యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ నిజానికి సాత్వికమైన పాత్రలూ చాలానే చేశారు. మరీ ముఖ్యంగా బోలెడన్ని సెంటిమెంట్ మూవీస్ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించారు. అలా రూపుదిద్దుకున్న సినిమా ‘సింహరాశి’. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆర్. బి. చౌదరి నిర్మించిన ఈ సినిమా 2001 జూలై 6న విడుదలైంది. అంటే… ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా వి. సముద్ర పరిచయమయ్యారు. తొలి చిత్రమే చక్కని విజయాన్ని సాధించడంతో సముద్ర ఆ తర్వాత అగ్ర కథానాయకులతోనూ సినిమాలు చేసే అవకాశాన్ని పొందారు. తెలుగులో పదిహేనుకు పైగా సినిమాలను రూపొందించారు.
రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో ఉండే నరసింహరాజుకు సంబంధించిన కథ ఇది. అతనుండే పరిసర గ్రామాల్లో ఏ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో విజయం సాధించాలన్నా… రాజు సహకారం ఉండాల్సిందే. అతన్ని కాదని ఎవరూ అక్కడ గెలువలేరు. తన తల్లి పేరుతో రాజు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో సేవ చేస్తూ ఉంటాడు. కోట్లకు పడగలెత్తినా నిరాడంబరంగా వ్యవహరించడం, నేల మీదనే పడుకోవడం రాజుకు అలవాటు. అలాంటి రాజు సహకారం లేకుండా ఎన్నికల్లో గెలుస్తానని ప్రగల్భాలు పలికిన విజయేంద్ర ప్రసాద్ కు డిపాజిట్లు కూడా దక్కవు. ఆ కసితో రాజును ఎలాగైనా దెబ్బతీయాలనుకుంటాడు. రాజు నేపథ్యం ఏమిటీ? అతనెందుకు అంత నిరాడంబరంగా ఉంటాడు? రాజుకు ఉన్న మంచి పేరును చెడగొట్టాలని చూసిన విజయేంద్ర ప్రసాద్ కు ఎలా బుద్ధి వచ్చిందన్నది మిగతా కథ.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మాయి’ ఆధారంగా ‘సింహరాశి’ని నిర్మించారు. తమిళంలో శరత్ కుమార్, మీనా హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఆ పాత్రలను రాజశేఖర్, సాక్షి శివానంద్ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను వింద్య, వర్ష, విజయ్ కుమార్, అచ్యుత్, బహ్మానందం, గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ తదితరులు పోషించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్. బి. చౌదరికి మొదటి నుండి ఓ అలవాటు ఉండేది. మొదట తమిళంలో సినిమా తీసి, అది హిట్ కాగానే అదే కథను తెలుగువారితో ఇక్కడ రీమేక్ చేసేవారు. ఆ క్రమంలో వచ్చిందే ‘సింహరాశి’ కూడా. తన సినిమాల ద్వారా కొత్త దర్శకులను పరిచయం చేయడం కూడా ఆనవాయితీగా పెట్టుకున్న ఆర్. బి. చౌదరి ఈ మూవీతో సముద్రను పరిచయం చేశారు. అప్పటికే ఆ సంస్థలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన ఎస్. ఎ. రాజ్ కుమార్ ‘సింహరాశి’కి స్వరాలు సమకూర్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మదర్ సెంటిమెంట్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. వెనిగళ్ళ రాంబాబు, విజయ్ కుమార్, పోతుల రవికిరణ్ ఇందులోని ఇతర గీతాలను రాశారు. ఆడియో పరంగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
రాజశేఖర్ ‘సింహరాశి’ కంటే ముందు… ‘మా అన్నయ్య, మనసున్న మారాజు’ వంటి చిత్రాలలో సాత్వికమైన పాత్రలు చేశారు. ఓ రకంగా చూస్తే ఇది కూడా అలాంటి సినిమానే. అయితే… ఇందులో రాజశేఖర్ పాత్ర మరింత హుందాగా సాగుతుంది. ఎలాంటి బలహీనతలు లేని హీరో పాత్రను తెరమీద ఆసక్తికరంగా చూపించడం అంటే దర్శకులకు కాస్తంత ఇబ్బందే. అయితే… సముద్ర తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చక్కగా మార్చి, హీరో క్యారెక్టర్ గ్రాఫ్ ఎక్కడా డౌన్ ఫాల్ కాకుండా చూసుకున్నారు. మరో విశేషం ఏమంటే… సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో పరుచూరి సోదరులు సంభాషణలు రాసిన మొదటి సినిమా ఇదే. వారి మాటలూ సినిమా విజయానికి చక్కగా దోహదపడ్డాయి. ఈ సెంటిమెంట్ ప్రధాన చిత్రంలో పనిలో పనిగా వినోదానికీ పెద్ద పీట వేశారు. దాంతో అన్ని వర్గాలను ఇది బాగానే ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా బి సెంటర్స్, సి సెంటర్స్ లో చక్కని విజయాన్ని అందుకుంది. తమిళ చిత్రం ‘మాయి’ రూపుదిద్దుకున్న పుష్కర కాలానికి కన్నడలో ‘నరసింహా’ పేరుతో రీమేక్ అయ్యింది. అందులో రవిచంద్రన్ హీరోగా నటించారు. ఆ రకంగా ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ ప్రేక్షకులను వారి వారి భాషల్లో అలరించింది.