NTV Telugu Site icon

WRITER PADMABHUSHAN Review: రైటర్ పద్మభూషణ్ రివ్యూ

Wirter 1

Wirter 1

WRITER PADMABHUSHAN Review: కమెడియన్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టి, ఆ పైన ‘కలర్ ఫోటో’తో హీరో అయ్యాడు సుహాస్. అంతేకాదు… రెండేళ్ళ క్రితం వచ్చిన ‘ఫ్యామిలీ డ్రామా’లో సైకోగా, గత యేడాది చివరిలో వచ్చిన ‘హిట్ -2’లో విలన్ గా నటించి మెప్పించాడు. అలాంటి సుహాస్ నూరు శాతం కామెడీ హీరోగా నటించిన చిత్రమే ‘రైటర్ పద్మభూషణ్‌’. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

కథ విషయానికి వస్తే… విజయవాడలో పుట్టి పెరిగిన పద్మభూషణ్‌ (సుహాస్‌) కు గొప్ప రచయిత కావాలన్నది కల. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి హౌస్ వైఫ్‌. వాళ్ళకు తెలియకుండా స్నేహితుడి సాయంతో లక్షల అప్పు చేసి, ‘తొలి అడుగు’ పేరుతో ఓ పుస్తకం రాసి తనే పబ్లిష్‌ చేస్తాడు. దాన్ని సేల్ చేసుకోలేక నానా తిప్పలు పడుతుంటాడు. చేసిన అప్పుకు వడ్డీ కట్టడం కోసం ఓ గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పనిచేస్తుంటాడు. పద్మభూషణ్‌ రాసిన ఓ నవలను చదివి ఇంప్రస్ అయ్యి, తన కూతురు సారిక (టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్ళి చేయాలని మేనమామ అనుకుంటాడు. సారిక సైతం గొప్ప రచయిత అయిన మేనబావను పెళ్ళి చేసుకోవడం గర్వంగా ఫీలవుతుంది. చిత్రం ఏమంటే… అది పద్మభూషణ్‌ రాసిన నవల కాదు. మరి ఎవరు, ఎందుకు, అతని పేరుతో ఆ నవల రాసి పుస్తకంగా వేశారు? అలానే అతని పేరుతో ఓ బ్లాగ్ ను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ విషయం కాబోయే మావగారికి తెలిసి ఉంటే ఏం జరిగేది? తనకే తెలియని తన ఘోస్ట్ రైటర్ ను వెతికి పట్టుకోవడానికి పద్మభూషణ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే మిగతా కథ.

విజయవాడ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కడం ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయింది. అలాంటి ఆ ఊరిని, దాని నేపథ్యాన్ని తీసుకుని ఈ కథను దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ రాసుకున్నాడు. గతంలో బెజవాడ… ఆ మాట కొస్తే ఇప్పటికీ పుస్తక ప్రచురణకు అదే కేంద్రం. వందలాది ప్రచురణ సంస్థలకు నెలవు విజయవాడ. బేసికల్ గా కథానాయకుడు భూషణ్‌ రచయిత కావడం, అతను తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి నానా తిప్పలు పడటం అనేది ప్రధానాంశం కాబట్టి… ఈ నేపథ్యం బాగా సెట్ అయ్యింది. సినిమా ప్రథమార్థం అంతా ఓ అప్ కమింగ్ రైటర్ పేరు కోసం పడే పాకులాట, తన నవలను జనంలోకి పంపడానికి చేసే చిత్ర విచిత్రాలు, కొద్దిపాటి ప్రేమ సన్నివేశాలతో సాగిపోయింది. రైటర్స్ అంతా ఈ సన్నివేశాలతో బాగానే కనెక్ట్ అవుతారు. అయితే సాధారణ ప్రేక్షకుడికి బోర్ కొట్టే ప్రమాదం ఉంది. మరీ ఇంత సాగదీసి చూపించాలా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో ఘోస్ట్ రైటర్ ను భూషణ్‌ వెదికే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు అందరినీ ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్ లోని ట్విస్ట్ కొంత ఊహకు అందేదే అయినా, ఓ చిన్న పాయింట్ ను డైరెక్టర్ ఎంత సున్నితంగా, ఎంత గొప్పగా చూపించాడో కదా! అనే భావనతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వస్తారు. మూవీ మేకర్స్ కోరుకుంటున్నట్టుగా ఇది తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమా మాత్రమే కాదు… సతీసమేతంగా వెళ్ళాల్సిన సినిమా. ఇందులో మధ్యతరగతి గృహిణి మనస్సును దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించాడు. అయితే… మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయినట్టుగా మిగిలినవారు దీనికి కనెక్ట్ అవుతారని చెప్పలేం!

తెలుగులో ఉన్న హాస్యనటుల్లో సుహాస్ ది భిన్నమైన శైలి. ఏ పాత్రను ఇచ్చినా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు అతనికుంది. ఈ మెథడ్ యాక్టర్ ఉండి మరిన్ని మంచి పాత్రలను మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అతని ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఇందులోనూ చక్కని నటనే కాదు… ఈజీ బాడీ లాంగ్వేజ్ తో పాటల్లోనూ సిగ్నేచర్ స్టెప్స్ ను సూపర్ గా వేశాడు. కథానాయిక పాత్రలో టీనా శిల్పరాజ్ చక్కగా ఒదిగిపోయింది. మధ్య తరగతి గృహిణి పాత్రలకు ఇప్పుడు రోహిణి కేరాఫ్ అడ్రస్! సరస్వతి పాత్రకు ఆమెను ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం. అలానే ఆశిష్‌ విద్యార్థి, అశోక్ కుమార్, గోపరాజు రమణ, గౌరి ప్రియ తదితరులు చక్కని నటన కనబరిచారు. శేఖర్ చంద్ర సంగీతం, వెంకట్ సినిమాటోగ్రఫీ హాయిగా ఉన్నాయి. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, హడావుడీ, ఆర్భాటం లేకుండా కూల్ అండ్ క్లీన్ గా ప్రెజెంట్ చేసిన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ను అభినందించాలి.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
చెప్పిన విధానం
ఆకట్టుకునే క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్
ఒక వర్గానికే పరిమితం కావడం
కాస్తంత బోర్ కొట్టే ప్రథమార్ధం

ట్యాగ్ లైన్: రైటర్ పద్మభూషణ్‌ సన్నాఫ్ సరస్వతి!