Perfume Movie Review: కొత్త తరహా సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి మేకర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్మెల్ బేస్డ్ కాన్సెప్ట్ తో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ ఆసక్తి ఏర్పడింది. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన పర్ ఫ్యూమ్ అనే సినిమాలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించగా జే.డి.స్వామి డైరెక్ట్ చేశారు. ఆరుగురు స్నేహితులు కలిసి ఈ “పర్‌ఫ్యూమ్” సినిమాను నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలైన క్రమంలో ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథ
స్మెల్ అబ్‌సెషన్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడే వ్యాస్(చేనాగ్) సైకోగా మారి అమ్మాయి వాసన వస్తే చాలు వాళ్ళ దగ్గరకు వెళ్లి తేడాగా వాసన చూస్తూ ఇబ్బంది పెడుతుంటాడు. ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోకపోతే ప్రమాదకరమైన కిల్లర్‌గా మారుతాడని ఏసీపీ దీప్తి(అభినయ) ఫిక్స్ అయి అతని వేటలో ఉంటుంది. మరోపక్క వ్యాస్ కోసం లీలా (ప్రాచీ థాకర్) కూడా వెతుకుతుంటుంది. ఈ వెతుకులాటలో వ్యాస్ కనిపించడంతో ఆమె ఒక లిప్ లాక్ ఇస్తుంది. అయితే వ్యాస్ ఆమె మాయలో పడి ఆమెను ట్రేస్ చేస్తూ వెళ్లగా వ్యాస్‌ను లీలా అవమానపరుస్తుంది. దీంతో లీలా మీద పగతీర్చుకునేందుకు ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆమెను కిడ్నాప్ చేసి ఏం చేశాడు? అసలు లీల ఎందుకు వ్యాస్ ను కిస్ చేసింది? ఆమె ఎందుకు వ్యాస్ ను అవమానించింది? లీల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వ్యాస్ ను వెతికే పనుల్లో ఉన్న ఏసీపీ వ్యాస్ ను పట్టుకుందా? అనే వివరాలు తెలియాలి అంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ఒకరకమైన మూస సినిమాలకు అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిపుడే మారుతున్నారు, సినిమా కొత్తగా అనిపిస్తే మేకర్స్ ఎవరు? నటీనటులు కొత్తవారా? కాదా? అనేది కూడా చూడకుండా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రేక్షకులని నమ్ముకుని ఒక కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందు వచ్చారు ఈ సినిమా మేకర్స్. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినప్పుడు జనాలకు కనెక్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా కాన్సెప్ట్ కనెక్ట్ అయితే దర్శకుడు సక్సెస్ అయి సినిమా హిట్ అవుద్ది. ఈ పర్‌ఫ్యూమ్ సినిమాకు ఆ విషయంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. ముందు నుంచి ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనుకున్నా అతని బాధను ఆడియెన్స్ ఫీలయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే హీరో ఎమోషన్‌ను బోర్ కొట్టించకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంతో దర్శకుడు తడబడడంతో ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ సోసో అనిపించినా సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ కట్ చేశారు. అసలు హీరో ఏం చేస్తాడా? అని అంతా ఆలోచిస్తూ ఉండగా సగటు ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా ఈ కథనం సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే సైకో వ్యాస్ పాత్రలో చేనాగ్ సూట్ యాది. కొత్త హీరో అనేలా కాకుండా ఈజ్ తో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. లీల కారెక్టర్‌లో ప్రాచీ కూడా తన ప్రయత్నాం చేసింది. ఏసీపీ దీప్తిగా అభినయ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించినట్టు అనిపించింది. టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుంచుకోదగ్గవి లేవు కానీ డైలాగ్స్ మాత్రం భలే ఉన్నాయి. నిజాలను గట్టిగా చెప్పించాడు డైరెక్టర్. ఇక కెమెరావర్క్ కూడా సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి మీద ఫోకస్ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సైతం సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ: పాయింట్ కొత్తదే అయినా ట్రీట్మెంట్ బాగుంటే వేరే లెవల్లో ఉండేది, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చచ్చు.