NTV Telugu Site icon

Ramarao on Duty Movie Review: రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ

Ramarao On Duty

Ramarao On Duty

 

గత యేడాది ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజా రవితేజా ఈ యేడాది ‘ఖిలాడీ’తో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో శరత్ మండవను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ నిర్మించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’పైనే అందరూ దృష్టీ పెట్టారు. సబ్ కలెక్టర్ గా రవితేజ పోషించిన రామారావు పాత్రను వాస్తవం సంఘటన ఆధారంగా తయారు చేశానని దర్శకుడు చెప్పడంతో ఈ మూవీ ‘క్రాక్’ తరహాలో అతన్ని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని భావించారు. మరి రామారావు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.

రైతులకు కష్టం వస్తే తట్టుకోలేని మనస్తత్వం ఉన్న వ్యక్తి రామారావు (రవితేజ). సబ్ కలెక్టర్ గా కొన్నిసార్లు తన పరిధిని దాటి కూడా బీదలకు న్యాయం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఓ కేసులో డిమోషన్ అయ్యి, సొంత జిల్లాకు ఎమ్మార్వోగా వెళ్తాడు. తన మాజీ ప్రియురాలు మాలిని (రజీషా విజయన్) భర్త సురేంద్రను వెతికే పనిలో రామారావు పడతాడు. ఆ క్రమంలో అక్కడి లోకల్ సీ. ఐ. మురళీ (వేణు తొట్టెంపూడి)తో రామారావుకు వైరం ఏర్పడుతుంది. కనిపించకుండా పోయిన కోట్ల రూపాయల విలువ చేసే మాల్ కోసం సీఐ, ఆచూకీ లేకుండా పోయిన ఇరవై మంది కుర్రాళ్ళ కోసం రామారావు తీవ్రంగా గాలిస్తుంటారు. మాల్ కీ – మురళీకి సంబంధం ఏమిటీ? మనుషుల మాయం వెనుక మిస్టరీ ఏమిటీ? అనేది మిగతా కథ.

ఈ మూవీ పబ్లిసిటీ సమయంలో రామారావు అనే సబ్ కలెక్టర్ రైతుల కోసం నిలబడే వ్యక్తిగా చూపించారు. కానీ థియేటర్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇది ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ సాగే కథ అని అర్థమౌతుంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో ‘పుష్ప’ సినిమా రావడం వల్ల దర్శక నిర్మాతలు ఈ మెయిన్ పాయింట్ ను హైడ్ చేసి ఉండొచ్చు. అయితే అందులో హీరో పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లర్ కాగా, ఇందులో రామారావు అలాంటి వాళ్ళ భరతం పట్టే ప్రభుత్వ అధికారి! తప్పిపోయిన వ్యక్తులను వెతికే క్రమంలో రామారావు చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదిగా మారిపోయింది. పైగా రామారావు మాజీ ప్రియురాలు కథలోకి ఎంట్రీ ఇవ్వగానే అతని భార్య నందిని (దివ్యాంశ కౌశిక్) ఇన్ సెక్యూరిటీ ఫీల్ కావడం, కుటుంబ సభ్యులు సైతం రామారావును నిలదీయడం వంటి సన్నివేశాలు అతని క్యారెక్టర్ ను తగ్గించేశాయి. ప్రజల కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం రామారావు ఎంతకైనా తెగించే మనిషి అని తెలిసి కూడా ఇంట్లో వాళ్ళే అతన్ని నిలదీసినట్టు చూపడం బాగోలేదు. దానికి తోటు అతని కుటుంబ సభ్యుల మరణాలు, వాటి పర్యవసానం కూడా ఆడియెన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ఏ సమయంలోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకులకు లేకుండా పోయింది. చివరికైనా కథకు ఓ ముగింపు పలికారా అంటే అదీ లేదు…. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందన్నట్టు ముగించారు.

నటీనటుల విషయానికి వస్తే… రవితేజ నుండి సగటు ప్రేక్షకుడు కోరుకునే జోష్ ఇందులో కనిపించలేదు. యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. వాటిలో రవితేజ మార్క్ కనిపించింది. రవితేజ సినిమాల్లో ఉండే పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్, విలన్ ని అతను ఆడుకునే విధానం ఇందులో మిస్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రధాన లోపం ఏమిటంటే… హీరోకు సరైన ప్రత్యర్థి అంటూ లేడు. వేణు పాత్ర ఓ స్థాయిలో సమఉజ్జీగా నిలిచినా, తర్వాత హీరోవైపు అది టర్న్ కావడంతో మూవీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తమిళ నటుడు జాన్ విజయ్ ఎస్పీ దేవానంద్ గా ప్రాధాన్యమున్న పాత్ర చేసినా, అతన్ని డైరెక్టర్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. జాన్ విజయ్ ఆ మధ్య ఓటీటీ మూవీ ‘భామా కలాపం’లో భిన్నమైన పాత్రను పోషించి, మెప్పించాడు. నిజానికి ఈ సినిమాలో నటీనటులకు కొదవలేదు. అరవింద్ కృష్ణ, శ్రీ, చైతన్య కృష్ణ, రాహుల్ రామకృష్ణ వంటి వాళ్లు ప్రాధాన్యమున్న పాత్రలను పోషించారు. నాజర్, పవిత్ర లోకేష్, నరేశ్‌, మధుమణి, సమ్మెట గాంధీ, భరణి వంటి వారూ తెర మీద కనిపించారు. కానీ వీరెవ్వరినీ దర్శకుడు పెద్దంత ఉపయోగించుకోలేదు. ఇక తోటపల్లి మధు చేసిన పొలిటీషియన్ పాత్ర బొత్సను జ్ఞప్తికి తెచ్చేలా ఉంది. కాస్తంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వేణు తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అతను ఉన్నంత సేపే ఆడియెన్స్ కు కాస్తంత రిలీఫ్ లభించింది. ఇక హీరోయిన్లు ఇద్దరివీ పెద్దంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు కాదు. వారిపై చిత్రీకరించిన పాటలు కూడా ఏమంత గొప్పగా లేవు. ఇక సీసా ఐటమ్ సాంగ్ ను సినిమా ప్రారంభంలోనే పెట్టేశారు. దాంతో కిక్ పోయింది. సి. ఎస్. శామ్ బాణీలు రొటీన్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఒకే తరహాలో సాగింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత చెరుకూరి సుధాకర్ మూవీ మేకింగ్ లో ఎక్కడా రాజీ పడలేదు. రవితేజ సైతం మూవీ నిర్మాణలో భాగస్వామి కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ ఈ సినిమాకు వచ్చిన హైప్ కు తగ్గట్టుగా ‘రామారావు’ డ్యూటీ చేయలేదనిపిస్తుంది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
యాక్షన్ థ్రిల్లర్ కావడం
భారీ తారాగణం ఉండటం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్
ఆసక్తి కలిగించని కథనం
పేలవమైన బాణీలు

ట్యాగ్ లైన్: లోపించిన సిన్సియారిటీ!