NTV Telugu Site icon

Love Me Review: లవ్ మీ మూవీ రివ్యూ

Love Me

Love Me

దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి ఇప్పటికే హీరోగా రౌడీ బాయ్స్ అనే సినిమా చేసి హిట్టు అందుకున్నాడు. ఆయన హీరోగా చేసిన రెండవ సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు దయ్యంతో లవ్ స్టోరీ అని సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సినిమా మీద ఒక్కసారిగా అందరిలో ఆసక్తి కూడా ఏర్పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్ కూడా మరింత ఆసక్తి పెంచేయడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూశారు. అలాంటి సినిమా ఎట్టకేలకు ఈ శనివారం నాడు అంటే మే 25న ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
అర్జున్(ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరూ అన్నదమ్ములు. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మీరు తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అందరూ అద్భుతాలు, మూఢనమ్మకాలు అని భావించే వాటిని వీళ్ళు ఈజీగా క్లియర్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే తమ సొంత ఊర్లో తమ చిన్నప్పుడు జరిగిన ఒక మిస్టరీని ఛేదించాలని ప్రతాప్ ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో తన ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) సహాయం తీసుకుంటాడు. అయితే మీ ఊరిలో మిస్ అయిన చిన్న పాప పేరు దివ్యవతి (సంయుక్త మీనన్) అని ఆమె తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెబుతోంది ప్రియ. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ దివ్యవతి మిస్టరీ తాను తేలుస్తానని ఆ అపార్ట్మెంట్ కి వెళతాడు. అలా వెళ్ళిన అర్జున్ దివ్యవతి గురించి ఏం తెలుసుకున్నాడు? ఆ తర్వాత వెన్నెల, నూర్, పల్లవి ఎందుకు మిస్ అయ్యారు? అసలు వాళ్ళ మిస్సింగ్ కి దివ్యవతికి ఏమైనా సంబంధం ఉందా? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో అలాంటి సినిమాలే చేయాలని దర్శక నిర్మాతలు కూడా ఫిక్స్ అవుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు మేకర్స్. అది ఏమిటంటే దెయ్యాన్ని ఒక యువకుడు ప్రేమిస్తే ఆ దయ్యం తిరిగి అతనిని ఎలా ప్రేమించింది అనేది. సినిమాలో ఈ ఒక్క పాయింట్ యూనిక్ అనిపిస్తుంది తప్ప మిగతాదంతా మనం గతంలో చూసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల లాగానే అనిపిస్తుంది. ఈ సినిమాకి కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు ఒక సరికొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ పాయింట్ పేపర్ మీద రాసుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించవచ్చు కానీ దాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే విధంగా తీసుకురాగలగాలి. అయితే ఆ విషయంలోనే దర్శకుడు అలాగే అతని టీం తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో యూనిక్ పాయింట్ గా చెప్పుకున్న ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడటం అనేదాన్ని కన్వెన్సింగ్ లాజికల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదేమో అనిపించింది. దెయ్యాన్ని మొదటిసారి చూస్తున్నప్పుడు లేదా దానితో ప్రేమలో పడుతున్నానని అనిపించినప్పుడు హీరోలో కొన్ని ఎమోషన్స్ పలికించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలై ఆశిష్ దెయ్యంతో ప్రేమలో పడటం అనేది కాస్త ఆసక్తికరమనీపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఉన్న పాత్రలకు తోడు ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ అనే కొత్త పాయింట్ తీసుకురావడంతో ఒక కథ పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. దానికి తోడు ఆ విషయాన్ని ప్రేక్షకులకు కన్వే అయ్యేవిధంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సిమ్రాన్ చౌదరి పాత్ర, ఆమె అసాధారణ నైపుణ్యాలు నమ్మశక్యం కాని విధంగా ఉంది. కీలక పాత్రధారి అయిన వైష్ణవి చైతన్య ఓపెన్ అయిపోయినా పేక్షకులకు కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఇక ఇవి చాలదన్నట్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే వింత సౌండ్స్, సిట్యుయేషనల్ సాంగ్స్‌ కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ లవ్ మి ఇఫ్ యు డేర్ సినిమాలో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి కానీ అవి పేపర్ మీద బాగున్నంతగా స్క్రీన్‌పైకి రాలేదు. అయితే సెకండ్ హాఫ్ కి లీడ్ ఇవ్వడం కోసం క్లైమాక్స్ లో రాసుకున్న ఒక ట్విస్ట్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.

ఇక నటినటుల విషయానికి వస్తే ఎక్కువ సమయం మూడీగా- సీరియస్‌గా కనిపించే అర్జున్‌గా ఆశిష్ నటించాడు. ఆశిష్ తన పాత్రను ఫిర్యాదులు లేకుండా ఆకట్టుకున్నాడు. ఆశిష్ స్టైలింగ్ బాగుంది. భారీ ఎమోషనల్ సన్నివేశాలు ఏమీ లేవు, కానీ అతని రెండవ సినిమాలో ఆశిష్ నటన బాగుంది. ఇక వైష్ణవి చైతన్యకు మంచి పాత్ర లభించడంతో బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెరుగుపడిందని చెప్పొచ్చు. ఒకానొక సమయంలో బేబీ 2 అని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించింది. రవికృష్ణ కి ఫుల్ లెన్త్ రోల్ పడింది కానీ పూర్తి స్థాయిలో గుర్తింపు దక్కుతున్న అనేది చూడాలి. ఇక మిగతా పాత్రల పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే లవ్ మి ఇఫ్ యు డేర్‌కి అగ్రశ్రేణి టెక్నీషియన్స్ పనిచేశారు. M.M. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు మొదట్లో ఆకట్టుకున్నా, పాటలు అంతగా ఆకట్టుకోలేదు. పిసి శ్రీరామ్ డార్క్ టోన్డ్ సినిమాటోగ్రఫీ సినిమాకు పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. ఆర్ట్‌వర్క్ కి తగ్గట్టు ఆయన కెమెరా పనితనం ఆకట్టుకునేలా చేసింది. ఏ సమయంలోనూ సినిమా తక్కువ బడ్జెట్‌ అని అనిపించదు. ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఒక హానేస్ట్ అటెంప్ట్ కానీ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. లోపాలు పక్కన పెట్టి అంచనాలు లేకుండా థియేటర్ కు వెళితే నచ్చొచ్చు.