NTV Telugu Site icon

Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ..

రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్ గా తలకెక్కిన మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రవితేజ మామూలుగానే స్టైలిష్ గా కనిపిస్తాడు ఆయన్ని మరింత స్టైలిష్ గా చూపించిన ఈ సినిమా ఎలా ఉండబోతున్నా అని ముందు నుంచి అందరిలో ఆసక్తి రేకెత్తించి పెట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

ఈగల్ కథ ఏమిటంటే:
ఢిల్లీలో పని చేసే నళిని రావు (అనుపమ) అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూస్తుంది. అది కొనుగోలు చేసే సమయంలో ఆ క్లాత్ పండించే ఊరికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటుంది. ఆ క్లాత్ కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మిస్ అయ్యాడు అని తెలుసుకుంటుంది. అదే విషయం మీద ఆమె పేపర్లో ఒక ఆర్టికల్ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని ఒకరోజు ముద్రించకుండా అడ్డుకుంటుంది. దీంతో అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది? అని తెలుసుకునేందుకు నళిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వెళుతుంది. ఆ తర్వాత నళిని సహదేవ్ గురించి ఏం తెలుసుకుంది? ఎక్కడో యూరప్ లో సఫారీ తీసుకుని కాంట్రాక్టు కిల్లింగ్ చేసే స్నైపర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు? కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఆపేసి పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకువెళ్లాలని ఎందుకు ప్రయత్నించాడు? అసలు అతని గురించి రాస్తే సీబీఐ కంగారు పడాల్సిన అవసరం ఏముంది? సహదేవ్ భార్య రచన(కావ్య)కి ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
రవితేజ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈగల్ సినిమాని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే టీజర్, ట్రైలర్ కట్స్ ఉండడంతో కచ్చితంగా సినిమా వేరే లెవల్ లో ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తూ వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ షాట్ నుంచి సహదేవ్ వర్మ అదేనండి మన రవితేజ క్యారెక్టర్ మీద నెమ్మదిగా అంచనాలు పెంచుతూ తీసుకువెళ్లారు. నిజానికి ఫస్ట్ ఆఫ్ మొదట్లోనే రవితేజ క్యారెక్టర్ రీవీల్ అవుతుంది అనుకుంటే అందుకు భిన్నంగా సినిమా చివరి వరకు అతని క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో ఫస్ట్ ఆఫ్ లో హీరో క్యారెక్టర్ ను రివిల్ చేసి తర్వాత హీరోయిజం చూపిస్తూ అతనితో సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఫస్ట్ ఆఫ్ నుంచి హీరో మీద ఎలివేషన్లు పెంచుతూ పెంచుతూ చివరి వరకు సినిమా నడిపించారు.. కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసుకుంటూ డబ్బు వెనకేసుకుంటున్న ఒక వ్యక్తి ప్రేమలో పడి మంచిగా మారదామనుకున్న సమయంలో ఆమె దూరమైతే అప్పటి వరకు తాను చేసిన పని వదిలేసి అక్రమ ఆయుధాలు అరికట్టడమే పనిగా పెట్టుకుంటాడు. దాని కోసం శత్రుదుర్భేద్యమైన ఒక కోట నిర్మించుకొని ఇండియా వ్యాప్తంగా జరిగే అన్ని అక్రమ ఆయుధాల డీలింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఆ అక్రమ ఆయుధాలు దొంగిలిస్తూ ఉంటాడు. అక్రమ ఆయుధాలు దుర్మార్గుల చేతికి వెళితే అవి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి అనే కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని నడిపించారు. నిజానికి మన ఇండియాతో పోలిస్తే అమెరికా, యూరప్ అలాగే మరికొన్ని ఇతర దేశాల్లో గన్ కల్చర్ బాగా ఎక్కువ. నిన్నటికి నిన్న కూడా ఒక హైదరాబాద్ యువకుడి మీద అమెరికాలో దాడి చేసి దుండగులు డబ్బు దోచుకున్న ఘటన విన్నాం. ఇలా డైలీ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నారేమో అనిపించింది. ఇక హీరో ఎలివేషన్ విషయానికి వస్తే కేజిఎఫ్ ఇప్పటికే ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఈ సినిమా కూడా కొంత దానినే ఫాలో అయినట్లు అనిపించింది. ముఖ్యంగా గన్స్ డిజైన్ చేసిన విధానం కూడా అక్కడ నుంచే ఇన్స్పైర్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే రవితేజ మార్క్ కామెడీ ఈ సినిమాలో ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సైలెంట్ గా కళ్ళతోనే కథ నడిపించే హీరోగా రవితేజ కాస్త తన గత సినిమాలకు భిన్నంగా కనిపించాడు. స్క్రీన్ ప్లే కాస్త ట్విస్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ చాప్టర్లు పెట్టి అర్థం కాని పేర్లతో కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే అక్రమ ఆయుధాల డీలింగ్స్ అన్నింటిని క్యాన్సిల్ చేస్తూ వాటిని దోచుకుంటున్న ఒక వ్యక్తి గురించి సమాజంలో భిన్న కోణాలు ఎలా ఏర్పడ్డాయి? చివరికి ఆ వ్యక్తిని అంతమొందించడానికి ప్రభుత్వం ఎలా రంగంలోకి దిగింది లాంటి విషయాలను కన్విన్సింగ్ గా తెరకెక్కించడంలో కార్తీక్ పూర్తిస్థాయిలో సఫలమయ్యాడు. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్ లో చూపించి ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. అయితే పదప్రయోగం అక్కడక్కడ కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంది. నిజానికి కొన్ని లాజిక్ కి దూరం అనిపించినా ఓవరాల్ గా సినిమా మొత్తం మీద ఎంగేజ్ చేసే విధంగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్ వర్మ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయనకు ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ తన భావాలను కళ్ళతోనే పలికించే పాత్రలో రవితేజ కనిపించాడు. ఇక రవితేజ చాలా స్టైలిష్ గా కనిపించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనుపమ పాత్ర ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తరహా పాత్ర కావడంతో ఆమె కోణం నుంచి సినిమా మొత్తం నడుస్తుంది. దాదాపుగా సినిమా మొత్తం ఆమె పాత్ర కనిపిస్తుంది. నటనకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర కాదు గాని సినిమాని నేరేట్ చేసే విధానంలో ఆకట్టుకుంది. నవదీప్ కి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్ దొరికింది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ వంటి వాళ్ల మధ్య కామెడీ ట్రాక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. పాటలు కూడా ఆడు మచ్చ, గల్లంతు వంటివి వినడానికి మాత్రమే కాదు విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. ఇక కార్తీక్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. టేకింగ్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్ అయ్యాయి. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే మరీ గ్రాందికం కొన్నిచోట్ల వాడినట్టు అనిపించింది. ఇక నిర్మాణ విలువలు టాప్ నాచ్, అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా డిజైన్ చేసిన విధానం చాలా స్టైలిష్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోకుండా ఉండలేము.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వ్యాల్యూ క్లియర్ గా కనిపిస్తోంది.. టీజీ విశ్వ ప్రసాద్ పెట్టిన ఖర్చుకు తగ్గ ప్రతిఫలం వచ్చేలా కనిపిస్తోంది. రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సారి సత్తా చాటినట్టు అయింది.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఈగల్ ఒక స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్.. అంచనాల్లేకుండా థియేటర్లకు వస్తే ఎంజాయ్ చేస్తారు.