NTV Telugu Site icon

Recce Review: రెక్కీ (వెబ్ సీరిస్ – జీ 5)

Racce

Racce

కరోనా కారణంగా ఓటీటీ సంస్థలు పుంజుకోవడంతో బోలెడన్ని వెబ్ సీరిస్ లు తయారవుతున్నాయి. అందులోనూ డిఫరెంట్ జానర్స్ ను డైరెక్టర్స్ ఎయిమ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, డర్టీ పాలిటిక్స్ తో వెబ్ సీరిస్ రూపొందిస్తున్నారు. వెబ్ సీరిస్ మేకింగ్ లో జీ 5 కాస్తంత ముందంజలో ఉంది. ఈ మధ్యే ‘గాలివాన’ వెబ్ సీరిస్ ను ప్రసారం చేసిన ఈ సంస్థ తాజాగా ఈ శుక్రవారం ఏడు ఎపిసోడ్స్ ఉన్న ‘రెక్కీ’ని స్ట్రీమింగ్ చేసింది. గతంలో ‘బుచ్చినాయుడు కండ్రిగ’ మూవీని డైరెక్ట్ చేసిన పోలూరు కృష్ణ దర్శకత్వంలో బుల్లితెర నటుడు శ్రీరామ్ కొలిశెట్టి దీన్ని నిర్మించాడు.

‘రెక్కీ’ 1990 కాలం నాటి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరద రాజులు (‘ఆడుకాలం’ నరేన్) హత్య చుట్టూ ఈ కథ సాగుతుంది. వరద రాజులుతో రాజకీయ వైరం ఉన్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ రంగనాయకులు (రామరాజు) అతన్ని హతమార్చే పని తన అనుచరుడు కుళ్ళాయప్ప (తోటపల్లి మధు)కు అప్పగిస్తాడు. అతను పరదేశీ (సమ్మెట గాంధీ) ముఠాను రంగంలోకి దించుతాడు. పర్ ఫెక్ట్ గా రెక్కీ చేసి వీరు వరద రాజులును ఎలా హతమార్చారు? ఆ హత్య వరదరాజులు కొడుకు చలపతి (శివబాలాజీ) జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఎన్నికలు రాబోతున్న సమయంలో జరిగిన ఈ హత్య ఎలాంటి పరిణామాలకు దారితీసింది? దానిని ఛేదించడానికి వచ్చిన పోలీస్‌ ఆఫీసర్ లెనిన్ (శ్రీరామ్) తనకెదురైన అడ్డంకులను ఎలా ఛేదించాడు? అనేదే ఈ వెబ్ సీరిస్.

ఇరవై ఐదు నిమిషాలు సాగే ఏడు ఎపిసోడ్స్ ఊహకందని మలుపులు తిరుగుతూ, వీక్షకులను చూపు పక్కకు తిప్పకోనీయకుండా చేసింది. ప్రజానాయకులు.. వారికి ఉండే బలహీనతలు, తండ్రి నుండి వారసత్వంగా వచ్చే చెడు లక్షణాలు, రాజకీయ కుటుంబాలలో ఉండే కుట్రలు కుతంత్రాలు, తమకు జరిగే అన్యాయాలను మౌనంగా భరించి సర్దుకుపోయే సగటు మధ్యతరగతి మహిళలు.. వీరంతా మనకు ఈ వెబ్ సీరిస్ లో తారస పడతారు. అయితే పోలీస్ అధికారి లెనిన్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడే ఆయన భార్య రేఖ (ధన్యా బాలకృష్ణ) ఆరేడు నెలల గర్భవతిలా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మరో ఆరేడు నెలలకు ఆమెకు డెలివరీ అయినట్టుగా చూపించారు. అలానే నెలలు నిండిన భార్య కంటే కూడా డ్యూటీని ఎక్కువగా ప్రేమించే లెనిన్ పాత్రను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉండాల్సింది. ఆ భార్యాభర్తల మధ్య బంధాన్ని, ఎంతో కష్టపడి కేసును సాల్వ్ చేసిన తర్వాత దాన్ని రాజకీయ నేతలు దాన్ని నీరు గార్చిన వైనాన్ని ఇంకాస్తంత ఎమోషనల్ గా చూపించాల్సింది. ఆ విషయాలపై దర్శకుడు ఎందుకో శ్రద్ధ పెట్టలేదు.

మున్సిపల్ ఛైర్మన్ గా నటించిన ‘ఆడుకాలమ్’ నరేన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల కాస్తంత ఎబ్బెట్టుగా ఉంది కానీ మిగిలిన పాత్రలన్నింటి నోటి నుండి చక్కని రాయలసీమ యాస జాలువారింది. దాదాపు దశాబ్దం క్రితం శ్రీరామ్ తెలుగులో ‘పోలీస్ పోలీస్’ చిత్రంలో పృథ్వీరాజ్ తో కలిసి పోలీస్ పాత్ర చేశాడు. చిత్రం ఏమంటే ఇప్పటికీ అదే ఫిట్ నెస్ ను అతను మెయిన్ టైన్ చేశాడు. అతని భార్యగా ధన్యా బాలకృష్ణ నటించింది కానీ ఆమెది పెద్దంత చెప్పుకోదగ్గ పాత్ర కాదు. ఈ మధ్య కాలంలో ఆమె ఇంతకంటే ప్రాధాన్యమున్న వెబ్ సీరిస్ లు ఎన్నో చేసింది. ఇక శివబాలాజీ ది ఊహకందని పాత్ర. చాలా బాగా నటించాడు. అతని తల్లిగా రాజశ్రీ నాయర్, భార్యగా శరణ్య ప్రదీప్ చక్కని అభినయం కనబరిచారు. ఆ మధ్య వచ్చిన ‘సంస్కార్ కాలనీ’తో తన రూట్ మార్చిన నటి ఎస్తర్ నోరోన్హా ఇందులో దానికి కొనసాగింపు పాత్రను చేసింది. ఇకపై ఆమెకు ఇలాంటి పాత్రలే డైరెక్టర్స్ ఆఫర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పలు చిత్రాల్లోనూ, సీరియల్స్ లోనూ నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్న సమ్మెట గాంధీ ఇందులో రెక్కీ టీమ్ హెడ్ పరదేశీ పాత్రకు జీవం పోశాడు. అతనిపై చిత్రీకరించిన చివరి సీన్ తో ఈ వెబ్ సీరిస్ మరో సీజన్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఇక ఇతర పాత్రలను జీవా, రామరాజు, ఉమ దానం కుమార్, కృష్ణకాంత్, మురళీ, సూర్యతేజ, మణి, కోటేశ్వరరావు, స్వామినాయుడు, ప్రభావతి తదితరులు పోషించారు. రామ్ కె మహేశ్‌ సినిమాటోగ్రఫీతో పాటు శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం ఈ వెబ్ సీరిస్ ను మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. అలానే కుమార్ పి అనిల్ ఎడిటింగ్ మెచ్చదగింది. కంటెంట్ పరంగా కాస్తంత హద్దులు మీరిన సన్నివేశాలు కొన్ని ఉన్నా, బిగిసడలని రీతిలో కథనం ఉండటంతో ఈ వెబ్ సీరిస్ ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3 / 5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
ఆసక్తికరమైన కథనం
నటీనటుల నటన
ఊహించని ట్విస్టులు

మైనెస్ పాయింట్స్
బలహీనంగా హీరో క్యారెక్టరైజేషన్
పండని సెంటిమెంట్ సీన్స్
కొన్ని లూప్ హోల్స్

ట్యాగ్ లైన్: పర్ ఫెక్ట్ ‘రెక్కీ’!