ఇప్పటివరకు అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు ప్రకటన రావడంతో.. ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం.
మన శంకర వరప్రసాద్ గారు కథ:
శంకర వరప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కీలక అధికారి. హోం మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసే అతను ఓ డైవర్సీ. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శంకర వరప్రసాద్, తన పిల్లల్ని బాగా మిస్ అవుతూ ఉంటాడు. పిల్లలకు దగ్గరయ్యే ఉద్దేశంతో శశిరేఖకు తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేసినా, అవి పూర్తిస్థాయిలో సఫలం కావు. అయితే, శశిరేఖ తండ్రి జీవీఆర్ మీద అటాక్ జరగడంతో.. వారికి సెక్యూరిటీ ఆఫీసర్‌గా శంకర వరప్రసాద్ రంగంలోకి దిగుతాడు. అసలు శంకర వరప్రసాద్‌కు, శశిరేఖకు ప్రేమ ఎలా పుట్టింది? వారికి విడాకులు ఎలా అయ్యాయి? అసలు శశిరేఖ తండ్రి మీద అటాక్ చేసింది ఎవరు? ఆ ఎటాక్ చేసిన వ్యక్తిని శంకర వరప్రసాద్ అండ్ టీం కనుక్కుందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
అనిల్ రావిపూడి సినిమాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకునే చేస్తారు అనేది అందరిలో ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా దాదాపుగా అలాగే సాగింది. కానీ సినిమా ఒకసారి చూసిన తర్వాత మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, ఈసారి ఆయన మరో రెండు వర్గాలను కూడా టార్గెట్ చేసినట్లు అనిపించింది. అందులో మొదటి వర్గం మెగా ఫాన్స్. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో చూడని ఎత్తులు లేవు, కానీ ఆయనలో ఉన్న కామిక్ సెన్స్‌ని ఈ మధ్యకాలంలో వాడుకున్న దర్శకులు అస్సలు లేరు. ఒకప్పుడు వింటేజ్ చిరంజీవిలోని కామెడీని బయటకు తీసుకువచ్చిన అనిల్, పూర్తిస్థాయిలో దాన్ని వాడుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ చెబుతున్నా, ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నా.. ఆయన మేనరిజంతోనే నవ్వించడం ఈ సినిమాకే చెల్లింది.
వాస్తవానికి చెప్పాలంటే, ఇది పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకునే కథ ఏమీ కాదు. విడిపోయిన భార్యను తిరిగి ఓ భర్త ఎలా కలవగలిగాడు, ఆమెను ఎలా పొందగలిగాడు అనే లైన్‌తో రాసుకున్నారు. దానికి లాజిక్స్ వెతకకుండా, కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే నడిపించేశారు. ఫస్టాఫ్ అంతా మెగాస్టార్ చిరంజీవి గతం, అతని ప్రేమ, పెళ్లి, విడాకులు అనే విషయాలను ల్యాగ్ లేకుండా ఎంటర్టైనింగ్ వేలో తీసుకువెళ్లిన దర్శకుడు, సెకండాఫ్‌లో కూడా చాలా వరకు ఎంటర్టైన్‌మెంట్‌తోనే నింపేశాడు. కానీ అదే సమయంలో యూత్‌ని టార్గెట్ చేసుకుని విడాకుల అంశాన్ని స్పృశించిన తీరు ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ ఎంతగా దూసుకువెళుతుందో ఎవరూ చెప్పాల్సిన పనిలేదు.
సెలబ్రిటీల వార్తలు మనం చదువుతున్నాం కాబట్టి తెలుస్తోంది కానీ, మన చుట్టుపక్కలే ఎంతోమంది జంటలు చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల వరకు వెళుతున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఈ సినిమాలో కథ రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చూస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు కలిగించినప్పుడే అది పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ ఆలోచనలు రేకెత్తించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అనిల్ రావిపూడి రొటీన్ సినిమాలు తీస్తాడని కొందరు అనుకోవచ్చు కానీ, అతను మాత్రం గిరి గీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఖచ్చితంగా టచ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్లకు మెగాస్టార్ చిరంజీవితో చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి, థియేటర్లలో విజిల్స్ పడతాయి. రిలేషన్‌లో మూడో వ్యక్తి ఎంట్రీ వంటి అంశాలను స్పృశించిన తీరు బాగుంది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్, మరోపక్క మెసేజ్‌తో పాటు చిరు ఫాన్స్‌కి కావాల్సిన ట్రీట్ అందిస్తూ సాగింది ఈ సినిమా.
నటీనటులు:
మెగాస్టార్ చిరంజీవిలో పాతిక, ఇరవై ఏళ్ల క్రితం కనిపించిన మేనరిజం, కామెడీ టైమింగ్‌తో పాటు కళ్ళతోనే ఆయన నటించే తీరు ఈ సినిమాలో కీలకం. ఒకరకంగా చెప్పాలంటే టైటిల్ మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే పెట్టడమే కాదు, సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద నడిపించాడు. విక్టరీ వెంకటేష్ కనిపించింది కొద్దిసేపైనా, ఆ కొద్దిసేపు అందరినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇక నయనతార ఎప్పటిలాగే హుందాగా నటించింది; శశిరేఖ అనే పాత్రలో ఆమె జీవించింది. సచిన్ ఖేడేకర్ ఆ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లో నటించిన హర్ష, అభినవ్ గోమఠం, క్యాథరిన్ సహా చిరంజీవి తల్లి పాత్రలో నటించిన జరీనా వహాబ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం చాలా ప్లస్ పాయింట్. ఏమాత్రం ఎక్కువ కాకుండా, ఏమాత్రం తక్కువ కాకుండా సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా భీమ్స్ ది బెస్ట్ ఇచ్చాడు. అయితే ట్రైలర్ కంటెంట్ రిలీజ్ అయినప్పుడు కలర్ గ్రేడింగ్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి, బహుశా దాని మీద టీం పని చేసినట్లు ఉంది; సినిమా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా: మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కంటే ముందే ఫ్యాన్స్‌కి పండగ తెచ్చేశారు!