సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పటికే ‘తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలు విడుదల కాగా, శనివారం విజయ్ ‘వారసుడు’తో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ జనం ముందుకు వచ్చాయి. యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’తో దర్శకుడిగా అనిల్ కుమార్ ఆళ్ళ పరిచయం కాగా, తమిళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ప్రియ భవానీ శంకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఎలా ఉందో చూద్దాం.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివ లక్కీ ఫెలో. అతనికి జాబ్ లేకపోయినా… ప్రోగ్రామ్ డెవలపర్ శ్రుతి (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. పాతికేళ్ళ పాటు తండ్రి చాటున గడిపేసిన శివ, మ్యారేజ్ తర్వాత పెళ్ళాం చాటు మొగుడుగా మారిపోతాడు. అయితే… భర్త ఉద్యోగి కాదనే బాధ శ్రుతిని వేదిస్తూ ఉంటుంది. శివ కూడా జాబ్ కోసం పలు ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఆ క్రమంలో ఓ కన్సల్టెంట్ కంపెనీకి పది లక్షల రూపాయలు ఇస్తే… జాబ్ వస్తుందని తెలియడంతో శ్రుతి డబ్బులు అరేంజ్ చేస్తుంది. వాటిని కట్టే లోపే ఓ దొంగ… శివ దగ్గర నుండి క్యాష్ కొట్టేస్తాడు. పది లక్షలు పోగొట్టుకున్న శివ.. శ్రుతికి ఏం సమాధానం చెప్పాడు? భర్తను ఉద్యోగిగా చూడాలనుకున్న భార్య కోరిక నెరవేరిందా? సొంత తండ్రితో సహా అందరూ శివను అవమానిస్తుంటే అతని మావగారు మాత్రం ఎందుకు వెనకేసుకొచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సెకండ్ హాఫ్ లో సమాధానం దొరకుతుంది.
ఓ సింపుల్ పాయింట్ ను తీసుకుని నూతన దర్శకుడు అనిల్ కుమార్… దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్ గా మలచడం ఓ రకంగా సాహసమే. పెద్దగా కాన్ ఫ్లిక్ట్ లేని ఈ స్టోరీని నిర్మాతకు చెప్పి ఒప్పిండం నిజంగా వండరే! ఉద్యోగం లేని కుర్రాడిని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పెళ్ళి చేసుకోవడం ఈ రోజుల్లో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం అనేది ఉంది కాబట్టి ఆడియెన్స్ కన్వెన్స్ అవుతారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమతో ఓ నిరుద్యోగిని తన జీవితంలోకి ఆహ్వానించిన శ్రుతి, ఒకే ఒక్క సంఘటనతో అతన్ని పనికిమాలిన వాడిగా భావించడం, తన మీద బతుకు వెళ్ళ దీయాలను కుంటున్నాడని నిందించడం సమంజసంగా అనిపించదు. శ్రుతి పాత్రను మలచడంలో డైరెక్టర్ అనిల్ తడబడ్డాడు. శివను ఆమె దూరం పెట్టడానికి, అతనిపై ద్వేషం పెంచుకోవడానికి మరింత బలమైన సన్నివేశాలను రాసుకుని ఉండాల్సింది. అలా కాకుండా ఠక్కున ఆ పాత్రలో ఊహించని వేరియేషన్స్ ను చూపించే సరికీ ఆడియెన్స్ జీర్ణించుకోవడం కష్టమే. అయితే… ఆమె రియలైజేషన్ కు సంబంధించిన సీన్స్ చక్కగా రాసుకున్నాడు. దాంతో ప్రథమార్థం తేలిపోయినా… ద్వితీయార్ధం సినిమాను కాస్తంత నిలబెట్టింది. బట్… రొటీన్ సీన్స్ కారణంగా, 106 నిమిషాల నిడివి కూడా భారంగానే సాగింది. దానికి తోడు సినిమా నిడివిని పెంచడం కోసమే అన్నట్టుగా ఎండ్ టైటిల్స్ ముందు ఓ పాట పెట్టారు. స్టార్ హీరోల విషయంలో ఓకే కానీ… అప్ కమింగ్ యంగ్ హీరోస్ సినిమాల్లో ఇలా క్లయిమాక్స్ తర్వాత సాంగ్ పెడితే, థియేటర్ లో ఒక్కరూ ఉండరు!
శివ పాత్రను సంతోష్ శోభన్ చాలా ఈజ్ తో చేశాడు. ప్రియ శంకర్ భవానీ రూపంలో తెలుగు తెరకు మరో చక్కని నటి లభించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ సినిమాలతో ప్రియ తెలుగువారికి పరిచయమే. మరో రెండు తెలుగు మూవీస్ లోనూ ఆమె నటిస్తోంది. హీరో తల్లిదండ్రులుగా రూపలక్ష్మీ, కేదార్ శంకర్ చక్కగా సెట్ అయ్యారు. హీరోయిన్ తండ్రిగా నటించిన దర్శకుడు దేవిప్రసాద్ కు చక్కని స్క్రీన్ స్పేస్ లభించింది. ఆయన ఆ సన్నివేశాలను చక్కగా పండించారు. ఇతర ప్రధాన పాత్రలను పవిత్ర లోకేష్, ‘సత్యం’ రాజేశ్, కార్తీక్ ప్రసాద్, సద్దామ్, సప్తగిరి తదితరులు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన బాణీలు గొప్పగా లేకపోయినా నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. యూవీ కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గత యేడాది ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ ‘తో ప్రేక్షకులను నిరాశకు గురిచేసిన సంతోష్ శోభన్… ఈ మూవీతో మంచి మార్కులే పొందాడు. థియేటర్లలో స్కిప్ చేసినా, ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు!
రేటింగ్: 2.5/5
ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
ఆకట్టుకునే సంభాషణలు
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
థిన్ స్టోరీ లైన్!
బోర్ కొట్టించే ఫస్ట్ హాఫ్
లింక్ లేని సీన్స్
ట్యాగ్ లైన్: ఓటీటీకి ఓకే!