తిరువీర్, తెలుగులో ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తిరువీర్ మంచి సబ్జెక్టు ఎంచుకుంటాడు అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సొంతంగా నిర్మాతగా మారి, హీరోగా నటిస్తూ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనే సినిమా చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఎప్పుడు ఈ సినిమా వస్తుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. అయితే, మీడియాకి రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. సినిమా కంటెంట్ మీద ఎంతో నమ్మకం లేకపోతే ఆ ప్రయోగం చేయరు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రొడ్యూసర్స్/హీరో నమ్మిన కంటెంట్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కథ
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో రమేష్ (తిరువీర్) ఒక ఫోటో స్టూడియో తన పేరు మీద నడుపుతూ ఉంటాడు. అతని వద్ద ఒక హెల్పర్ (రోహన్ రాయ్) పనిచేస్తూ ఉంటాడు. రమేష్‌కి పెద్దగా టెన్షన్స్ లేని జీవితం. ఊరి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా పెట్టుకున్న తన షాప్ అతని లోకం. పంచాయతీ ఆఫీస్‌లో సెక్రటరీగా పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ను దూరం నుంచి చూస్తూ ఆరాధించే రమేష్‌కి, ఆ ఊరిలో చోటా నేత దగ్గర పనిచేసే ఆనంద్ (నరేంద్ర రవి), “మండలంలోనే కాదు, జిల్లాలోనే తన ది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వాలని, అది నువ్వే చేయాలి” అని వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాడు. తర్వాత అతనికి కాబోయే భార్య సౌందర్య (యామిని)తో ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా పూర్తి చేశాక, హెల్పర్ బుడ్డోడు జేబుకు ఉన్న చిల్లు కారణంగా ఆ కెమెరా చిప్ మిస్ అవుతుంది. దీంతో, ఆనంద్ నుంచి తప్పించుకునేందుకు రమేష్ ఏం చేశాడు, చివరికి ఆ చిప్ దొరికిందా లేదా, ఆ చిప్ దొరకకపోవడం వల్ల రమేష్ ఏం చేశాడు, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
🔍 విశ్లేషణ (ప్లస్సులు, మైనస్సులు)
వాస్తవానికి మనం మలయాళ సినిమాలు చూస్తున్నప్పుడు, “అరెరే, బలే చిన్న పాయింట్ పట్టుకుని సినిమా తీసేసారే, మన తెలుగులో ఇలాంటి కథలు ఎందుకు రావు” అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే, దర్శకుడు ఆ మాటను సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ, సరదాగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన చిప్ పోతే, ఆ చిప్ కోసం పడే తంటాలను ఆధారంగా చేసుకుని కథ రాసుకున్నాడు. వినడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా, చూడడానికి కూడా అంతే సింపుల్‌గా ఉంది. ఈ మధ్యకాలంలో అశ్లీలత లేదా అసభ్యత లేకుండా నవ్వించడం కరువైపోతున్న నేపథ్యంలో, దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. సినిమా మొదలుపెట్టింది మొదలు, చివరి ఎండ్ కార్డు పడే వరకు ఆద్యంతం ఆర్గానిక్ నవ్వులు పంచే ప్రయత్నం చేసి, దాదాపుగా సఫలమయ్యాడు. సినిమా కోసం శ్రీకాకుళం నేపథ్యాన్ని ఎంచుకోవడం దర్శకుడికి మరింత ప్లస్ అయిందని చెప్పాలి. సాధారణంగానే శ్రీకాకుళం జిల్లా వారి యాస భాషలోనే వ్యంగ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తెరమీద మరింత చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాలో పెద్దగా పాత్రలు ఉండవు. హీరో, హీరోయిన్, మరో రెండు కుటుంబాలు, ఓ బుడ్డోడు… చాలా లిమిటెడ్ బడ్జెట్‌లో కథ రాసుకున్న దర్శకుడు దాన్ని చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా తెరమీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. సింపుల్ కథ, పెద్దగా నస లేకుండా, ఉన్న కాసేపు కడుపుబ్బ నవ్వించి, మనసారా ఆనందింపచేసి బయటకు పంపిస్తుంది. అప్పటివరకు తాను ఎలా అయినా చేయాలనుకున్న ఓ పని దానంతట అదే జరిగిపోతే మనిషి స్వభావం ఎలా మారుతుంది, ప్రతి సందర్భాన్ని బట్టి ఒక పని జరిగితే దానికి తగ్గ రియాక్షన్ ఎలా ఉంటుంది లాంటి విషయాలను దర్శకుడు రాసుకున్న తీరు ఆకట్టుకుంది. స్పాయిలర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా వివరంగా రాయడం లేదు. కానీ, ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్ కూడా ఒకపక్క నవ్విస్తూనే, మరోపక్క ఎమోషనల్‌గా కథ నడిపించాడు దర్శకుడు. చిన్నచిన్న లోపాలు పక్కన పెట్టి చూస్తే, ఈ సినిమా పైసా వసూల్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి.
🌟 నటీనటులు & సాంకేతిక వర్గం
నటీనటుల విషయానికి వస్తే, చేసింది తక్కువ సినిమాలలో అయినా తిరువీర్ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయ్యాడు. చేసిన తక్కువ సినిమాల్లోనే విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమాలో తిరువీర్, రమేష్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. తిరువీర్ లాంటి న్యాచురల్ యాక్టర్‌తో అంతే ధీటుగా నటించడంలో టీనా శ్రావ్య కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీరిద్దరి జంట ఆన్ స్క్రీన్ మీద భలే ఉంది. ఇక సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఆనంద్‌ది. ఆ పాత్రలో నరేంద్ర రవి అదరగొట్టాడు. నిజాయితీ, అమాయకత్వం కొట్టొచ్చినట్లుగా పాత్రలో ఇమిడిపోయాడు. ఇక అతని భార్య పాత్రలో నటించిన యామిని కూడా క్యూట్‌గా కనిపిస్తూనే నవ్వులు పూయిస్తూ ఎమోషనల్ చేసేస్తుంది. ఇక వారి తల్లిదండ్రుల పాత్రలలో నటించిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే, శ్రీకాకుళం యాసలో రాసిన డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే, నటీనటుల సహజమైన నటన కూడా బాగా దోహదపడింది. సురేష్ బొబ్బిలి సంగీతం కన్నా, నేపధ్య సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా ఒక న్యాచురల్ ఫీల్ తీసుకొచ్చింది. ఎక్కడా సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా, ఏదో ఒక ఊరిలో సరదాగా జరుగుతున్న కథని, అదే ఊరి రచ్చబండ మీద మనం కూర్చుని చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… ఫుల్లీ పైసా వసూల్ షో.