మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమే అయింది. రచయితగా పలు సినిమాలకు పనిచేసిన భాను భోగవరపు దర్శకుడిగా మారి, మాస్ జాతర అనే సినిమా రవితేజతో రూపొందించారు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాలతో ఎట్టకేలకు అక్టోబర్ 31వ తేదీన ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఈ సినిమాని ఎందుకో ముందు నుంచి లో ప్రొఫైల్లోనే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే, ఈ సినిమా చూసి షాక్ అవ్వకపోతే, తాను ఇక సినిమాలు చేయడం మానేస్తానని రాజేంద్రప్రసాద్ స్టేట్‌మెంట్ ఇచ్చాక, సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూశారు. ఆ సినిమా మరి ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
మాస్ జాతర కథ:
భేరి లక్ష్మణ్ (రవితేజ) రైల్వే శాఖలో ఒక ఎస్సై. తన పరిధిలో జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ ఉండడంతో, అనేక స్టేషన్లు మారాల్సి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే, ఉత్తరాంధ్రలోని అడివి వరం అనే పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడికి వెళ్లిన వెంటనే, ఆ ఊరి జనం చేత గంజాయి పండించి అమ్మిస్తున్న శివుడు (నవీన్ చంద్ర)తో విభేదం ఏర్పడుతుంది. ఈ గ్రామంలోనే, నవీన్ చంద్ర అమ్మాలని ప్రయత్నించిన గంజాయి లోడ్ ట్రైన్‌లో వస్తుందని తెలుసుకుని, దాన్ని రవితేజ మాయం చేస్తాడు. ఆ గంజాయి లోడ్ మొత్తాన్ని లక్ష్మణ్ అసలు ఏం చేశాడు? లక్ష్మణ్ మనసు పడ్డ తులసి (శ్రీ లీల) అతనికి ఎలా షాక్ ఇచ్చింది? అసలు మాస్ జాతర అనే టైటిల్‌కి, సినిమా కథకు సంబంధమేంటి? లాంటి విషయాలు తెలియాలంటే, సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
రచయితగా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు పనిచేసిన భాను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడంటే, అందరూ అతను పనిచేసిన సినిమాల లాంటి సినిమానే చేస్తాడని అనుకున్నారు. కానీ, ఆ కామెడీ అనే తన కోర్టు వదిలిపెట్టి, మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే మరో కోర్టులో ఆడటానికి సిద్ధమయ్యాడు భాను. నిజానికి, ఇది కథగా చెప్పుకుంటే పరమ రొటీన్ కథ. ఎన్నో సినిమాల్లో మనం చూసేసే ఉంటాం. కానీ, మరోసారి దాన్ని ఆకట్టుకునేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు భాను భోగవరపు అండ్ టీమ్. అయితే, ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో సఫలం కాలేదని చెప్పాలి. నిజానికి, మాస్ మసాలా ఎంటర్‌టైనర్ కావడంతో, ఒకపక్క కామెడీ, సాంగ్స్‌తో పాటు ఫైట్స్‌ని కూడా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు. కానీ, మిగతా అన్ని విషయాలను వెనక్కి నెట్టి, ఫైట్స్ మాత్రమే సినిమాల్లో కుదిరినట్లు అనిపించింది. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ అధికారి, ముందు ఇబ్బందులు పడి, తర్వాత ఆ అన్యాయాన్ని న్యాయంగా ఎలా ఎదిరించారు అనే లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్‌తో రూపొందింది. కాకపోతే, ఇక్కడ పవర్ తక్కువ ఉన్న రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ కనిపిస్తాడు. కొత్తదనం కోసం ఆశిస్తే, ఖచ్చితంగా నిరాశ పడతారు. మధ్య మధ్యలో నవ్వుకోవడానికి, హైపర్ ఆది, అజయ్ ఘోష్ వంటి క్యారెక్టర్లను పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. అవి కొంతవరకు బానే ఉన్నా, తర్వాత ఆ క్యారెక్టర్లు చేసే కామెడీ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంతేకాక, రొటీన్ కథ కావడం, ట్రీట్‌మెంట్ అంతకన్నా రొటీన్‌గా ఉండడంతో, ఇది అంతా ఒక అవుట్‌డేటెడ్ కంటెంట్ ఫీల్ కలిగిస్తుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లిన వారికి, ఫైట్ సీక్వెన్స్‌ల వరకు బాగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే, సినిమా ఎందుకో రియాలిటీకి దగ్గరగా అనిపించదు. ఒక ప్రత్యేకమైన ఊరు సృష్టించి, అందులో ఈ సమస్యలన్నీ గుప్పించిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు
ఈ సినిమాలో రవితేజ వన్ మ్యాన్ షో చేశాడు. సినిమా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండడంతో, ఆ విషయాన్ని బాగా భుజాన మీద వేసుకుని నడిపించిన ఫీలింగ్ వస్తుంది. తనదైన శైలిలో కామెడీ చేస్తూ, మాస్ మసాలా ఫైట్లు అందిస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ ఇరగదీశాడు. శ్రీ లీల పాత్ర చాలా పరిమితం అనిపిస్తుంది కానీ, కథలో కీలకమైనదే. ఇక, నవీన్ చంద్ర మరోసారి తన శైలిలో విలనిజం పండించాడు. అజయ్ ఘోష్, హైపర్ ఆది వంటి వాళ్లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక, రాజేంద్రప్రసాద్ పాత్ర డిజైన్ చేసిన తీరు షాక్ కలిగిస్తుంది. తారక్ పొన్నప్ప ఎప్పట్లాగే ఒక చిన్న విలన్ పాత్రలో విలనిజం పండించాడు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు భీమ్స్ గురించే. ఆయన అందించిన సాంగ్స్ ఇప్పటికే కొన్ని చార్ట్‌బస్టర్‌లు అయ్యాయి. అవి విజువల్‌గా కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం అప్ టు ది మార్క్ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉండేలా చూసుకున్నారు.
ఫైనల్లీ
ఈ మాస్ జాతర లిమిటెడ్ జాతర. ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్.