తమిళంలో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచిన డీఎన్ఏ అనే సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి మై బేబీ పేరుతో తీసుకొచ్చారు. నెల్సన్ వెంకటేషన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తమిళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. అధర్వ, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది కూడా రివ్యూలో చూద్దాం.
మై బేబీ కథ :
ఆనంద్ (అధర్వ) ఒక లవ్ ఫెయిల్యూర్. అతని ఫ్యామిలీ అంతా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటుంటే, అతను మాత్రం తాగి పడిపోతూ ఉంటాడు. అలాంటి ఆనంద్‌కు మానసిక సమస్యలతో బాధపడుతున్న దివ్య (నిమిషా)తో పెద్దలు పెళ్లి జరిపిస్తారు. ఇక ఆనంద్ కూడా దివ్యతో పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయి, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమకు గుర్తుగా దివ్యకు ఒక మగ బిడ్డ పుడతాడు. అయితే, ఇంక్యుబేటర్‌లో పెట్టడానికి తీసుకువెళ్లి తీసుకువచ్చే లోపల బిడ్డ మారిపోవడంతో దివ్య ఈ విషయాన్ని అందరికీ చెబుతుంది. అయితే, ఈ విషయాన్ని దివ్య మానసిక పరిస్థితి రీత్యా ఎవరూ నమ్మరు. అయినప్పటికీ, భార్య మాటల మీద కాస్త నమ్మకంతో డీఎన్ఏ పరీక్ష చేయించిన ఆనంద్‌కు భార్య చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన బిడ్డను మార్చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆనంద్. మరి చివరికి ఏం తెలిసింది? తన బిడ్డను మార్చింది ఎవరు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమా తమిళంలో రూపొందించబడిన ఒక క్రైమ్ థ్రిల్లర్. అయితే, వాస్తవానికి ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా అని పోలీసుల నేపథ్యంలో లేదా ఒక సీఐడీ ఆఫీసర్ లేదా డిటెక్టివ్ నేపథ్యంలోనే ఉంటుంది. కానీ, ఇందులో నెల్సన్ వెంకటేషన్ ఆసక్తికరంగా, పిల్లాడిని పోగొట్టుకున్న ఒక తండ్రి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే ఎలా ఉంటుందో అనే కోణంలో కథ రాసుకున్నాడు. ఇక చెప్పుకోవడానికి, ఇది ఒక థ్రిల్లర్ అయినా సరే, అంతర్లీనంగా ఎన్నో సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, అవి సినిమా చూసినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. సినిమాగా చూస్తే, ఈ సినిమా ఓపెనింగ్ కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే, పెళ్లి అయ్యాక దివ్య బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, “ఇది నా బిడ్డ కాదు, నా బిడ్డ ఎక్కడ?” అంటూ కుటుంబాన్ని అడిగినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి మొదలవుతుంది. ఆ తర్వాత, ఒక్కొక్క సీన్‌లో “నెక్స్ట్ ఏం జరగబోతోంది?” అనే ఉత్కంఠతో ప్రేక్షకులు అందరూ సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి, సినిమా ప్రారంభించడంతోనే అసలు నిందితులు ఎవరో క్లారిటీ ఇచ్చేస్తాడు దర్శకుడు. అయితే, వారిని గుర్తు పెట్టుకోకుండా, కాసేపటికి ఒక కొత్త క్యారెక్టర్‌ను ఎంటర్ చేస్తూ నడిపించిన విధానం ఆకట్టుకుంది. రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని అనలేం, కానీ సినిమా ఎంగేజ్ చేయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒకపక్క థ్రిల్లింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ని కూడా మేనేజ్ చేస్తూ చేసుకున్న ఈ సినిమా ఆసక్తికరంగా సాగింది.
నటీనటుల విషయానికి వస్తే, అధర్వ నటనలో చాలా పరిణతి కనిపించింది. ఒక్క పాత్రలోనే అనేక వేరియేషన్స్ చూపిస్తూ నటించాల్సి రావడంతో, అతనికి నటుడిగా ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆయన తర్వాత అంత చాలెంజింగ్ పాత్ర నిమిషాకి దొరికింది. మానసిక పరిస్థితి సరిగా లేని అమ్మాయి, తర్వాత బిడ్డను పోగొట్టుకున్న ఒక తల్లి పాత్రలో ఆమె జీవించింది. మిగతా వారందరూ రొటీన్ పాత్రలే అయినా, ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, జిబ్రాన్ రికార్డింగ్స్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అయితే, పాటలు ఉన్నా ఎందుకో అవి అంతగా సెట్ కాలేదు. సినిమాటోగ్రఫీ స్క్రీన్‌ప్లేకి కావాల్సిన ప్రెజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ పరంగా ఒకే, కానీ ఫస్ట్ హాఫ్ ఇంకా ట్రిమ్ చేసి ఉండొచ్చు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. అయితే, తెలుగు పాటల విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది.
ఫైనల్‌గా, మై బేబీ ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ విత్ సం మెసేజెస్.