NTV Telugu Site icon

Game Changer Review: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రివ్యూ!

Game Changer

Game Changer

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలున్నాయి. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకఅంతకూ పెరుగుతూ వెళ్లాయి. దానికి తోడు సినిమా రిలీజ్ లేట్ అవడం, ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
రామ్ నందన్(రామ్ చరణ్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన ప్రియురాలు దీపిక (కియారా అద్వానీ) కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు. విశాఖలో పోస్టింగ్ రావడంతో మొదటి రోజే మీటింగ్ పెట్టి అక్కడి అధికారులకు, క్రిమినల్స్, క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ లకు షాక్ ఇస్తాడు. అయితే ఈ క్రమంలోనే మంత్రి బొబ్బిలి మోపిదేవి ( ఎస్జే సూర్య) వ్యాపారాలు కూడా దెబ్బ తింటాయి. ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి ( శ్రీకాంత్) కొడుకు కూడా అయిన మోపిదేవి తండ్రిని చంపి తానే సీఎం అవ్వాలని అనుకుంటాడు. అయితే తన మరణం తరువాత ముఖ్యమంత్రిగా రామ్ నందన్ ను చేయాలని వీడియో సందేశం పెట్టీ సత్యమూర్తి చనిపోవడం చచ్చినయాంశమవుతుంది. అయితే సత్యమూర్తి కోరిక మేరకు రామ్ నందన్ ముఖ్యమంత్రి అవుతాడా? సీఎం అవ్వడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న మోపిదేవి ముఖ్యమంత్రి అయ్యాడా? అసలు సత్యమూర్తి రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఇక కథలో అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) పాత్రలు ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :
గేమ్ చేంజర్ పేరుకు తగ్గట్టుగానే భారతీయుడు 2 సినిమాతో దారుణమైన ఇబ్బందులు పడుతున్న శంకర్ కి ఈ సినిమా మంచి ఊతమిస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అది పూర్తిస్థాయిలో సఫలమయ్యే పరిస్థితి ఈ సినిమాతో కనిపించడం లేదు. ఈ సినిమా ఒక పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్.. ఒక ఐఏఎస్ అధికారికి పొలిటికల్ లీడర్ కు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు శంకర్. సాధారణంగానే శంకర్ సినిమాలు అంటే జనాన్ని తట్టి లేపేలా, ఆలోచింపచేసేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో కూడా అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కానీ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. కాకపోతే స్క్రీన్ ప్లేతో దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నిజానికి శంకర్ పొలిటికల్ సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో అంచనాలు పెట్టుకుని ధియేటర్లకు వస్తారు. కానీ ఆ అంచనాలను ఈ సినిమా పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది అని చెప్పొచ్చు. సినిమాలో రామ్ చరణ్ చేత ఐయామ్ అన్ ప్రేడిక్టబుల్ అనే డైలాగ్ చెప్పించారు కానీ సినిమా మొత్తం ఊహించదగ్గట్టుగానే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన సగటు ప్రేక్షకుడి సైతం తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగా అర్థం చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు, అపరిచితుడు లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆలోచింప చేయడమే గాక ఊహకు అందకుండా ఉండి ఎంగేజ్ చేశాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శంకర్ ఆ విషయంలో కేర్ తీసుకోలేదేమో అనిపించింది. లవ్ ట్రాక్ కానీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కానీ ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. నిజానికి ఈ రోజుల్లో జరుగుతున్న రియల్ లైఫ్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి కానీ సినిమాలో ఎంతో స్కోప్ ఉన్నా ఎందుకో శంకర్ పూర్తిస్థాయిలో సినిమాని ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించడంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ మొత్తం పెద్దగా ఆసక్తి కలిగించకుండానే సాగిపోతున్నా ఇంటర్వెల్ ముందు మాత్రం లాజిక్స్ ని క్వశ్చన్ చేసేలా ఒక ట్విస్ట్ తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు కథ మొదలవుతుంది అనుకుంటే మళ్ళీ అక్కడక్కడే తిప్పే ప్రయత్నం చేశాడు శంకర్. ఒక ముఖ్యమంత్రి కి ఐఏఎస్ అధికారికి మధ్య పెట్టిన తగవు ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది కానీ అది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించలేదు. అంతేకాక సినిమాలో లాజిక్ కి అందని సీన్స్ చాలా ఉన్నాయి. ఆ విషయంలో శంకర్ కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా పొలిటికల్ సబ్జక్ట్స్ మీద శంకర్కి ఉన్న పట్టు సడలిందా అని అనుమానాలు కలిగించేలా ఈ సినిమా సాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటర్లను ఉత్తేజపరిచే సీన్స్ కానీ ఎలక్షన్స్ విషయంలో ఉన్న కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. శంకర్ కథ రొటీన్ గా ఉన్నా తాను రాసుకున్న ట్విస్టుల విషయంలో అలాగే స్క్రీన్ ప్లే విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ అనే రెండు పాత్రలు పోషించారు. అందులో ఒకటి యంగ్ ఆఫీసర్ లుక్ లో రామ్ చరణ్ కనిపించగా అప్పన్న అనే ఒక విలేజర్ లుక్ లో కూడా కనిపించారు. ఇక రెండు లుక్స్ తో భిన్నమైన పాత్రలలో ఆయన అలరించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రామ్ చరణ్ గేమ్ అనిపించేలా చాలా సీన్స్ లో నటించాడు. నిజానికి అప్పన్న పాత్రకు పెట్టిన ఒక చిన్న లోపంతో ఆ పాత్ర నటించే విషయంలో రామ్ చరణ్ కి మరింత బాధ్యత పడిందని చెప్పొచ్చు. అలాగే రామ్ నందన్ లుక్ మాత్రం అదిరిపోయింది. యాక్టింగ్ విషయంలో కూడా రామ్ చరణ్ కి వంకలు పెట్టే అవకాశం లేకుండా ఆయన రెండు పాత్రలను పోషించాడు. అంజలి పాత్రకు ప్రాధాన్యత ఉంది కానీ చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. కియారా అద్వానీ పాత్ర ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఉన్నంతలో గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక సినిమాలో చాలామంది నటీనటులు కనిపించారు కానీ ఎస్ జె సూర్య- రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఒకరికొకరు పోటా పోటీగా నటించారు. ఇక శ్రీకాంత్ కి కూడా చాలా కాలం తర్వాత బరువైన పాత్ర పడింది . అంతే ఈజ్ తో ఆయన తన అనుభవంతో నటించాడు. రాజీవ్ కనకాల, సముద్ర కని, సునీల్, సీనియర్ నరేష్, కంచరపాలెం కిషోర్ వంటివాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రియదర్శి, వైవాహర్ష, కమెడియన్ సత్య ఇలా ప్రస్తుతం హీరోలుగా కూడా సినిమాలు చేస్తున్న వాళ్లు ఈ సినిమాల్లో కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు. వారినీ మరింత వాడుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. మామూలుగానే శంకర్ సినిమాలంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమాటోగ్రఫీ కనిపించింది. అలాగే తెలుగులో వ్రాసిన డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాంగ్స్ తెరమీద చూడటానికి చాలా రిచ్ గా అలాగే కన్నుల విందుగా ఉన్నాయి. ఎడిటింగ్ మీద మరింత కేర్ తీసుకుని ఉండవచ్చు. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ఉపయోగపడింది. సినిమాను ఎలివేట్ చేయడంలో ఉపయోగపడింది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంది? సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టినట్లు అనిపించింది.

ఫైనల్లీ:
ఫైనల్ గా గేమ్ చేంజర్ ‘రామ్ చరణ్’ గేమ్.

Show comments