రెండుసార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు గౌతమ్. గౌతమ్ హీరోగా రూపొందిన “సోలో బాయ్” అనే సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రమ్య పసుపులేటి హీరోయిన్‌గా, సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.
సోలో బాయ్ కథ: కృష్ణమూర్తి (గౌతమ్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పోసాని కృష్ణమూర్తి, అనితల కుమారుడిగా సాఫీగా జీవితం గడిపేస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రియా (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందామని అడిగితే, “నా డ్రైవర్‌కి నీకన్నా ఎక్కువ జీతం వస్తుంది, నిన్ను ఎలా చేసుకుంటాను?” అంటూ అవమానించి బ్రేకప్ చెబుతుంది. దీంతో తాగుడుకు బానిస అయిపోయిన కృష్ణమూర్తిని తండ్రి మంచి మాటలతో మళ్లీ దారిలో పెడతాడు. మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత శృతి (శ్వేతావస్థి)తో ఏడడుగులు వేస్తాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో తండ్రి మరణం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంకా డీలర్‌షిప్ లోకి వెళ్తాడు. అదే సమయంలో శృతి విడాకులు ఇచ్చి వెళ్లిపోతుంది. ఒకపక్క తండ్రి మరణం, మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, భార్య విడాకులతో కృష్ణమూర్తి ఏం చేశాడు? ఈ అవమానాలను దాటుకుని, ఆర్థిక స్వావలంబనే కరెక్ట్ అని భావించి, దాన్ని ఎలా సాధించాడు? అనేది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ: ‘సోలో బాయ్’ అంటే సింగిల్‌గా వచ్చిన ఒక యువకుడు. సినిమా కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి, బ్రేకప్ అయి, మరో పెళ్లి చేసుకుని, ఆమె కూడా విడాకులు ఇచ్చాక, జీవితంలో ఎలా నిలబడ్డాడు, మధ్యతరగతి నుంచి ఎలా మల్టీ-మిలియనీర్ అయ్యాడు అనే లైన్‌తో ఈ సినిమా కథ రాసుకున్నారు. అయితే, నిజానికి ఇదే ఫార్మాట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాను వాటికి భిన్నంగా తీర్చిదిద్దే విషయంలో దర్శకుడు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. కథ రొటీన్ అయినా, కథనంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కృష్ణమూర్తి పరిచయం, అతని ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు అంటూ సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌లో అతను ఒక మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు అనేది చూపించారు. సింపుల్‌గా అనుకున్న విషయాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా, చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక మధ్యతరగతి యువకుడు మల్టీ-మిలియనీర్‌గా ఎదిగిన కథ ఈ సోలో బాయ్.
నటీనటులు: గౌతమ్ ఈ కృష్ణమూర్తి అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడు. ఎక్కడా నటిస్తున్నాడనే ఫీలింగ్ రాకుండా జీవించేశాడని చెప్పొచ్చు. ఆటిట్యూడ్ గర్ల్ పాత్రలో రమ్య పసుపులేటి కూడా జీవించేసింది. శ్వేతా అవస్థి ఉన్నంతలో మంచి మార్కులు వేయించుకుంది. పోసాని కృష్ణమూర్తి, అనితా చౌదరి, చక్రపాణి, షఫీ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాలో పాటలు సిచువేషనల్‌గా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ మంచి ప్లస్ పాయింట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ: ఈ సోలో బాయ్ ఎంతోమందికి ఓ రకమైన ఇన్‌స్పిరేషన్. కానీ, షరతులు వర్తిస్తాయి.