కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గతంలో రణం లాంటి సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా మారి తన కుమారుడు రాగిన్ రాజ్ ని హీరోగా లాంచ్ చేస్తూ తల అనే సినిమా చేశాడు. బెంగాలీ భామ అంకిత నస్కర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రోహిత్, ఎస్తేర్, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ లాంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టైటిల్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి ఆ ఇంట్రెస్ట్ ని సినిమా ఎంతవరకు క్యారీ చేసింది? సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
హీరో (రాగిన్ రాజ్) తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పుడే తండ్రి(రోహిత్) వదిలేసి వెళ్లడంతో తల్లే తండ్రయి హీరోని పెంచుతుంది. అయితే తన భర్తని చూడాలని కొడుక్కి చెప్పడంతో తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అలా వెళ్ళిన క్రమంలో అతను మరో వివాహం చేసుకుని సెటిల్ అయిన విషయం తెలుసుకొని తాను కొడుకుని అని చెప్పకుండా వారి వద్దే పనికి చేరుతాడు. నెమ్మదిగా తండ్రికి నచ్చచెప్పి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నా సమయంలో ఒక మర్డర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఆ మర్డర్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? చివరికి తన తండ్రిని వెనక్కి తీసుకువచ్చాడా? అసలు రాగిన్ రాజ్ తల్లిని తండ్రి ఎందుకు వదిలేసి వెళ్లాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కవులు మాట్లాడుతున్న ఈ రోజుల్లో అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు కుర్రాళ్ళు. కానీ అమ్మకి కష్టం వస్తే ఒక కుర్రాడు ఎంత వరకు పోరాడాడు? తన తల్లి కోసం తండ్రిని తీసుకొచ్చేందుకు సిద్ధమై ఎంత యుద్ధం చేసాడు? అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించారు.. అమ్మ రాజశేఖర్ సినిమాలో ఏమేం ఉంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ మొదట్లో పాత్రల పరిచయం మొదలుపెట్టి ఇంటర్వెల్ వరకు ఈ ప్రక్రియ కొనసాగించారు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా మీద ఒక్కసారిగా ఆసక్తి పెంచేస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా సినిమా మొత్తం సాగుతుంది. నిజానికి మదర్ సెంటిమెంట్తో చేసిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. అమ్మ రాజశేఖర్ బహుశా అందుకే ఈ పాయింట్ను ఎంచుకుని ఉండవచ్చు. కాకపోతే మితిమీరిన హింస కొంత ఇబ్బంది పెట్టినా సినిమా మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. మరోపక్క ఎమోషన్స్ తో బండి నడిపిస్తూనే వైలెన్స్ విషయంలో మాత్రం కాస్త బోర్డర్ దాటేసినట్లే అనిపించింది. ఇంత హింసాత్మక చిత్రాలను ఈ మధ్యకాలంలో కొన్ని చూసాం. వాటికి మించి అనేలా ఈ సినిమా సాగింది.
నటీనటుల విషయానికి వస్తే అమ్మ రాజశేఖర్ కొడుకు అమ్మ రాగిన్ రాజ్ మొదటి సినిమా అయినా ఎక్కడ తడబాటు కనిపించలేదు. అనుభవం ఉన్న నటుడి లాగానే యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాడు. అంకితకి కూడా ఇది మొదటి సినిమాని అయినా ఆమె కూడా తన పాత్రలో ఇమిడిపోయింది. రోహిత్ తన పాత్రకు ప్రాణం పోశారు. ఎస్తేర్ అంటేనే గ్లామర్ పాత్రలు అని దర్శకులు రాసుకుంటున్న రోజుల్లో ఆమెను ఒక తల్లిగా చూపించాలని అమ్మ రాజశేఖర్ తీసుకుని నిర్ణయం.అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగం విషయానికి వచ్చేసరికి తాను చెప్పాలనుకున్న కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. సినిమాలోని పాటలు, లిరిక్స్, ఆ పాటలకు తగ్గ డాన్స్ స్టెప్స్ తో తెరమీద అందంగా చూపించారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. నిర్మాణ విలువలలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది.
తల .. తల్లి కోసం ఓ కొడుకు చేసిన యుద్ధం.. వైలెన్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.