Ori Devuda Movie Review: రెండేళ్ళ క్రితం తమిళంలో వచ్చిన ‘ఓ మై కడవులే’ సినిమాను ‘ఓరీ దేవుడా!’ పేరుతో తెలుగులో పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు రీమేక్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ దేవుడిగా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం విశేషం. తమిళ మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగు వర్షన్ కూ దర్శకత్వం వహించాడు. మరి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ టార్గెట్ ఆడియెన్స్ ను రీచ్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.
అర్జున్ (విశ్వక్ సేన్), మణి (వెంకటేశ్ కాకుమాను), అను (మిథిలా పార్కర్) స్కూల్ మేట్స్. అను, మణిల కంటే కాస్తంత లేటుగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న అర్జున్ ఓ నైట్ వీళ్ళకు పబ్ లో పార్టీ ఇస్తాడు. ఆ సందర్భంగా ‘ముక్కూముఖం తెలియని అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం తనకు ఇష్టం లేద’ని చెబుతాడు. వెంటనే అను… ‘మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా?’ అని అడిగేస్తుంది. ఆమె ప్రపోజల్ ను తిరస్కరించడానికి ఎలాంటి రీజన్స్ అతని దగ్గర లేకపోవడంతో, పెళ్ళికి ఓకే చెప్పేస్తాడు. పెద్దల అంగీకారంతో అర్జున్, అను పెళ్ళి జరిగిపోతుంది. అయితే ఏడాది తిరిగేసరికీ వీళ్ళిద్దరూ డైవర్స్ కోసం ఫ్యామిలీ కోర్టులో అడుగు పెడతారు. చిన్నప్పటి నుండి స్నేహితులైన వీళ్ళు ఒకరిని ఒకరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? అర్జున్ సీనియర్ స్కూల్మేట్ మీరా (ఆశా భట్) ఎంట్రీతో వీరి మ్యారేజ్ లైఫ్ ఎలా స్పాయిల్ అయ్యింది? కూతురునిచ్చి పెళ్ళి చేయడమే కాకుండా, జాబ్ కూడా ఇచ్చిన మావగారిపై అర్జున్ కు ఎందుకంత కోపం? ఈ మొత్తం వ్యవహారంలో అర్జున్ కు దేవుడు అడగకుండానే ఎలాంటి సాయం చేశాడు? అనేదే మిగతా కథ.
మనిషికి కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని నిందించడం, ఆ టైమ్ లో అతని మీద కాస్తంత కనికరంతో ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానే సాయం చేయడమనేది మనం చాలా మూవీస్ లో చూశాం. ఇదీ అలాంటి కథే. లవ్వే లేని లవ్ మ్యారేజ్ చేసుకుని సతమతమవుతున్న అర్జున్ కి దేవుడు ఎలాంటి సాయం చేశాడనే దానిపైన ఈ కథ సాగుతుంది. హీరో జీవితాన్ని యేడాది పాటు వెనక్కి తీసుకెళ్ళి, తిరిగి ఫ్రెష్ గా స్టార్ట్ చేయమనడమనేది ఇందులోని న్యూ పాయింట్. దీనికి తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో మనవాళ్ళు రీమేక్ రైట్స్ తీసుకుని మూవీ మొదలెట్టారు. కానీ మధ్యలో కరోనా రావడంతో షూటింగ్ పూర్తి కావడం, రిలీజ్ కావడం లేట్ అయ్యింది. అక్కడ అశోక్ సెల్వన్ పోషించిన హీరో పాత్రను ఇక్కడ విశ్వక్ సేన్ చేశాడు. దేవుడిగా తమిళంలో విజయ్ సేతుపతి చేస్తే… తెలుగులో వెంకటేశ్ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఈ సినిమాను ఇప్పటికే కన్నడలో ‘లక్కీ మేన్’గా రీమేక్ చేశారు. అక్కడ గాడ్ క్యారెక్టర్ ను పునీత్ రాజ్ కుమార్ పోషించాడు. ఈతని మరణానంతరం విడుదలైన ఈ సినిమాకు అక్కడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే… విశ్వక్ సేన్ కెరీర్ ప్రారంభం నుండి అతని వెన్నంటి ఉన్న ఫ్రెండ్, డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ దీనికి మాటలు రాశాడు. తమిళ సంగీత దర్శకుడు లియో జేమ్స్, కెమెరామాన్ విధు అయ్యన తెలుగు వర్షన్ కూ వర్క్ చేశారు.
దర్శకుడు అశ్వత్ మరి ముత్తు తన తమిళ సినిమానే తెలుగులోనూ యథాతథంగా తీసేశాడు. అక్కడ… ఇక్కడ పాత్రధారులు మారారు తప్పితే, పేర్లను కూడా అలానే ఉంచేశాడు. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాలలో…. దేవుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో, ఊహించని సమస్య వచ్చినప్పుడే మనిషి లైఫ్ లోకి ఎంటర్ అయ్యి, అతన్ని ఒడ్డున పడేస్తాడు. కానీ ఇందులో ఏదో సరదాకి ఓ వ్యక్తి జీవితాన్ని సరిచేయడానికి వచ్చేసినట్టు చూపించారు. చిత్రంగా దేవుడే… సహదేవుడిని కోర్టుకు పంపి, క్లయింట్ ను తన లవ్ కోర్టు కు రప్పించుకుంటాడు. అతనికి సమస్యను పరిష్కరించుకునేందుకు కొన్ని నిబంధనలతో వరం కూడా ఇస్తాడు. టూ బి ఫ్రాంక్…. ఇలాంటి మూవీస్ లో లాజిక్ వెతక్కూడదు. బట్… తెర మీద దృశ్యాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తే ఓకే కానీ అలా కాకపోతే మాత్రం బోలెడన్ని సందేహాలు వస్తాయి.
చైల్డ్ హుడ్ ఫ్రెండ్ కాబట్టి భార్య మీద రొమాంటిక్ ఫీలింగ్ కలగడం లేదని హీరో చెప్పడానికీ, సీనియర్ క్లాస్ మేట్ మీద అతనికి క్రష్ ఏర్పడటానికి మనకు ఎలాంటి రీజన్స్ కనిపించవు. హీరోహీరోయిన్ల విడాకులకు దారి తీసిన సంఘటనలూ ఏమంత బలంగా లేవు. వాళ్ళిద్దరూ డైవోర్స్ కోసం కోర్టు కొచ్చినప్పుడు ఫ్రెండ్ తప్పితే, పేరెంట్స్ ఎందుకు రాలేదో అర్థం కాదు. తమిళంలో జనంకు నచ్చింది కాబట్టి, ఇక్కడా గట్టెక్కేస్తాం అనే ధీమా కనిపించింది తప్పితే, దీన్ని అక్కడి కంటే బెటర్ గా ఎలా తీద్దామనే ఆలోచన దర్శక నిర్మాతలు చేసినట్టుగా అనిపించదు. దాంతో ఇదో రొటీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది. మూవీలో మురళీ శర్మ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ మాత్రం హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.
ఈ యేడాది ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ మూవీలో అర్జున్ అనే పాత్రను చేశాడు విశ్వక్ సేన్. ఇందులోనూ అతని పాత్ర పేరు అదే! తమిళంలో అదే పేరు పెట్టాం కదాని తెలుగులోనూ ఆ పేరే పెట్టేశారు. అర్జున్ గా విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. కానీ అతిగా, అనవసరంగా నవ్వడం, లౌడ్ గా మాట్లాడటం తగ్గించుకుంటే బాగుంటుంది. హీరోయిన్స్ ఇద్దరూ తెలుగుకు కొత్త కావడంతో ఆ ఫ్రెష్ నెస్ స్క్రీన్ మీద కనిపించింది. పొట్టి నూడిల్స్ పాపగా మిధిలా పార్కర్ స్టీల్ ద షో! మీరా క్యారెక్టర్ ను ఆశా భట్ హుందాగా పోషించి, మెప్పించింది. హీరో స్నేహితుడి పాత్రలో వెంకటేశ్ కాకుమాను చక్కగా ఇమిడిపోయాడు. ఎప్పటిలానే మురళీ శర్మ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. హీరో తల్లిదండ్రులుగా నాగినీడు, రాజశ్రీ నాయర్, జడ్జిగా జయలలిత నటించారు. తమిళంలో గౌతమ్ వాసుదేవ మీనన్ చేసిన డైరెక్టర్ గెస్ట్ రోల్ ను ఇక్కడ పూరి జగన్నాథ్ చేశారు. ఇక స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన వెంకటేశ్ దేవుడిగా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఆయన పక్కన సహదేవుడిగా రాహుల్ రామకృష్ణ నటించాడు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రత్యేకమైనవే అయినా… గతంలో ఇలా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన దేవుడి పాత్రలతో పోల్చితే… అంతగా ఇవి నప్పలేదు. దేవుడిని ఓ సామాన్యుడు తొలిసారి చూసినప్పుడు ప్రేక్షకులలో కలిగించాల్సిన వైబ్రేషన్స్ ను డైరెక్టర్ కల్గించలేకపోయాడు. ‘పాఠశాలలో…’, ‘బుజ్జమ్మా’ పాటలు వినడానికి బాగున్నాయి. తరుణ్ భాస్కర్ మాటలు, విధు సినిమాటోగ్రఫీ బాగా సెట్ అయ్యాయి. పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని తీశారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని హీరో సరైన దారిలోకి రావడమనేది మెచ్చదగ్గ పాయింటే అయినా దాన్ని డైరెక్టర్ మరింత ఎఫెక్టివ్ గా తీయాల్సింది, ఎందుకంటే ఇది అతనికి సెకండ్ టైమ్ కాబట్టి!!
రేటింగ్ : 2.5 / 5
ప్లస్ పాయింట్స్
రొమాంటిక్ ఎంటర్ టైనర్
తరుణ్ భాస్కర్ డైలాగ్స్
లియో జేమ్స్ రీ-రికార్డింగ్
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
మైనెస్ పాయింట్స్
థ్రిల్ కలిగించని దేవుడి పాత్ర
బలహీనమైన కథ
ఊహకందే క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: కామెడీ దేవుడు!