‘రానా నాయుడు’ టైటిల్ వినగానే వెంకటేశ్ తండ్రి, రానా తాత రామానాయుడు పేరు చప్పున గుర్తుకు రాకమానదు. అలాగే రానా పేరే టైటిల్ లో ఉండడం వల్ల కూడా ఆసక్తి కలుగుతుంది. పైగా బాబాయ్ వెంకటేశ్ తో కలసి అబ్బాయ్ రానా పూర్తి స్థాయిలో నటించిన తొలి ప్రయత్నమిది. ఆ కోణంలోనూ తొలి నుంచీ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. పైగా వెంకటేశ్ తన కెరీర్ లోనే అత్యంత భిన్నమైన పాత్రలో ఇందులో కనిపించారు. ఆయనకు ఇదే మొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం! ఇన్ని విధాలా ఆసక్తి కలిగించిన ‘రానా నాయుడు’ ప్రమోషనల్ మీట్ లో వెంకటేశ్, ఈ సిరీస్ ను ‘ఇంటిల్లిపాదితో కలసి చూడకండి. ప్రైవేట్ గా ఎవరికి వారు చూడవలసిందే’అని చెప్పారు. అప్పటి నుంచీ కుర్రకారులో మరింత ఆసక్తి పెరిగింది. మార్చి 10వ తేదీ నుండి ‘రానా నాయుడు’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నాగ నాయుడు అనే ఓ బాధ్యతలేని తండ్రికి ముగ్గురు కొడుకులు, ఓ అమ్మాయి ఉంటారు. వీరు కాకుండా మరో ఆవిడద్వారా ఇంకో అబ్బాయికీ జన్మనిచ్చి ఉంటాడు. నాగ నాయుడు కొడుకుల్లో రెండోవాడయిన రానా నాయుడు ముంబైలో ఎంతోమంది సెలబ్రిటీస్ కు కీలకమైన సమయాల్లో సాయం చేసే ఫిక్సర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ పొలిటీషియన్, ఓ స్టార్ హీరో, ఓ టైకూన్, వారి వారి జీవితాల్లోని చీకటి కోణాలు, వాటి వల్ల వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించడంలోనూ రానా నాయుడు వారికి సహకరిస్తూ ఉంటాడు. అతని తండ్రి నాగ నాయుడు పదేళ్ళు చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించి వస్తాడు. తన చిన్నకొడుకును చిన్నప్పుడు లైంగికంగా వేధించిన ఓ స్వామిజీని భయపెడతాడు నాగ. అతను మూడు కోట్ల రూపాయలు ఇచ్చి, తనను వదిలేయమంటాడు. నాగ నాయుడును చూస్తేనే కొడుకు రానా నాయుడుకు కంపరమెత్తుతూ ఉంటుంది. తన పిల్లలను, అన్న, తమ్ముడిని కూడా తండ్రితో కలవనివ్వ కూడదని భావిస్తూంటాడు. అయితే రానా నాయుడు భార్య దయతలచి, నాగ నాయుడుతో పిల్లలను కలవనిస్తుంది. అప్పుడు తన కూతురు తేజను గుర్తు చేసుకుంటాడు నాగ నాయుడు. ఆమె పేరునే రానా నాయుడు తన కూతురుకు పెట్టడం కూడా ఆనందం కలిగిస్తుంది. అసలు తన పిల్లలను ఎందుకు కలుసుకున్నావని రానా నాయుడు, తండ్రిని నిలదీస్తాడు. ఇకపై తనకు కుటుంబమే సర్వస్వం అంటాడు నాగ నాయుడు. అతని మరో కొడుకును కొట్టిస్తాడు రానా. ఓ రోజు నాగ నాయుడుకు ఓ వ్యక్తి ద్వారా తన కొడుకు రానా నాయుడే తనను చేయని నేరానికి జైలుకు పంపాడని తెలుస్తుంది. ఆ తరువాత ఆ తండ్రీకొడుకుల మధ్య ఏమయిందన్నదే మిగిలిన కథ.
మొత్తం పది ఎపిసోడ్లలో రూపొందిన ‘రానా నాయుడు’కు అమెరికన్ టీవీ సీరియల్ ‘రే డోనావన్’ ఆధారం. అందులో లాగే ఇందులోనూ శ్రుతిమించిన అశ్లీలం, అసభ్య పదజాలం వినిపిస్తాయి. మొన్నటి దాకా ఫ్యామిలీ హీరో అని పేరున్న వెంకటేశ్ కు ఇందులోని నాగ నాయుడు పాత్ర విలక్షణమైనదే అయినా, ఆయన అభిమానులు, ముఖ్యంగా మహిళలు ఏవగించుకొనే పాత్ర అది. అయితే వెంకటేశ్ ను ఎక్కడా మేకప్ చేసినట్టు అనిపించని విధంగా తయారు చేశారు. ఈ గెటప్ లో ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందేమో! రానా తనకున్న పరిధిలో చక్కని అభినయం ప్రదర్శించారు. గుమ్మడి జయకృష్ణ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. చీకటి బజారులోని పలు కోణాలను, పలువురు ప్రముఖుల జీవితాల్లోని చీకటి కోణాలనూ ఇందులో ఆవిష్కరించారు. కానీ ‘అతి’ అతకనట్టుగానే కనిపిస్తుంది. దాంతో కొన్ని ఎపిసోడ్స్ ఏవగింపూ కలిగిస్తాయి. మొత్తానికి కుర్రాళ్ళను మాత్రం ఆకట్టుకొనే పలు అంశాలను దర్శకులు చొప్పించారు. బూతు కూతలు శ్రుతిమించాయనే చెప్పాలి. పల్లెటూళ్ళలో సైతం వినిపించని రీతిలో ఇందులో బూతు మాటలు చోటు చేసుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
– వెంకటేశ్ తొలి వెబ్ సిరీస్ కావడం
– తొలిసారి వెంకటేశ్, రానా కలసి నటించడం
– కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
– అంతగా ఆకట్టుకోని కథ, కథనం
– సాగదీసినట్టున్న సన్నివేశాలు
– శ్రుతిమించిన బూతు
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్: బూతుల నాయుడు!