NTV Telugu Site icon

Bank Working Days: బ్యాంకులు.. ఇక 5 రోజులే? అన్ని శనివారాలు, ఆదివారాలు కూడా సెలవే?

Bank Working Days

Bank Working Days

Bank Working Days: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్‌ని విడుదల చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక వర్కింగ్ డే తగ్గుతున్నందున ఆ సమయాన్ని భర్తీ చేయటం కోసం ఉద్యోగులు ఇక నుంచి రోజుకి అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

read more: Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి

అంటే.. బ్యాంకులు ఉదయం పది గంటలకు బదులుగా 9 గంటల 45 నిమిషాలకే ఓపెన్ కానున్నాయి. సాయంత్రం ఐదున్నర దాక పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్ల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతోపాటు.. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకులు గనక శనివారం కూడా
పనిచేయాలని నిర్ణయించుకుంటే ఆ ప్రభావం తమ బిజినెస్‌పైన ఏ మేరకు పడుతుంది అనే విషయంలో కూడా ప్రభుత్వ బ్యాంకులు ఒక అవగాహనకు రావాల్సి ఉంది.

బ్యాంకులు ప్రస్తుతం ప్రతి ఆదివారంతోపాటు రెండో మరియు నాలుగో శనివారం సెలవు తీసుకుంటున్నాయి. దీంతో.. సాధారణ ప్రజల్లో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఒక్కోసారి మొదటి శనివారం లేదా మూడో శనివారం పబ్లిక్ హాలిడే వస్తే ఆ రోజు బ్యాంకులను బంద్ పెడుతున్నారు. దీనివల్ల.. బ్యాంకులను ఏ శనివారం ఓపెన్ చేసి ఉంచుతారో ఏ శనివారం మూసేసి ఉంచుతారో తెలియని పరిస్థితి.

చదువుకున్నవాళ్లకైతే అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబ్లంలేదు. కానీ.. అక్షరమ్ముక్కరానివాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సెలవు ఇచ్చేసి వారానికి ఐదు రోజులే బ్యాంకులను తెరిచి ఉంచితే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.

దీనికితోడు.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు కావాలని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్లు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల పని దినాలు మరియు పని వేళలకు సంబంధించిన ఈ సవరణకు అంగీకారం లభిస్తే ఈ మేరకు అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది.