రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా తెరకెక్కింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితములోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నానని వర్మ ప్రకటించడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. నిజానికి ఈ సినిమా అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. సెన్సార్ ఇష్యూస్ కావడంతో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.
కథ:
రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వీరశంకర్ రెడ్డి మరణం నుంచి సినిమా మొదలవుతుంది. ఆయన మరణంతో ఆయన కుమారుడు మదన్ (అజ్మల్ అమీర్) ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన తండ్రి మరణంతో అనేక వందలమంది ప్రాణాలు కోల్పోయారని విషయం తెలిసి వారందరినీ ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు. అయితే అందుకు భారత్ పార్టీ హై కమాండ్ ఒప్పుకోదు. దానికి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు(ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీతో కలిసి అక్రమ ఆస్తుల కేసులు పెడతారు. దీంతో ఆ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకుంటాడు మదన్. మదన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాక జరిగిన ఎన్నికల్లో శ్రవణ్ కళ్యాణ్ మద్దతుతో ఇంద్ర బాబు గెలుస్తాడు. ఆ తర్వాత ఇంద్ర బాబుకు శ్రవణ్ కు మధ్య ఎందుకు దూరం పెరిగింది? మదన్ ప్రజలకు ఎలా దగ్గర అయ్యాడు? కనీవినీ ఎరుగని రీతిలో ఎలా గెలుపు బావుటా ఎగురవేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రారంభమైనప్పుడే ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారులు ఎవరినీ ఉద్దేశించినవి కావు అని రాంగోపాల్ వర్మ వాయిస్ ఓవర్ వస్తుంది. కానీ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా వైయస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారమని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. పలుసార్లు సెన్సార్ తో ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలో ఎవరికి పోలికలు లేవని, ఒకవేళ ఏవైనా పోలికలు ఉంటే అవి యాదృచ్ఛికమేనని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే వీఎస్ వీర శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి మొదలైన ఈ సినిమా ఆ తర్వాత ఆయన కుమారుడు మదన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులకు లోనయ్యారు? ఎలాంటి పరిస్థితులలో ఓదార్పు యాత్ర మొదలు పెట్టాల్సి వచ్చింది? ఆయనకు అప్పటి భారత్ పార్టీ అధిష్టానానికి ఎందుకు దూరం పెరిగింది? లాంటి విషయాలను డిస్కస్ చేస్తూ మొదటి భాగాన్ని ముగించారు. ఆ తర్వాత ఓదార్పు యాత్ర, 2014 ఎన్నికలను చూపించడమే కాక అప్పుడు ఇంద్రబాబు, శ్రవణ్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు ఎలా వెళ్లారు? ఎలాంటి హామీలు ఇచ్చారు? మదన్మోహన్ ఎలాంటి హామీ ఇచ్చారు? వంటి విషయాలను చూపించారు. ఆ తర్వాత అసలు లీడర్ కూడా అవ్వాలని అనుకోని మదన్మోహన్ ఎందుకు ప్రజలకు దగ్గర అవ్వాలి అనుకున్నాడు? ప్రజలకు ఏం చేయాలనుకున్నాడు? లాంటి విషయాలను చూపించారు. అయితే నిజానికి ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ గతంలో కొన్ని సందర్భాలలో కొంత మంది వ్యక్తులు ప్రెస్ మీట్లలో లేదా ఇంటర్వ్యూలలో వ్యక్తీకరించినవే. వాటికే రామ్ గోపాల్ వర్మ ఒక దృశ్య రూపకం ఇచ్చాడని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు వరకు ఈ సినిమా సాగుతుంది. ఆ మధ్యలో జరిగిన అనేక సన్నివేశాలను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని వర్గాల వారికి సినిమా నచ్చకపోవచ్చు కానీ వైయస్ జగన్ ఆయన పార్టీని అభిమానించే వారికి నచ్చే అవకాశాలున్నాయి. మిగతా వారికి ఇది ఒక పేరడీ సినిమా అనిపించవచ్చు.
నటీనటుల విషయానికి వస్తే మదన్మోహన్ రెడ్డి అనే పాత్రలో నటించిన అజ్మల్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాటల వరకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా నటించాడు. ఆయన భార్య మాలతి అనే పాత్రలో నటించిన మానస కూడా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంద్ర బాబు అనే పాత్రలో నటించిన ధనుంజయ్ కూడా లుక్స్ విషయం అనే కాదు నటన విషయంలో కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ మార్క్ టెక్నిక్స్ కొన్ని ఈ సినిమాలో కనిపించాయి. మధ్య మధ్యలో పాటల్లో రాంగోపాల్ వర్మ కూడా గొంతు కలిపారు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు సరిపోయింది. నిడివి కూడా రెండు గంటల ఒక నిమిషమే కావడం కాస్త కలిసొచ్చే అంశం. వైయస్సార్సీపి, రావాలి జగన్ కావాలి జగన్ రీమిక్స్ వంటి సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది.. ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క విధమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.
ఫైనల్ గా : వైసీపీ అభిమానులకి రామ్ గోపాల్ వర్మ మార్క్ గిఫ్ట్