Athidhi Web Series Review in telugu: ఒకప్పుడు హీరోగా అనేక సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి అదే ఇమేజ్ తో చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చి రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కగా అది ఈరోజు (సెప్టెంబర్ 19) నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిర్మించగా భరత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సిరీస్ ట్రైలర్ చూశాక అందరిలో ఒకరకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మరి ఆ సిరీస్ ఎలా ఉంది? ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ ను ఎంత వరకు క్యారీ చేశారు? లాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రివ్యూ చదివేద్దురు పదండి.
అతిథి వెబ్ సిరీస్ కథ (Athidhi Web Series Story) : రాజా రవి వర్మ (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) ఇద్దరూ భార్య భర్తలు. ఊరికి దూరంగా ఒక బంగ్లాలో నివాసం ఉంటారు. భార్య కాళ్ళు చచ్చుబడిపోయినా ఆమెను అమితంగా ప్రేమించే రవి వర్మ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఇక అదే ఊరిలో ఉన్న దెయ్యాల మిట్ట రహస్యం ఛేదించడానికి ఘోస్ట్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సవారి (వెంకటేష్ కాకుమాను) వెళ్లి దయ్యం కనిపించడంతో భయపడి రవి ఇంటికి వెళ్తాడు. ఇక అంతకు ముందే రవి ఇంటికి మాయ (అవంతిక) కూడా వస్తుంది. ఇక ఆమెను చూసి దెయ్యం అని భయపడి రవిని హెచ్చరిస్తాడు సవారి. అయితే ఇదే క్రమంలో పోలీసు అధికారిగా అదే ఇంట్లో ప్రకాష్ (రవి వర్మ) కూడా ప్రవేశిస్తాడు. అయితే సవారి భయపడినట్టు మాయ నిజంగా దెయ్యమేనా? కళ్ళ ముందే పొడుచుకున్నా మాయ మళ్ళీ ఎలా లేచి నిలబడింది? అసలు నిజంగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? అసలు దెయ్యం ఎవరు? లాంటి వివరాలు తెలియాలి అంటే కనుక ‘అతిథి’ వెబ్ సిరీస్ చూడాలి.
అతిథి వెబ్ సిరీస్ విశ్లేషణ (Athidhi Web Series Review) : అతిథి వెబ్ సిరీస్ ట్రైలర్ చూడగానే ఇది ఖచ్చితంగా వణికించే వెబ్ సిరీస్ అని అందరూ ఫిక్స్ అయిపోతారు. కొంత వరకు అది నిజమే. ఈ ‘అతిథి’ వెబ్ సిరీస్ ఓపెనింగ్ నుంచే దర్శకుడు భరత్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొదటి మూడు ఎపిసోడ్స్ కథపై క్యూరియాసిటీ కలిగించినా తరువాత కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఈ సిరీస్ రొటీన్ హారర్ సిరీస్ అని చెప్పలేం, అలా అని కొత్తగా ఉందని కూడా అనలేం. ఒక కొత్త ప్రయత్నంతో ప్రేక్షకులను అలరించాలి అనుకున్నారు కానీ అది కొంత వరకే వర్కౌట్ అయింది. రెగ్యులర్ హారర్ సినిమాలకి, సిరీస్ లకు మా సిరీస్ చాలా భిన్నం అని ముందే చెప్పేసిన మేకర్స్ చెప్పినట్టుగానే అలాంటివి ఏమీ లేకుండా థ్రిల్స్, సప్సెన్స్ ఎలిమెంట్స్ లాంటివి లేకుండా చూసుకున్నట్టు అనిపించింది. ఇక దెయ్యం అనగానే వణికించేలానే ఫీల్ అయ్యే మనం ఈ సిరీస్ లో చూసిన దెయ్యాన్ని చూసి ఇదేంట్రా అనిపించేలా చేశారు మేకర్స్. కథ కొంచెం కొత్తగా ఉన్నా స్క్రీన్ ప్లే కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే ‘అతిథి’ వేరేలా ఉండేది.
ఎవరెలా చేశారంటే:
ఇక ఈ సిరీస్ లో రాజా రవి వర్మ అనే పాత్రలో వేణు తొట్టెంపూడి తన మునుపటి ఇమేజ్ కి భిన్నంగా ఒక కంపోజ్డ్ పాత్రలో ఆకట్టుకున్నారు. సంధ్య పాత్ర పరిధి చాలా చిన్నది, ఒక నాలుగైదు సీన్స్ కు మాత్రమే అదితి గౌతమ్ పరిమితం అయినా తన పాత్ర వరకు నటించారు. వెంకటేష్ కాకుమాను సవారి అనే పాత్రలో ఒక పక్క భయపెడుతూ మరోపక్క నవ్వించాడు. ఇక మాయ పాత్రలో అవంతిక అదరకొట్టింది. రవి వర్మ తానూ గతంలో చేసిన కొన్ని క్యారెక్టర్ లను పోలి ఉన్న క్యారెక్టర్ లో చాలా ఈజ్ తో నటించాడు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడికి ఇది మొదటి ప్రయత్నమే అయినా ఎక్కడా అనుభవలేమి కనిపించలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ ఎపిసోడ్స్ బాగా కుదిరాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. ఇక బంగ్లా సెట్ బాగుంది. అయితే ముందు ఎపిసోడ్స్ బానే ఉన్నా మహారాజు సెటప్ వచ్చాక ఎందుకో బడ్జెట్ విషయంలో రాజీపడినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ సిరీస్ కి అసెట్ అయింది అనడంలో సందేహం లేదు.
ఫైనల్లీ: ‘అతిథి’ రెగ్యులర్ హారర్ సిరీస్‌లకు భిన్నం.. అంచనాల్లేకుండా చూస్తే నచ్చచ్చు.