన్ వివరించింది.