NTV Telugu Site icon

KRK Movie Review : కె.ఆర్‌.కె. (తమిళ డబ్బింగ్)

Krk

Krk

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ మొదటి సినిమా ‘పోడా పోడీ’ నుండి మొన్నటి ‘గ్యాంగ్’ వరకూ తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. అయితే అతను తన సినిమాల కంటే కూడా స్టార్ హీరోయిన్ నయనతారతో చేస్తున్న సహజీవనం కారణంగా ఎక్కువగా వార్తల్లో నానుతుంటాడు. తాజాగా విఘ్నేష్ శివన్, నయనతారతో కలిసి ‘కాత్తువాకుల రెండు కాదల్’ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగులో ‘కె.ఆర్.కె.’ పేరుతో డబ్ అయ్యి గురువారం విడుదలైంది.

రాంబో (విజయ్ సేతుపతి)కి చిన్నప్పటి నుండి తనంత దురదృష్టవంతుడు మరొకరు లేరని నమ్మకం. అతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తల్లి అనారోగ్యం పాలవుతుంది. వారి వంశంలో ఎవరికీ పెళ్ళి కాదనే శాపం ఉందని ఊరంతా నమ్ముతుంటారు. రాంబో తండ్రి అది తప్పని నిరూపించడం కోసం ఓ ముస్లిం యువతని పెళ్ళి చేసుకుంటాడు. రాంబో పుట్టగానే అతను మరణిస్తాడు. దాంతో ఊరంతా ఆ శాపం నిజమేనని భావిస్తుంది. పైగా దురదృష్టవంతుడైన రాంబో తల్లి (సీమ) దగ్గర ఉంటే, ఆమె కోలుకోదని చెప్పడంతో అతను ఊరు వదలి వెళ్ళిపోతాడు. పగలు క్యాబ్ డ్రైవర్ గానూ, రాత్రి బార్ లో బౌన్సర్ గానూ పని చేస్తుంటాడు. ఓ వినాయక చవితి రోజు ఉదయం అతని జీవితంలోకి కన్మణి (నయనతార), రాత్రి ఖతీజా బేగమ్ (సమంత) అడుగుపెడతారు. అక్కడ నుండి అతని జీవితం మారిపోతుంది. అంతా కలసి వస్తుంది. తల్లి ఆరోగ్యం కుదుట పడుతుంది. దాంతో ఇటు కన్మణి, అటు ఖతీజాను వదిలి రాంబో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. తన జీవితాన్ని ఆ ఇద్దరు ముద్దుగుమ్మలతో పంచుకోవడానికి రాంబో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ క్రమంలో ఎలాంటి తలనొప్పులు భరించాడు? అన్నదే ఈ చిత్ర కథ.

నిజానికి ఈ సినిమా మూడు దశాబ్దాల క్రితం రావాల్సింది. రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి వారు ఈ తరహా సినిమాలు తెలుగువారికి ఎప్పుడో చూపించేశారు. తనకు అచ్చి వచ్చిన ఇద్దరమ్మాయిలను సమానంగా ప్రేమించి, వారితో జీవితాన్ని పంచుకోవడానికి హీరో చెప్పే మాటలు ఒక స్థాయి వరకూ సరదాగా ఉంటాయి. వినోదాన్ని పండిస్తాయి. కానీ ఆ తర్వాత మరీ ఇంత బేవార్స్ గా ఈ క్యారెక్టర్ ను డైరెక్టర్ మలిచాడేమిటీ అనిపిస్తుంది. ఇక హీరో లక్ష్యం తన మేనత్త, బాబాయిల వివాహాలు జరిపించడం కూడా అని తెలిసి చికాకు పుడుతుంది. అతన్ని ఎలా అయినా ఓ ఇంటి వాడిని చేయాలని వాళ్ళంత తాపత్రయ పడటం బోర్ కొట్టిస్తుంది. ఇద్దరు హీరోయిన్లకు హీరో పట్ల సాఫ్ట్ కార్నర్ కలగడం కోసం ప్రభు టీవీ షోను నిర్వహించడం… మరీ కామెడీగా ఉంది. ఆ విషయం బయటపడంతో హీరోని ఆ ఇద్దరూ కాదనుకోవడం కూడా అర్థం పర్థం లేనిదే. నిజానికి హీరో పట్ల ఆ ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమను పెంచుకోవడానికి బలమైన కారణం ఏదీ ఉండదు. పైగా చదువుకున్న అమ్మాయిలు అంత తేలిగ్గా అతను లేకుండా జీవితాన్ని గడపలేం అన్నట్టుగా ప్రవర్తించడం పరమ రోతగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి గత కొంతకాలంగా అంగీకరించిన సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ రకంగానూ అవి ప్రేక్షకుల మెప్పు పొందడం కానీ, విజయం సాధించడం గానీ జరగలేదు. దీన్ని కూడా విఘ్నేష్ శివన్ తో ఉన్న అనుబంధంతో అంగీకరించినట్టుగా అనిపిస్తోంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ అతని ముఖకవళికల్లో మార్పే కనిపించలేదు. ఇక నయనతార అయితే… సొంత సినిమా కాబట్టి పాత్ర గురించి పెద్దంత ఆలోచించలేదనిపిస్తోంది. సమంత పరిస్థితి కూడా అలానే అనిపించింది. నిజానికి ఇటు నయనతార, అటు సమంత ఇద్దరూ కూడా ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. ఆ సినిమాల ద్వారా కొద్దో గొప్పో పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి సమయంలో ఇలాంటి చీప్ స్టోరీస్ ను అంగీకరించడం చాలా విడ్డూరంగా ఉంది. అయితే నయన్ తో పోల్చితే సమంత స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ బాగుంది. చాలా సరదాగా ఖతీజా పాత్రను సామ్ చేసింది. కొన్ని సీన్స్ లో ‘ఓ బేబీ’లోని సమంత గుర్తొచ్చింది. హీరో స్నేహితుడిగా నటించిన రెడిన్ కింగ్స్లే కాస్తంత వినోదం పండించే ప్రయత్నం చేశాడు. సమంత బాయ్ ఫ్రెండ్ గా క్రికెటర్ శ్రీశాంత్ నటించాడు, కానీ అతని ప్రభావం ఏదీ ప్రత్యేకంగా కనిపించలేదు. సినిమాటోగ్రాఫర్స్ ఎస్. ఆర్. కదిర్, విజయ్ కార్తీక్ కన్నన్ పనితనం ఏం గొప్పగా లేదు. సంగీత దర్శకుడు అనిరుథ్ కు ఇది 25వ సినిమా. ఆర్.ఆర్. సోసో గా ఉంది. నిర్మాణ విలువలూ చెప్పుకోదగ్గవి కాదు. వినోదాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి ‘కె.ఆర్.కె.’ ఓ మోస్తరుగా నచ్చే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్:
క్రేజీ కాంబినేషన్ కావడం
వినోదానికి ప్రాధాన్యమివ్వడం

మైనస్ పాయింట్స్:
మెప్పించని కథ కథనం
నిర్మాణ విలువలు శూన్యం

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: ఆయనకిద్దరు!