క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత తీసిన సినిమా ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ మొదటి నుండి రీమేక్స్ కు దూరంగా ఉన్నారు. అప్పుడెప్పుడో తీసిన మలయాళ ‘చంద్రలేఖ’ రీమేక్ ఫ్లాప్ కావడం దానికో కారణం కావచ్చు. ఇంత కాలానికి మళ్ళీ మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను ఆయన తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేశారు. చాలా కాలం సెట్స్ లోనే ఉన్న ఈ సినిమా ఉగాది కానుకగా ఇప్పుడు జనం ముందుకు వచ్చింది. గత వారం రోజులుగా ఈ సినిమా ప్రివ్యూస్ చూసిన పలువురు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో రిలీజ్ కు ముందే ‘రంగమార్తాండ’ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
చాలామంది అనుకుంటున్నట్టు ఇది నాటక రంగానికి సంబంధించిన సినిమా కాదు. రంగస్థల కళాకారుడైన రాఘవరావు (ప్రకాశ్ రాజ్) కథ. ఓ నటుడిగా వైవిధ్యమైన పాత్రలను అలవోకగా రంగస్థలంపై పోషించిన రాఘవరావు నిజ జీవిత పాత్రను పోషించడంలో ఎలా తడబాటుకు గురయ్యాడు, దాని పర్యవసానం ఏమిటనేది చెప్పే కథ. రకరకాల పాత్రలను ఆవాహ చేసుకుని, దశాబ్దాల పాటు అద్భుతంగా పోషించిన ఓ వ్యక్తి… భర్తగా, తండ్రిగా అసలైన పాత్రలను పోషించడంలో విఫలమైతే అతని జీవితం ఏ తీరాలకు చేరిందనేది ఈ సినిమా చెబుతుంది. తరాల మధ్య అంతరాల కారణంగా ఏర్పడిన అగాధాలు, వాటిని దాటలేక సతమతం కావడం… ఇవే ఈ సినిమాలో ఉన్నాయి. తెర మీద చూపించింది రాఘవరావు అనే రంగస్థల కళాకారుడి జీవితమే అయినా ఇదో సగటు తండ్రి కథ, కుటుంబ విలువల పట్ల, అమ్మ భాష పట్ల మమకారం ఉన్న ఓ వ్యక్తి వ్యథ. నిజానికి ఇలాంటి కథాంశాలతో ఇప్పటికి చాలానే సినిమాలు వచ్చాయి.
కానీ నాటక రంగ కళాకారుడి జీవన నేపథ్యంలో దర్శకుడు తాను చెప్పాలనుకున్న మానవీయ విలువలను చెప్పడం దీని ప్రత్యేకత. రంగస్థలంపై అరివీర భయంకరమైన పాత్రలను అవలీలగా పోషించిన ఓ కళాకారుడు నిజ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు రాజీపడలేక ఎలా సతమతమౌతాడు, బేలగా మారిపోతాడు అనే విషయాన్ని రాఘవరావు, అతని స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) పాత్రల ద్వారా చూపించాడు. భర్త అడుగుజాడలలో నడిచే భార్య; పిల్లల మీద నమ్మకంతో స్వీయ నిర్ణయాలు తీసుకునే తండ్రి; పెద్దల మూర్ఖత్వం తమ కెరీర్ కు ఆటంకం అవుతుందనేమోనని భయపడే పిల్లులు… వీళ్ళను చూస్తుంటే… మన ఇంటిలోనూ, చుట్టుపక్కల తారసపడినట్టే వ్యక్తులే కదా అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్స్ ఏమీ లేవు. అన్ని పాజిటివ్ పాత్రలే. వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వారు చేసింది నిజమే కదా అనిపిస్తుంది. అయితే మంచి, చెడు మధ్య ఉండే చిన్న విభజన రేఖను గుర్తించడంలోనే విజ్ఞత దాగి ఉంటుంది. అలాంటి విజ్ఞత ఉన్న రాఘవరావు సైతం అయినవారి శరాఘాతానికి గురి కావడం బాధాకారం!
‘రంగమార్తాండ’ రాఘవరావుగా జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ నట విశ్వరూపం చూపించారు. ఆయన్ని తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. ప్రకాశ్ రాజ్ కోసమే కృష్ణవంశీ ‘నటసమ్రాట్’ రీమేక్ హక్కులు తీసుకున్నారేమో తెలియదు. ఆయన భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతం. భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి అర్థాంగి అనే పదానికి నిర్వచనంగా ఆ పాత్ర నిలిచింది. వారి కొడుకుగా ఆదర్శ్ బాలకృష్ణ, కోడలిగా అనసూయ నటించారు. వీరిద్దరూ ఆ పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. అల్లుడు, కూతురుగా రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక సహజ నటన ప్రదర్శించారు. ఇతర పాత్రలను జయలలిత, అలీ రజా, భరణి, ఈటీవీ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, సన, వైజాగ్ సత్యానంద్, భద్రం తదితరులు పోషించారు. విశేషం ఏమంటే వీరంతా తమ ఇమేజ్ కు దగ్గరగా ఉండే పాత్రలను పోషించి, మెప్పించారు. కానీ అందుకు పూర్తిగా భిన్నమైంది బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్ర. వేయికి పైగా సినిమాలలో తనదైన హాస్యంతో బ్రహ్మానందం ఇప్పటి వరకూ ఏర్పరచుకున్న ఇమేజ్ వేరు… ఇప్పుడీ సినిమాతో ఏర్పడే ఇమేజ్ వేరు. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని కృష్ణవంశీ సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించారు. బ్రహ్మానందం సినిమాలో కనిపించేది మూడు, నాలుగు సన్నివేశాలలోనే అయినా… తన నటనతో మైమరపించారు, కంటతడి పెట్టించారు. బ్రహ్మానందం, ఆయన భార్యకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఇంకాస్తంత బలంగా చూపించి ఉండాల్సింది. అప్పుడు ఆ పాత్ర తాలూకు వేదనతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవాళ్ళు.
నటీనటులతో పాటు ఈ సినిమాను ఓ మెట్టు పైకి తీసుకెళ్ళింది సాంకేతిక నిపుణులు కూడా! ముఖ్యంగా ఇళయరాజా స్వరాలు సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. స్వర్గీయ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ఆత్మగీతానికి ఇళయరాజా అద్భుత స్వరరచన చేయడంతో పాటు ఆయనే పాడారు. సినిమాలోని కీలక సన్నివేశాలలో నేపథ్యగానంగా ఇది వస్తుంది. సినిమా ప్రారంభంలో టైటిల్స్ పడేప్పుడు వచ్చే ‘నేనో నటుడ్ని’ అంటూ లక్ష్మీ భూపాల రాసిన షాయరీని చిరంజీవితో పాడించడం మరో ప్లస్ పాయింట్. మరో రెండు పాటలను కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్ రాశారు. పాటలన్నీ గొప్పగా ఉన్నాయి. ఆకెళ్ళ శివప్రసాద్ పాత్రోచితంగా, అర్థవంతమైన, ఆలోచింపచేసే సంభాషణలు రాశారు. కాలెపు మధు, వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాను తన పరిమితులకు లోబడి కృష్ణవంశీ ప్రాణం పెట్టి తెరకెక్కించారని చెప్పొచ్చు! అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టుగా ఈ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన పబ్లిసిటీ వల్ల అంచనాలు పెరిగిపోయాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ కు వెళ్ళిన వారికి ‘అంతగా ఏం లేదు’ అనిపించే ఆస్కారం లేకపోలేదు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల పనితనం
కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ
మైనెస్ పాయింట్స్
సినిమా నిడివి
నిర్మాణ విలువలు
ట్యాగ్ లైన్: కృష్ణవంశీ ఈజ్ బ్యాక్!