ఈ మధ్యకాలంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది హీరోయిన్స్‌గా మారుతున్నారు. అలాగే, ప్రీతి పగడాల అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ‘పతంగ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. గతంలో ఒక పాటల కాంపిటీషన్‌తో వెలుగులోకి వచ్చిన ప్రణవ్ కౌశిక్ ఒక హీరోగా, వంశీ పూజిత్ అనే మరో కుర్రాడు మరో హీరోగా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమా ‘పతంగ్’. గాలిపటాల పోటీల నేపథ్యంలో ఒక వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులకి ఏ స్థాయి వినోదాన్ని అందించిందో ఈ రివ్యూలో చూద్దాం.
పతంగ్ కథ:
పాతబస్తీలో విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్ననాటి నుండే ప్రాణమిత్రులు. ఒకరు మాస్ అయితే మరొకరు క్లాస్. వీరిద్దరి స్నేహం గాలిపటాలతోనే మొదలవుతుంది. వీరి జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశించాక సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఐశ్వర్య మొదట విస్కీతో లవ్ ట్రాక్ నడిపి, ఆ తర్వాత అరుణ్‌తో ప్రేమలో పడుతుంది. చిన్నప్పటి నుంచే కన్ఫ్యూజన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఐశ్వర్య, తన మనసు ఎవరి వైపు ఉందో తేల్చుకోలేని స్థితిలో ఆ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చుకు దారి తీస్తుంది. చివరకు ఆమె ఎవరికి దక్కాలనే విషయాన్ని ‘పతంగ్ ఫైట్’ (గాలిపటాల పోటీ) ద్వారా నిర్ణయించాలని ఒక పెద్ద మనిషి సూచిస్తాడు. పతంగ్ ఎగరేయడంలో మొనగాడైన విస్కీకి, అసలు అదేమీ తెలియని అరుణ్ ఎలా పోటీ ఇచ్చాడు? చివరకు గెలిచింది ఎవరు? ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే ఈ సినిమా కథ.
సినిమా విశ్లేషణ:
దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఒక పాత ‘లవ్ ట్రయాంగిల్’ పాయింట్‌కు గాలిపటాలు ఎగురవేయడం అనే ఒక సరికొత్త స్పోర్ట్‌ను జోడించి చాలా ఫ్రెష్‌గా వెండితెరపై ఆవిష్కరించారు. ప్రమోషన్లు తక్కువగా ఉన్నా, ఊహించని విధంగా కంటెంట్ పరంగా ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సినిమా ప్రారంభంలోనే గౌతమ్ మీనన్ వచ్చి కథ ప్రారంభించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఓ ఇద్దరు కుర్రాళ్ళు, వారి స్నేహం, వారి మధ్య ఎంట్రీ ఇచ్చిన ఓ అమ్మాయి, ఆ అమ్మాయి కోసం వాళ్లు పడ్డ పాట్లు అంటూ.. ఇలా స్నేహం, ప్రేమ, సరదా కామెడీతో చాలా కలర్‌ఫుల్‌గా సాగిపోతుంది.
ఇక ఇంటర్వెల్ తర్వాత ముగ్గురి మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ కాస్త నెమ్మదించి బోర్ కొట్టిస్తాయి. అలాగే క్లైమాక్స్ ముందు వచ్చే గాలిపటాల పోటీ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్ అనిపించేలా ఈ క్లైమాక్స్ ఫైట్ డిజైన్ చేసిన తీరు, అందుకు జోడించిన కామెంట్రీ హిలేరియస్‌గా ఉంటుంది. అలాగే పూర్తిస్థాయి ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సహజమైన డైలాగ్స్ రాసుకున్నారు.
నిజానికి ఎప్పటి నుంచో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తెలుగులో నడుస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు ‘జెన్ జీ’ (Gen Z) కిడ్స్ కోసమే రాసుకున్నట్లుగా ఈ కథ అనిపిస్తుంది. స్నేహితుడు, అతని ప్రియురాలు, మధ్యలో మరో స్నేహితుడు ఎంట్రీ; ప్రియురాలు అతడి మీద మనసు పారేసుకుని ఆ స్నేహితులు ఇద్దరి మధ్య ఎలా చిచ్చు పెట్టింది, చివరికి ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవానికి ఈ సినిమా చూస్తున్నప్పుడు కొంచెం దగ్గరగా ‘బేబీ’ పోలికలు కనిపిస్తాయి, కానీ ‘బేబీ’ ఎమోషనల్ వేలో సాగితే ఇది పూర్తిస్థాయి లైటర్ నోట్‌లో సాగుతుంది. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకపోవడం సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి, ఎందుకంటే థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు కాసేపు మనసారా నవ్వుకుంటూ బయటకు వస్తాడు.
నటీనటుల పనితీరు: గాయకుడిగా సుపరిచితుడైన ప్రణవ్ కౌశిక్ క్లాస్ పాత్రలో ఒదిగిపోగా, మాస్ యాటిట్యూడ్‌తో వంశీ మెప్పించాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్నేహాన్ని బాగా ఎలివేట్ చేసింది. ఇక క్యూట్ లుక్స్‌తో ప్రీతి పగడాల అమాయకపు పాత్రలో ఆకట్టుకుంది. ముఖ్యంగా కమెడియన్ విష్ణు ఓఐ సెకండాఫ్‌లో తన టైమింగ్‌తో సినిమాను భుజాలపై మోశాడు. సీనియర్ నటులు ఎస్పీ చరణ్, అను హసన్, గెస్ట్ రోల్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమ పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. శక్తి అరవింద్ ఛాయాగ్రహణం స్క్రీన్‌ను రంగులమయంగా మార్చగా, జోస్ జిమ్మి నేపథ్య సంగీతం ఫన్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కత్తిరిస్తే బాగుండేది. గాలిపటాల పోటీల్లో ఉపయోగించిన గ్రాఫిక్స్ చాలా సహజంగా ఉన్నాయి.
ఫైనల్‌గా: ‘పతంగ్’ ఒక జెన్ జీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.