సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్‌తో పాటు ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాను ముందు నుంచి భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు, సినిమా ప్రమోషన్స్‌లో ‘ఒక జర్నలిస్ట్’ ఉమనైజర్ అనే పదం వాడటం సినిమా మీద మరింత స్పెషల్ ఫోకస్ పడేలా చేసింది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
తెలుసు కదా కథ:
ఒక పెద్ద రెస్టారెంట్ నడిపే షెఫ్ వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ), గతంలో తాను ప్రేమించిన రాగ (శ్రీనిధి) చేతిలో మోసపోతాడు. దాన్ని దాటుకుని ముందుకు వెళ్లి, అంజలి (రాశి)ని పెళ్లి చేసుకుని లైఫ్‌లో ఒక ఫ్యామిలీ సెట్ చేసుకునే పనిలో పడతాడు. అయితే, మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల అంజలి తల్లి కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఐవీఎఫ్ (IVF) ద్వారా పిల్లల్ని కనే ప్రయత్నంలో మరోసారి రాగ, వరుణ్‌కి ఎదురవుతుంది. ఆమె ఎందుకు మళ్ళీ వరుణ్ లైఫ్‌లోకి వచ్చింది? అంజలి, వరుణ్- రాగల ప్రేమ గురించి తెలుసుకుందా? చివరికి ఏమైంది?
విశ్లేషణ:
‘తెలుసు కదా’ అనేది ఒక అద్భుతమైన రొమాంటిక్ డ్రామా. సినిమాలో ఒక ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిస్థాయిలో తెర మీదకు తీసుకు వచ్చే విషయంలో కొంత తడబాటు కనిపించింది. నిజానికి ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ, ఒక ఊహించని ట్విస్ట్‌తో సినిమా మొత్తం రాసుకున్నారు. సాధారణంగా, ఒక అబ్బాయి ప్రేమలో బ్రేకప్ అయ్యాక మరో అమ్మాయితో ప్రేమలోనో, లేక పెళ్లి రిలేషన్‌లోనో వెళ్లడం కామన్. అలా వెళ్ళాక మళ్ళీ బ్రేకప్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ తిరిగి వస్తే అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఈ సినిమా అందుకు భిన్నం. అయితే, సినిమా విషయంలో ఒకటే ఇబ్బందికరమైన అంశం, అదేమిటంటే… సినిమా అంతా బాగానే ఉంటుంది, బాగానే అనిపిస్తుంది. కానీ, నిజజీవితంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయా అనే అనుమానాలు మాత్రం కలుగుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ఎంగేజింగ్‌గా ఉండేలా రాసుకున్నారు. ముఖ్యంగా, కొన్ని సన్నివేశాలతో పాటు వైవా హర్ష, సిద్ధు జొన్నలగడ్డ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. నిజానికి, దర్శకురాలే రచయిత కూడా కావడంతో, ఆమె కథకే పరిమితమయ్యారా లేక డైలాగ్స్ కూడా ఆమె రాశారా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే, అంత రియాలిస్టిక్‌గా ఉన్నాయి. సినిమా అంతా వరుణ్, రాగ, అంజలి అనే మూడు పాత్రల మీద నడుస్తూ ఉంటుంది. ఈ మూడు పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు బావుంది. అయితే, ఎక్కువ డెప్త్‌లోకి వెళ్లకుండా సినిమా అంతా పైపైనే నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తే సినిమా ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయి ఉండేదేమో. కానీ, లాగ్ అనిపించే అవకాశాలు కూడా ఉండడంతో దాని జోలికి వెళ్లనట్లు కనిపించలేదు. నిజానికి, ఈ సినిమా ఇప్పటి యూత్‌తో పాటు ‘జెన్-జీ’ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. రకరకాల రిలేషన్ షిప్స్ చూస్తున్న వీరంతా ఈ సినిమాకి ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా కాస్త ఎక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం అప్పుడే అంచనాకి రాలేము. ఎందుకంటే, ‘అర్జున్ రెడ్డి’, ‘లవ్ టుడే’ లాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ కావడం కష్టం అని అనుకున్నారు. కానీ, అవి తర్వాతి రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. కాబట్టి, ఈ సినిమా కూడా టైంను బట్టి కనెక్ట్ అవుతుందా లేదా అనేది తెలియని పరిస్థితి. ఓవరాల్‌గా, ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకొని చేసిన సినిమాగా చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తాన్ని సిద్ధు జొన్నలగడ్డ తన భుజాలపై మోశాడు. తనకు బాగా అలవాటైన టిల్లు లాంటి క్యారెక్టర్‌లోనే మరోసారి ఆకట్టుకున్నాడు. వన్ లైనర్స్‌తో పాటు అతని క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు మాత్రం బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ నటనలో పరిణితి కనిపించింది. ఇక, రాశి ఖన్నా ఈ కాంప్లెక్స్ లవ్ స్టోరీలో తనదైన పాత్రలో ఆకట్టుకుంది. శ్రీనిధి శెట్టి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా, ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, తమన్ సాంగ్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కొత్తదనం కనిపించింది. ఫుల్ లవ్ ఫ్లేవర్ కావడంతో, సినిమా మొత్తాన్ని ఒక సపరేట్ జోనర్ అన్నట్టుగా ట్రీట్ చేసి చేసినట్లు అనిపించింది. ఇక, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు సెట్ అయింది. సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ దిగ్గజాలే కావడంతో, టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది.
ఫైనల్లీ: తెలుసు కదా… ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ, డిజైన్డ్ ఫర్ యూత్.