నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తమ్ముడు”. సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు 75 నుంచి 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా “తమ్ముడు” టైటిల్ పెట్టడం, నితిన్ కమ్‌బ్యాక్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
తమ్ముడు కథ:
జై (నితిన్) ఒక ఆర్చరీ ఆటగాడు. ఆసియన్ గేమ్స్‌లో కూడా పాల్గొన్న అతను, వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌గా నిలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే, ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ చెప్పడంతో, ఫిజికల్‌గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క(లయ) ప్రేమ విఫలమైన కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది. దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్‌తో ఉన్న జై, ఆమెకు సారీ చెప్పితే ఆ మానసిక సమస్య తీరి, తాను ఆర్చరీలో ఛాంపియన్‌గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అతని అక్క ఝాన్సీ కిరణ్మయి (లయ) ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్. ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుందని తెలిసి, ఆ రిపోర్ట్‌ను మార్చమని ఆ ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ (సౌరభ్ సచ్‌దేవ్) తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు. అయితే, ఒక జాతర కోసం అంబరగొడుగు అనే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై, తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు. ఈ క్రమంలో అంబరగొడుగుకు వెళ్ళిన జై (నితిన్) తన అక్కను, ఆమె కుటుంబాన్ని కాపాడగలిగాడా? ఈ క్రమంలో చిత్ర (వర్ష బొల్లమ్మ) ఎలా అండగా నిలిచింది? రత్న(సప్తమి గౌడ), గుత్తి (స్వసిక) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ : నిజానికి ఇది అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఎమోషన్‌తో సాగే సినిమా అని ముందు నుంచి టీమ్ ప్రమోట్ చేస్తూ వచ్చింది. అయితే అక్కా తమ్ముళ్ల మధ్య ఉండాల్సిన ప్రధానమైన ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంలో మిస్సయింది. నిజానికి సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలవుతుంది, తర్వాత వెంటనే అది క్రైమ్ త్రిల్లర్‌లా మారి, ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా రూపాంతరం చెందుతుంది. నిజానికి ఒకే సినిమాలో ఎన్ని కోణాలను చూపించాలనుకోవడం కాస్త సాహసమైన నిర్ణయమే, కానీ వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ దాన్ని పూర్తిస్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయాడు. నిజానికి సినిమాకు రాసుకున్న కథ ఎక్కడా రియలిస్టిక్ గా అనిపించదు. అంబర గొడుగు అనే ఒక ఎపిసోడ్ రాసుకోవడంతో ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో అది ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు దర్శకుడు. ఎందుకంటే అలాంటి ఒక కల్పిత ప్రాంతం ఉండి ఉండవచ్చు, అక్కడ ఆటవికులు ఉండి ఉండవచ్చు, కానీ సప్తమి గౌడ ఎపిసోడ్ కానీ, ఫైట్లు కానీ ఏమాత్రం రియాలిటీకి దగ్గరగా ఉండవు. అంతా ఎమోషన్‌తో నడిపించాలని అనుకున్నాడు, కానీ ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నితిన్‌కు ఒక మంచి పాత్ర దొరికింది, కానీ సినిమాలోని కథలో అతనికి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఉన్నంతలో యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టాడు. సప్తమి గౌడ పాత్ర చాలా పరిమితంగా కనిపించినా, ఆమె ఉన్నంత సేపు తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేసింది. వర్షా బొల్లమ్మ కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. లయ పాత్ర రాసుకున్న తీరు బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఫ్యామిలీలో నటించిన మిగతా వాళ్లందరూ తమ పరిధి మేరకు నటించారు. వేణు శ్రీరామ్ కుమార్తె కొన్ని కీలకమైన సీన్స్‌లో ఆకట్టుకునేలా నటించింది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పెద్దగా లేవు, కానీ గుర్తుంచుకునేలా ఒక పాట మాత్రం ఉంది. నిర్మాణ విలువలు, విఎఫ్ఎక్స్ విషయంలో వెనకబడిన ఫీలింగ్ కలుగుతుంది, ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్‌లో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా బెటర్‌గా చేయొచ్చు. మిగతా విషయాల్లో గట్టిగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. లొకేషన్స్ మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా, ఏమాత్రం అంచనాలు లేకుండా వెళితే, తమ్ముడు నచ్చే అవకాశం ఉంది.