NTV Telugu Site icon

Ravanasura Movie Review: రావణాసుర

Ravanasura

Ravanasura

మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా, వాల్తేరు వీరయ్య’ హిట్స్ తో మంచి జోరు మీదున్నారు. ‘రావణాసుర’తో రవితేజ హ్యాట్రిక్ ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రావణాసుర’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో “స్వామి రా రా, దోచెయ్, కేశవ, రణరంగం” వంటి చిత్రాలు రూపొందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ తెరకెక్కింది. ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

‘రావణాసుర’ కథ విషయానికి వస్తే – రవీంద్ర ఓ క్రిమినల్ లాయర్. అతని మాజీ లవర్ కనకమహాలక్ష్మి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. హారికను చూసి ఇష్టపడతాడు రవీంద్ర. ఆమె తండ్రిని తెలివిగా ఓ మర్డర్ కేసులో ఇరికించి, ఆ కేసులో వారికి సాయం చేస్తున్నట్టుగా ఆమెకు దగ్గరవుతాడు. సాకేత్ రామ్ అనే ప్రోస్థెటిక్ ఆర్టిస్ట్ సాయంతో రకరకాల గెటప్స్ వేస్తూ రవీంద్ర మర్డర్స్ చేస్తూ ఉంటాడు. చివరకు తనతో సఖ్యంగా ఉండే హారికను కూడా చంపుతాడు రవీంద్ర. ఈ వరుస హత్యల కారకులు ఎవరో అన్న అంశంపై ప్రభుత్వం ఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఈ దారుణ హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లాయర్ రవీంద్రనే అని ఆ ఆఫీసర్ పసిగడతాడు.అతను ఆ మర్డర్స్ చేయడానికి కారణం ఏమిటి? ఆ తరువాత ఏమయిందన్నది సినిమాలో చూడాల్సిందే.

రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా నటించారు. ఆరంభంలో రవితేజ, హైపర్ ఆది కామెడీ ఆకట్టుకుంటుంది. సుశాంత్ తన పాత్రకు న్యాయంచేశారు. నాయికలు కూడా తమకు ఇచ్చిన రోల్స్ లో శక్తిమేరకు నటించారు. కానీ, వారికి ఏ లాంటి ప్రాధాన్యత లేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ బాణీలు పరవాలేదు. రవితేజ పాడిన “ప్యార్ లోన పాగల్…” క్యాచీగా ఉంది. “డిక్క డిష్యుమ్…” పాటకు మాత్రం భీమ్స్ సిసిరోలియో స్వరకల్పన చేశారు. వెంకటేశ్ ‘సూర్య ఐపీయస్’లోని ఇళయరాజా బాణీల్లో రూపొందిన సీతారామశాస్త్రి గీతం “వేయిన్నొక్క జిల్లాల వరకు…” అంటూ సాగే పాటను రీమిక్స్ చేశారు. అది కూడా కాస్త ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి హీరో రవితేజ కూడా భాగస్వామి. అందువల్లేమో భారీగా తీసే ప్రయత్నం చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. పాత కథలను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు దర్శకుడు సుధీర్ వర్మ. ఇందులోనూ అదే పంథాను అనుసరించారు. ఏదేమైనా ఈ చిత్రం రవితేజ ముందు సినిమాల స్థాయిలో లేకపోవడం నిరాశ కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
– రవితేజ అభినయం
– ప్రొడక్షన్ వేల్యూస్

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– అంతగా అలరించని సంగీతం
– హీరోయిన్స్ కు ప్రాధాన్యత లేకపోవడం
– రొటీన్ అనిపించే ఉన్న కొన్ని సీన్స్

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: మరో మెడికల్ మాఫియా – రావణాసుర