NTV Telugu Site icon

Veera Simha Reddy Movie Review: వీరసింహారెడ్డి

Balayya

Balayya

Veera Simha Reddy Movie Review: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో తెలుగు సినిమాకు మళ్ళీ ఓ వెలుగు తీసుకు వచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ నటించిన ఏ చిత్రమూ గత యేడాది విడుదల కాలేదు. దాంతో బాలయ్య అభిమానులు ఆయన సినిమా కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్న సమయంలోనే సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనం ముందు నిలచింది. గురువారం విడుదలయిన ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణకు బాగా అచ్చివచ్చిన ఫ్యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసి ఉండడం విశేషం! పైగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో ‘సింహా’ అన్న పదం చోటు చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అనే నమ్మకం ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ రీతిలో సినిమా సాగిందో లేదో చూద్దాం.

‘వీరసింహారెడ్డి’ కథ విషయానికి వస్తే – ఇది అన్నాచెల్లెళ్ళ మధ్య వైరంతో సాగే కథ. వీరసింహారెడ్డి, భానుమతి ఇద్దరూ ఒకే తండ్రి పిల్లలు. అయితే తల్లులు వేరు. అయినా వీరసింహారెడ్డికి చెల్లెలు అంటే ఎంతో అభిమానం. కానీ, ఆ చెల్లెలు మాత్రం ఈ అన్నయ్యను సదా ద్వేషిస్తూనే ఉంటుంది. అందుకు కారణం, ఆమె ప్రేమించినవాడిని వీరసింహారెడ్డి చంపించాడని భానుమతి నమ్మకం. ఈ నేపథ్యంలో అన్నపై పగ సాధించడానికి భానుమతి ఆయనకు వైరి అయిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్ళాడుతుంది. అయినా, చెల్లెలుకు ప్రతి సంవత్సరం పండుగ రోజుల్లో పంపవలసిన సారె, చీరె పంపుతూనే ఉంటాడు వీరసింహారెడ్డి. తరువాత కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డి విదేశాలకు వెళతాడు. రాయలసీమలో అందరూ దేవుడుగా భావించే వీరసింహారెడ్డిని ఇక్కడ మట్టుపెట్టడం కష్టమని భావించిన భానుమతి, విదేశాలలో అయితే తన పని సులువు అవుతుందని భావిస్తుంది. ఓ పథకం ప్రకారం వీరసింహారెడ్డిని విదేశాలలో ఉండగానే పొడిచేస్తారు. భానుమతి సైతం అతడిని కత్తి పొడిచి, తన కక్ష తీర్చుకున్నానని సంతోషిస్తుంది. భానుమతి అంతటితో పగ తీరినట్టేనా? వీరసింహారెడ్డి ప్రేమాభిమానాలను చెల్లెలు గుర్తించిందా? ఆ తరువాత ఏమైంది? అన్న అంశాలతో మిగతా కథ సాగుతుంది.

నిస్సందేహంగా నటీనటుల్లో బాలకృష్ణదే అగ్రంతాంబూలం. ఫ్యాక్షనిజం నేపథ్యమున్న కథల్లో నటించి అలరించడం ఆయనకు కొట్టిన పిండి. అదే తీరున వీరసింహారెడ్డిగా, ఆయన కొడుకుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన బాణీ పలికించారు. శ్రుతిహాసన్ గ్లామర్ తో పాటు అనువైన చోట తన నటనతో అలరించారు. హనీ రోజ్ అభినయం తప్పకుండా జనాన్ని కట్టిపడేస్తుంది. దర్శకుడు మలినేని గోపీచంద్ తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకొనే ప్రయత్నమే చేశారు. గోపీచంద్ కథకు అనువుగా బుర్రా సాయిమాధవ్ పలికించిన సంభాషణలూ ఆకట్టుకుంటాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కథకు తగ్గరీతిలో ఖర్చుపెట్టారు. థమన్ బాణీల్లో రూపొందిన “జై బాలయ్యా…” అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తుంది. మిగిలిన వాటిలో “సుగుణసుందరీ…”, “మా బావ మనో భావాలు…”, “మాస్ మొగుడు…” అనే పాటలూ మాస్ ను ఆకట్టుకుంటాయి. సింగిల్ కార్డ్ తో రామజోగయ్య శాస్త్రి తనదైన రీతిలో పదబంధాలు ప్రయోగించి ఆకట్టుకున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి కూడా కథకు తగ్గ రీతిలో సాగిందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా కావడం
– థమన్ సంగీతం
– మేకింగ్ వేల్యూస్
– గోపీచంద్ మలినేని దర్శకత్వం

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– పాతగా అనిపించే కొన్ని సన్నివేశాలు

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: మళ్ళీ బాలయ్య ‘సింహ’ గర్జన

Show comments