The Birthday Boy Review: ఈ మధ్యకాలంలో విభిన్నమైన ప్రమోషన్స్ తో ఒక్కసారిగా ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా ది బర్త్ డే బాయ్. విరూపాక్ష ఫేమ్ రవి కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దర్శకుడు ప్రమోషన్స్ లో మాస్క్ ధరించి మాత్రమే కనిపించడం, సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శవాన్ని మధ్యలో పడుకోబెట్టి హడావిడి చేయడంతో ఒకసారి అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు జూలై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ది బాడ్ బాయ్ కథ:
ఐదుగురు స్నేహితులు అమెరికాలో ఒకే రూమ్ లో నివసిస్తూ ఉంటారు. బాలు(మణి), అర్జున్(వెంకీ), వెంకట్ (రాజా అశోక్),సాయి (అరుణ్), సత్తి (రాహుల్). వీరిలో బాలు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలని మిగతా వాళ్ళందరూ ప్లాన్ చేస్తారు. ఆ బర్త్ డే వేడుకలో బాగా తాగిన తర్వాత బర్త్ డే బంప్స్ అని బాలు మీద దాడి చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవగా బాలు చనిపోతాడు. అది అమెరికా కావడం, ఏం చేసినా పోలీసులతో తలనొప్పినని భావించి వారిలో అర్జున్ సోదరుడైన భరత్(రవికృష్ణ)ను అక్కడికి పిలిపిస్తారు. లాయర్ కావడంతో భరత్ ఏమైనా సలహాలు ఇస్తాడేమో అని భావించి అతన్ని పిలిస్తే అతను బాలు తల్లిదండ్రు(రాజీవ్ కనకాల, ప్రమోదిని)లకు విషయం తెలియపరుస్తాడు. దీంతో వాళ్ళిద్దరూ ఇండియా నుంచి అమెరికా వస్తారు. అయితే బాలు శవాన్ని చూసిన తర్వాత భరత్తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్(సమీర్)కి కొత్త అనుమానాలు ఎదురవుతాయి. బాలు ఈ బర్త్ డే బంప్స్ కారణంగానే చనిపోయాడా? లేక ఇంకేదైనా జరిగిందా? అని అనుమానం కలుగుతుంది. అయితే అసలు బాలు ఎలా చనిపోయాడు? ఎందుకు భరత్ ప్రవీణులకు అనుమానం వచ్చింది? చివరికి అమెరికా వచ్చిన తర్వాత బాలు తల్లిదండ్రులు ఏం చేశారు? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ: ది బర్త్ డే బాయ్ సినిమా విషయానికి వస్తే సూటిగా సుత్తి లేకుండా నేరుగా కథలోకి తీసుకువెళ్లిన డైరెక్టర్ బాలు డెడ్ బాడీతో కథ మొత్తం నడిపించిన తీరు బాగా వర్కౌట్ అయింది. బర్త్ డే బంప్స్ అంటూ బాయ్స్ గ్యాంగ్ చేసే హడావుడి నేచురల్ గా అనిపిస్తుంది. రవికృష్ణ, సమీర్ ఇద్దరూ చేసే ఇన్వెస్టిగేషన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒకపక్క డెడ్ బాడీ చుట్టూ కథ నడిపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముందుకు తీసుకువెళ్లిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు బాగా ఆసక్తికరమనిపిస్తాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ ట్విస్టులు ఉండడం సినిమాకి ప్లస్ అయ్యే అంశం. అయితే సినిమా నిడివి రెండు గంటలైనా స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టేలా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే సన్నివేశాలు ప్రేక్షకులకు భలే ఆసక్తికరమనిపిస్తాయి. ఇక చివరి 20 నిమిషాలు కథను చూపించిన విధానం అయితే ఈ దర్శకుడు కొత్త దర్శకుడేనా, అతనికి ఈ సినిమా మొదటి సినిమాయేనా అనే అనుమానం కలిగించక మానదు. ఓటీటీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే రవి కృష్ణ, రాజీవ్ కనకాల, ప్రమోదిని మినహా మిగతా పాత్రధారులు అందరు కొత్తవాళ్లే. అందులో ఒకరిద్దరూ కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా సరే ఇందులో మాత్రం ఫ్రెష్ గా కనిపించారు. ఆ ఐదుగురు తమ తమ పాత్రలకు బాగా కరెక్ట్ గా సెట్ అయ్యారు. అయితే ప్రధాన పాత్రగా రవికృష్ణను ఎంచుకోవడంతో అతని వల్లే ఏదైనా ట్విస్టులు ఉంటాయని ప్రేక్షకుడి ఈజీగా గెస్ చేయగలగడం సినిమాకి మైనస్ అయ్యే అంశం. అయితే నటన విషయంలో మాత్రం రవికృష్ణ ఇరగదీసాడు. రాజీవ్ కనకాల కనిపించేది రెండు మూడు సీన్లే అయినా పెర్ఫార్మన్స్ విషయంలో టాప్ లేపాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యే పాయింట్. ఉన్న ఒక సాంగ్ విజువల్గా ఆకట్టుకుంది. అయితే సినిమా మొత్తం అమెరికా నేపథ్యంలో సాగుతున్న సినిమా అని చెప్పారు. కానీ ఇక్కడే ఇండియాలో ఎక్కడో ఫామ్ హౌస్ లో సినిమా షూట్ చేశారా అని అనుమానం కలిగేలా కొన్ని సీన్లు ఉంటాయి. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ క్యారీ చేయడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ ను ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు.
ఫైనల్లీ ది బర్త్ డే బాయ్ ఆలోచింపజేసే మర్డర్ మిస్టరీ. థ్రిల్ చేస్తూనే ఆలోచింపచేసే విధంగా ఉంది.