NTV Telugu Site icon

Zebra Telugu Review : జీబ్రా రివ్యూ

Zebra Review

Zebra Review

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జీబ్రా. పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుంజయ మరో కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో సినిమా మీద ఒక్కసారిగా అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుండడంతో సినిమా ఎలా ఉంటుందా అని చాలామంది ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించగా ప్రీమియర్స్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం

జీబ్రా కథ:
సూర్య(సత్య దేవ్) ఒక బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. మరో బ్యాంకులో ఉద్యోగం చేసే స్వాతి(ప్రియా భవాని శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఆమె వివాహం చేసుకొని ఒక మంచి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో ఉండడం అతని లక్ష్యం అయితే స్వాతి చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా చిన్న బ్యాంకు ఫ్రాడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఫ్రాడ్ చేసిన నేపథ్యంలో ఏకంగా ఐదు కోట్ల రూపాయల ఫ్రాడ్ లో ఇరుక్కుంటాడు. అయితే ఈ ఐదు కోట్ల రూపాయల ఫ్రాడ్ కారణంగా సూర్య లైఫ్ లోకి ఆది(ధనుంజయ) ఎంట్రీ ఇస్తాడు. కొంత సమయం గడివిచ్చి ఆలోపు ఐదు కోట్లు తనకు కట్టకపోతే తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో సూర్య ఆ ఐదు కోట్ల రూపాయల కోసం ఏం చేశాడు? దానికి స్వాతి, బాబు(కమెడియన్ సత్య), బాబా(సత్య రాజ్) ఎలా ఉపయోగపడ్డారు? ఈ మొత్తం వ్యవహారంలో మదన్ గుప్తా(సునీల్) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఈమధ్య చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాని కూడా అదే నేపథ్యంగా ఎంచుకున్నారు. బ్యాంకులో కీలక పొజిషన్లో ఉన్న ఉద్యోగులు అనుకోకుండా చేసిన ఫ్రాడ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చివరికి ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డారా? లేదా అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. దర్శకుడు మాజీ బ్యాంకు ఉద్యోగి కావడంతో తనకు తెలిసిన టర్మినాలజీ అంతా సినిమాలో వాడేశారు. కానీ అది సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయం అనుమానమే. ఇటీవల వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో జరిగిన అన్ని పరిణామాలను సగటు ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా తెరకెక్కించడంలో సదరు దర్శకుడు సఫలమయ్యాడు. కానీ ఈ జీబ్రా విషయానికి వస్తే ఆ విషయంలో బాగా తడబడ్డాడు. అదేవిధంగా సినిమాను కొంచెంసేపు మిస్ అయినా సినిమా మొత్తం అర్థం కాని విధంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే సినిమాని మిస్ కాకుండా ఫోన్లో ఇంకేవో పనులు చేసుకోకుండా చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని సీన్స్ అయితే బుర్రకు పదును పెడితే తప్ప అర్థం కావు. ఒకరకంగా చెప్పాలంటే తాను అనుకున్న పాయింట్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ సగటు ప్రేక్షకుడు బుర్రకు పదును పెట్టేందుకు థియేటర్లకు రారు , ఉన్న కాసేపు ఎంజాయ్ చేసి వెళ్లాలనుకుంటాడు కానీ ఇలా తికమక పెట్టి కొన్ని సీన్స్ అయితే అసలు ముందు సీన్ చూడకపోతే అర్థం కాని విధంగా ఉండటం కాస్త ఇబ్బందికర అంశం అయినా సరే మూవీ లవర్స్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ లోనే అసలు ఏం జరగబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ను రివిల్ చేస్తూ వచ్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. క్లైమాక్స్ కాస్త ఊహకు అందేలా ఉన్నా హ్యాపీ ఎండింగ్ ఇచ్చి పంపించారు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాల్లో సూర్య అనే పాత్రలో సత్యదేవ్ ఒదిగిపోయాడు. సత్యదేవ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే కాబట్టి ఎలాంటి తడబాటు లేకుండా సూర్య అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతని ప్రేయసిగా నటించిన ప్రియ భవాని శంకర్కి కూడా ఇలాంటి పాత్రలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆమె కూడా ఎక్కడా తగ్గకుండా నటించింది. ఇక ఈ సినిమాలో సత్య మరోసారి తనదైన కామెడీతో నవ్వించాడు. సత్యను స్క్రీన్ మీద చూస్తేనే నవ్వు వచ్చేలా డిజైన్ చేసుకున్నారు. ఇక సత్యరాజ్, సునీల్ సహా కీలకపాత్రలో నటించిన రామచంద్ర రాజు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన అసెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సాధారణ సినిమాని సైతం అత్యద్భుతమైన టచ్ ఇచ్చేలా ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండటం గమనార్హం. అయితే పాటల ప్లేస్మెంట్ మాత్రం ఎందుకు సెట్ కాలేదనిపించింది. పాటలు వచ్చినప్పుడల్లా ఇదేంటిరా బాబు అనే ఫీలింగ్ జనాల్లో కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా కాస్త వర్క్ చేసి ఉండవచ్చు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మాత్రం చాలా ప్రశంసనీయం. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్లీ ఈ జీబ్రా ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్.. కానీ బుర్ర పెట్టి చూస్తే తప్ప అందరికీ ఎక్కదు.