Dhootha Web Series Review: అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆయన గత కొద్దిరోజులుగా సరైన హిట్ కొట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించగా మనం సినిమా ఫేమ్ విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ దూత. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించినా ఒకరోజు ముందుగానే ఏ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
దూత కథ:
సాగర్ వర్మ అవధూరి(నాగ చైతన్య) ఒక పేరున్న జర్నలిస్ట్. కొత్తగా పెట్టిన సమాచార్ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా… ధూమ్ ధామ్ అనే ధాబా దగ్గర కారు ట్రబుల్ ఇస్తుంది. అయితే అనుకోకుండా ఆ ధాబాలోకి వెళ్లిన సాగర్ కంట ఓ పేపర్ కటింగ్ పడుతుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి భార్య పిల్లలకు ఏమీ కాకుండా అతని పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత వరుసగా కొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడుతూ ఉంటాయి, అందులో రాసి ఉన్నట్టే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కుమార్తె మరణం తరువాత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సాగర్ ఇలా ఎందుకు జరుగుతోంది? జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పేపర్లలో రాసి పంపుతున్నది ఎవరు? అయితే సాగర్ వర్మను ఇలా వెంటాడేది ఎవరు? ఈ క్రమంలో సాగర్ భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ అయిన జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్) పాత్రలు ఏమిటి? ఈ హత్యలకి దూత పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి(పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ వరుస హత్యలను డీఎస్పీ క్రాంతి షెనాయ్ (పార్వతి తిరువొతు) ఎలా సాల్వ్ చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
విక్రమ్ కె కుమార్ ఇప్పటికే డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దూత అనే సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక విక్రమ్ కె కుమార్ లాంటి టాప్ క్లాస్ డైరెక్టర్ ఇలాంటి సిరీస్ చేస్తున్నాడు అనగానే సహజంగా అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను అందుకునేందుకు విక్రమ్ కె కుమార్ తన అనుభవాన్ని అంతా రంగరించాడు. ఇక నిజానికి ‘దూత’ కథ మొదలైనప్పటికీ ఆ అసలు కథ ఏంటి అనేది మాత్రం ఐదు ఎపిసోడ్స్ పూర్తి అయ్యాక కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే అప్పటి వరకు కథ గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు సరికదా కాసేపటికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియాన్సిచ్చేలా రాసుకున్నాడు. మొదటి ఎపిసోడ్ మొదలైన కాసేపటికి కథలోకి వెళ్లినా అసలేమీ అర్ధం కాని విధంగా ప్రేక్షకులను సస్సెన్స్ లో ఉంచడంలో విక్రమ్ సక్సెస్ అయ్యాడు. సాధారణంగా జరగబోయే విషయాలు ముందే రాసి పంపుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో దెయ్యమే అయి ఉంటుందని మన సగటు ప్రేక్షక బుర్ర ఫిక్స్ అయినా భయపెట్టకుండా ఆలోచింప చేస్తూ ముందుకు నడిపించాడు. అయితే నిజానికి మంచి ఫ్లోతో పరిగెడుతున్న కథకు ఫ్లాష్ బ్యాక్ బ్రేకులు వేసింది. అప్పటి వరకు అబ్బుర పరుస్తూ ముందుకు వెళ్లిన కథను రొటీన్ రివెంజ్ స్టోరీనే కదరా అనిపించేలా చేసింది. మొదటి ఐదు ఎపిసోడ్స్ వరకు చాలా సస్పెన్స్ మైంటైన్ చేసిన విక్రమ్ కె కుమార్… ఆ తర్వాత కథను ముగింపు దశకు తీసుకు రావడానికి ఉన్న క్యారెక్టర్లను అన్నిటినీ కనెక్ట్ చేసిన విధానం మాత్రం వాస్తవ దూరంగా ఉంది. ఇక ఫ్యామిలీస్ కి దూరం చేయడం కోసమే అన్నట్టు కొన్ని బూతులు కూడా చొప్పించారు. ఇక ఈరోజు ఉన్న మీడియా, రాజకీయనాయకులు, పోలీసుల మీద సెటైర్ వేస్తూనే ఆ రంగాల్లో మంచి, చెడులను కూడా చూపే ప్రయత్నం చేశారు.
నటీనటుల విషయానికి వస్తే కనుక నాగ చైతన్య సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్ తో మంచి ఫిజిక్ తో అదరగొట్టేశాడు. సాగర్ భార్య ప్రియగా ప్రియ భవాని శంకర్ కూడా ఉన్నంతలో పాత్రను బానే నడిపించింది. ఇక
డీసీపీ క్రాంతిగా మలయాళ నటి పార్వతి తిరువత్తు యాప్ట్ అనిపించింది. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్రహ్మీ కొడుకు రాజా గౌతమ్ కనిపించింది కాసేపే అయినా నెగిటివ్ రోల్స్ లో అదరగొట్టారు. ఇక పశుపతి, తనికెళ్ళ భరణి, రోహిణి, అనీష్ కురువిళ్ళ, రఘు కుంచె, తేజ కాకుమాను, చైతన్య గరికపాటి, శ్రీధర్ రెడ్డి, సాయి కామాక్షి భాస్కరాల వంటి వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నీకల్ విషయంకి వస్తే ఆ విషయంలో ‘దూత’ ఉన్నత స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అనిపించేలా ఉంది. ఎందుకో సిరీస్ మూడ్ అంతా వర్షంలోనే ట్రావెల్ అయ్యేలా చేశారు, మరీ ముఖ్యంగా ఆ సీన్స్ అయితే బాగా తీశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి నేపథ్య సంగీతంతో భయపెడతారు అనుకుంటే అదేమీ లేకుండా మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఇక శరత్ మరార్ నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
ఫైనల్లీ: దూత నిడివి సంగతి పక్కన పెట్టేసి మొదటి 20 నిముషాలు చూస్తే మిగతా ఎనిమిది భాగాలూ ‘Binge Watch’ చేయిస్తుంది.