NTV Telugu Site icon

Valliddari Madhya Review: వాళ్లిద్దరి మధ్య మూవీ రివ్యూ (ఆహా ఓటీటీ)

Valliddari Madhya Review

Valliddari Madhya Review

కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను థియేటర్లలో కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడమే తెలివైన పని. అది తమకుందని దర్శక నిర్మాతలు వి. ఎన్. ఆదిత్య, అర్జున్ దాస్యన్ నిరూపించుకున్నారు. వీరి చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన ఈ మూవీతో నేహా కృష్ణ హీరోయిన్ గా పరిచయమయ్యింది.

కథగా చెప్పుకోవాలంటే సింపుల్. ఇంజనీరింగ్ చేసిన వరుణ్ (విరాజ్ అశ్విన్)కు తన స్నేహితుడి కారణంగా ఓ ఐడియా తడుతుంది. ఇండియా వదిలి విదేశాలకెళ్ళిన కుర్రాళ్ళ తల్లిదండ్రుల బాగోగులు చూసేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటాడు. అన్వయ డాట్ కామ్ అనే వైబ్ సైట్ ను క్రియేట్ చేసి… తద్వారా సేవలు అందిస్తుంటాడు. అతి తక్కువ కాలంలో అతని కంపెనీకి మంచి గుర్తింపు వస్తుంది. అదే సమయంలో అన్వయ (నేహా కృష్ణ) అనే ఎన్.ఆర్.ఐ. అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. తన తల్లిదండ్రులను వరుణ్‌ బాగా చూసుకోవడంతో ఆమె కూడా ఇంప్రస్ అవుతుంది. ఇంతలో యు.ఎస్.లో బ్రేకప్ అయ్యి, ఇండియా వచ్చిన అన్వయకు వరుణ్ ప్రపోజ్ చేస్తాడు. తనకు కాస్తంత టైమ్ ఇవ్వమని అన్వయ కోరుతుంది. బ్రేకప్ మూడ్ నుండి ఆమె ఇంకా బయటకు రాలేకపోయిందని వరుణ్‌ భావించడమే కాదు ఆ మాట డైరెక్ట్ గా ఆమెతోనే అనేస్తాడు. అంతే… దాంతో వీరిద్దరి మధ్య అగ్గి రాజుకుంటుంది. ఇగో క్లాషెస్ మొదలవుతాయి. వాటిని చల్లార్చుకుని వీరిద్దరూ తిరిగి ఎలా ఒక్కటయ్యారన్నదే మిగతా కథ.

నిజం చెప్పాలంటే… ఈ సమాజంలో ఇగో లేని వ్యక్తే ఉండడు. మనిషి బుద్ధి బలహీనమైనప్పుడే ఇగో అనేది బయటకొస్తుంది. దాంతో మనిషి తప్పుల మీద తప్పులు చేస్తాడు. ఆ సమయంలో అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమౌతాయి. సర్వ సాధారణంగా ప్రేమికుల విషయంలోనూ ఇదే జరుగుతుంటుంది. ఈ ఇగో క్లాష్ అనే ఓ చిన్న పాయింట్ తీసుకుని రెండు గంటల సినిమాగా నడపడం సామాన్య విషయం కాదు. ప్రథమార్ధంలో కాస్తంత కథ నడిచినా, ద్వితీయార్థంకు వచ్చే సరికీ హీరో హీరోయిన్ల ఇగో మీదనే మూవీ అంతా సాగుతుంది. దాంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయిపోయింది. హీరో హీరోయిన్ల మధ్య గొడవకు బలమైన కారణం కూడా కనపడదు. వాళ్ళ ఇగో అంతలా హర్ట్ కావాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. దీనికి హీరోయిన్ కౌన్సిలింగ్ తీసుకోవడం, హీరో కూడా అదే దారిలో నడవడం… ఇదంతా చాలా బలహీనంగా ఉంది. పైగా క్లయిమాక్స్ లో హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవాలని భావించిన ఎన్.ఆర్.ఐ. వరుడిని నెగెటివ్ గా చూపించడంలోనూ కొత్తదనం ఏమీ లేదు. నిత్యం గొడవపడే తన తల్లిదండ్రులకు హీరో విడాకులు ఇప్పించాలని చూసే సన్నివేశం కూడా పండలేదు. ఓ సాదాసీదా కథ తీసుకుని, అంతే సాదా సీదాగా తెర మీదకు తీసుకొచ్చారు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య.

నటీనటుల విషయానికి వస్తే విరాజ్ అశ్విన్ తన పరిధి మేరకు బాగానే నటించాడు. నేహా కృష్ణ కూడా బాగుంది. అయితే ఇగో హర్ట్ అయినప్పుడు ఆమె చెప్పే డైలాగ్స్ పరిధి దాటినట్టు అనిపిస్తాయి. మొదటి సినిమానే అయినా పర్వాలేదనిపించింది. వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళిని హీరో తల్లిదండ్రులుగా కంటే అన్నావదినలుగా చూపించి ఉండాల్సింది. హీరోయిన్ తల్లిదండ్రులుగా సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ నటించారు. సైకాలజిస్ట్ గా శ్రీకాంత్ అయ్యంగార్ నటించగా, ఇతర పాత్రలలో నిహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ధి, సుప్రజ, కృష్ఖాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు కనిపిస్తారు. యు.ఎస్. కు చెందిన మధు స్రవంతి ఈ చిత్రానికి సంగీతం అందించారు. స్వరాలు గొప్పగా లేకపోయినా, నేపథ్య సంగీతం బాగుంది. అయితే ఇగో క్యారెక్టర్స్ వచ్చే సమయంలో ఆర్.ఆర్. హారర్ మూవీని తలపించింది. స్క్రీన్ ప్లే ను సత్యానంద్, మాటలను వెంకట్ డి. పతి అందించగా, సిరాశ్రీ పాటలు రాశారు. వి.ఎన్. ఆదిత్య అనగానే ఆయన ఫ్లాప్ సినిమాలు కాకుండా సక్సెస్ అయిన ‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ చిత్రాలే మదిలో మెదులుతాయి. వాటిని తలుచుకున్నప్పుడు… ‘వాళ్ళిద్దరి మధ్య’ పేలవంగా అనిపిస్తుంది! బట్…. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఓసారి ట్రై చేయడంలో తప్పులేదు!!

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్:
ఎంచుకున్న పాయింట్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
ఆసక్తి కలిగించని కథనం
ఊహకందే ముగింపు

ట్యాగ్ లైన్: ఇగో క్లాషెస్ మధ్య!