NTV Telugu Site icon

Samantha Yashoda Telugu Review : యశోద

Yashoda

Yashoda

స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం ‘యశోద’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఈ ఏడాది ప్రధమార్థంలో సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ విడుదలై పరాజయం పాలైంది. దాంతో అందరి దృష్టి ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యశోద’పైనే పడింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సీరిస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంతకు ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడంతోనూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. హరి, హరీష్‌ లను దర్శకులుగా పరిచయం చేస్తూ సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘యశోద’ ఎలా ఉందో తెలుసుకుందాం.

సరోగసీ ద్వారా పిల్లలను పొందుతున్న దంపతుల సంఖ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంది. అందులో అగ్రస్థానంలో నిలిచేది మిలియనీర్స్, సెలబ్రిటీసే! అనారోగ్య కారణాలతో కొందరు, అందం చెడకూడదని మరికొందరు సరోగసీ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికీ మహిళలు ముందుకు వస్తున్నారు. అలాంటి వారితో ముందే ఒప్పందం చేసుకుని బిడ్డలను మరికొందరు పొందుతున్నారు. అయితే మానవీయ కోణంలో జరగాల్సిన ఈ తంతు మొత్తం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారిపోయింది. సరోగసీ కోసం అద్దె గర్భం ఇచ్చే మహిళలు ఆర్థిక అవసరాల కారణంగా ముందుకు వస్తున్నారు. అలా సమంత తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కు చెందిన ఇవా సెంటర్ లో ఆమెకు ట్రీట్ మెంట్ జరుగుతుంది. అక్కడ ఉండే డాక్టర్ ఉన్ని ముకుందన్ సరోగసీ తల్లుల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తుంటాడు. చిత్రం ఏమంటే… నెలలు నిండిన తర్వాత సరోగసీకి అంగీకరించిన మహిళల ఉనికి తెలియకుండా పోతుంది. వీరందరూ ఏమయ్యారు? వీరికి పుట్టిన లేదా పుట్టబోయే బిడ్డలతో ఎవరు, ఏ రకమైన వ్యాపారం చేస్తున్నారు? అనేది ఓ పెద్ద మిస్టరీ! విదేశాల నుండి ఇండియాకు వచ్చిన ఓ హాలీవుడ్ యాక్ట్రస్ చనిపోవడంతో తీగ కదిలి డొంక బయట పడుతుంది. ఈ కాస్మోటిక్ మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికి తీసే క్రమంలో యశోద (సమంత) పాత్ర ఏమిటనేది వెండితెరపై చూడాల్సిందే!

మెడికల్ మాఫియా నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఇది కాస్మొటిక్ మాఫియాకు సంబంధించిన మూవీ. ఓ రాజకీయ నాయకుడితోనూ, సైంటిస్ట్ తోనూ చేతులు కలిపిన ఓ వన్నెలాడి చేసిన పెద్ద పన్నాగమే ఈ థ్రిల్లర్ మూవీ. యవ్వనాన్ని పరిరక్షించే బూస్టర్ డోసుల తయారీ, మార్కెటింగ్, తద్వారా కోట్లు గడించడం, అందుకోసం తప్పుడు మార్గాలను ఎంచుకుని అమానవీయంగా ప్రవర్తించడం ఇలాంటి అంశాలతో ‘యశోద’ సాగింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ రకరకాల మలుపులతో ఆసక్తి కరంగా నడిచింది. ఇలాంటి వారూ ఉంటారా? ఇలాంటి వ్యాపారాలు కూడా చేస్తుంటారా? అనే సందేహం పలు సందర్భాలలో వచ్చినా, రోజూ న్యూస్ ఛానెల్స్ ను, విదేశీ వార్తలను చూసి, చదివే వారికి ఇలాంటి కాస్మొటిక్ రాకెట్స్ తప్పకుండా ఉంటాయనే నమ్మకం కలుగుతుంది. మరో విశేషం ఏమంటే.. ఈ సినిమా ప్రారంభం నుండి ఇదేదో సరోగసీ నేపథ్యంలో సాగే మూవీ అనే భావనే ప్రేక్షకులకు మేకర్స్ కలిగించారు. కానీ దానిని మించిన ఓ మెడికల్ అండ్ కాస్మోటిక్ మాఫియాను ఇందులో చూపించారు. అది థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే… బలమైన కథ ఉంటే తన భుజస్కందాల మీద వేసుకుని దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలనని సమంత ‘యశోద’తో నిరూపించుకుంది. గత యేడాది వచ్చిన ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ చేసి మాస్ ను మైమరపింప చేసిన సమంత ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి నాయిక కావడం విశేషం. ఇంతవరకు సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు ఇది పూర్తి భిన్నమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉందనే భావన యాక్షన్ సీక్వెన్స్ ను చూస్తే అర్థమౌతుంది. మూవీలో అత్యంత కీలకమైన పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ చేసింది. ఇలాంటి పాత్రలు గతంతో ఆమె కొన్ని చేయడం వల్ల… ఆ క్యారెక్టర్ లో ఆమెను తేలికగానే ఆడియెన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. అయితే, ప్రేక్షకులను కాస్తంత ఆశ్చర్యానికి లోను చేసే పాత్ర ఉన్ని ముకుందన్ ది. గతంతో అతను నటించిన మూడు తెలుగు సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన పాత్ర. ఇతర ప్రధాన పాత్రలను రావు రమేశ్‌, శత్రు, సంపత్ రాజ్, మురళీ శర్మ, కల్పికా గణేశ్‌, దివ్య స్పందన తదితరులు సమర్థవంతంగా పోషించారు. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీతో పాటు మణిశర్మ నేపథ్యసంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మీ రాసిన సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. దర్శకద్వయం హరి, హరీశ్‌ లకు కథ మీద చక్కటి క్లారిటీ ఉండటంతో ఫ్లాష్ బ్యాక్స్ లో కథను నడిపినా, కన్ ఫ్యూజన్ అనేది ఆడియెన్స్ కు ఎక్కడా కలగలేదు. సమంత అభిమానులే కాదు… థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడే వారికీ ‘యశోద’ నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్:
ఎంచుకున్న పాయింట్
సమంత నటన
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
నిదానంగా సాగే ప్రథమార్ధం

కథకు అడ్డుపడ్డ పాటలు

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: కాస్మోటిక్ మాఫియా!