దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మించిన చిత్రం కాంత. ఈ సినిమాలో మరో దర్శక నటుడు సముద్రఖని కీలకపాత్రలో నటించారు. అప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ సినిమాని ఎట్టకేలకు నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, సినిమా మీద నమ్మకంతో రెండు రోజుల ముందే తమిళంలో, ఒకరోజు ముందు తెలుగులో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి, కొత్త దర్శకుడు సెల్వరాజ్ సెలవమణి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కాంత కథ:
ఇదంతా 1950-60లలో తమిళనాడులోని చెన్నైలో ఉన్న స్టూడియోలలో జరిగే కథ. అయ్య (సముద్రఖని) ఒక పేరు మోసిన దర్శకుడు. అతను గతంలో తానే సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరో టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) తో గతంలో ప్రారంభించి నిలిపివేయబడిన ‘శాంత’ అనే సినిమా ప్రారంభిస్తాడు. కొన్ని కారణాల వల్ల అయ్యా, మహదేవన్ ఇద్దరికీ గొడవలు అవుతాయి. అయితే, ఇప్పుడు అయ్యా కుమారి(భాగ్యశ్రీ బోర్సే)ని హీరోయిన్‌గా రంగంలోకి దించుతారు. ఆమె ద్వారా నీ మీద పగ తీర్చుకుంటానని మహదేవన్‌కు ముఖం మీదే ఛాలెంజ్ విసురుతారు.
అయితే, అనూహ్యంగా, ముందు అయ్య కోసం మహదేవన్‌ను ఇబ్బంది పెట్టిన కుమారి, తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ ఏకమై గర్భం కూడా వస్తుంది. తర్వాత పరిస్థితులలో మహదేవన్ ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు, కానీ ఆమె ఒకరోజు హత్యకు గురవుతుంది. అయితే, కుమారిని చంపింది ఎవరు? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది? చివరికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్(రానా) ఏం తేల్చాడు? నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ కథ త్యాగరాజ భాగవతార్ బయోపిక్ ఏనా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా మొదలైనప్పుడే పెద్దగా పరిచయాలు లేకుండా అసలు కథలోకి తీసుకువెళ్లిపోతాడు దర్శకుడు. ఒక సినిమా సెట్. ఆ సెట్‌లో దర్శకుడికి, హీరోకి పడదు. ఇప్పుడు ఆగిపోయిన సినిమా ప్రారంభించాక దర్శకుడు ఏమీ చెప్పకుండానే హీరో సీన్ పేపర్ చదివి తనకు నచ్చింది నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా మొదలైన కథ నెమ్మదిగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. తొలుత హీరోయిన్ హీరో మీద చికాకు పడుతూ ఉండడం, ఆ తర్వాత హీరోని అర్థం చేసుకుంటూ అతనికి క్లోజ్ అవుతూ వెళ్లడం ఆసక్తికరంగా మారుతుంది. వీరిద్దరి గురించి తెలిసిన దర్శకుడు ఎలా స్పందిస్తాడో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో, ఏకంగా ఆమెను చంపేస్తూ దర్శకుడు సెకండ్ పార్ట్‌కి ఇచ్చిన లీడ్, సెకండ్ పార్ట్ మీద ఆసక్తి పెంచేస్తుంది.
ఫస్ట్ పార్ట్ వరకు సినిమా అంతా ‘మహానటి’ ఫ్లేవర్‌లో సినిమా సెట్‌లో సాగుతున్నట్లు అనిపిస్తుంది. తర్వాత సెకండ్ పార్ట్ కూడా సినిమా సెట్‌లోనే సాగుతుంది, కానీ మొత్తం అంతా ఒక మర్డర్ మిస్టరీ డ్రామాగా మారిపోతుంది. చనిపోయిన హీరోయిన్ చుట్టూనే సెకండ్ పార్ట్ అంతా తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన రానా, హీరోయిన్‌ని ఎవరు చంపారు అని వెతికే క్రమంలో పుట్టిన డ్రామా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. వాస్తవానికి సినిమాగా చూస్తే ఇది లాగ్ అనిపిస్తుంది, కథ కూడా ఏముంది అనిపిస్తుంది. కానీ, సినిమాని టెక్నికల్‌గా ముందుకు తీసుకువెళ్లిన విధానం మాత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంది.
వాస్తవానికి ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాదు. నాలుగు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్స్, నాలుగు రొమాన్స్ సీన్స్‌తో సినిమాలను నింపేస్తున్న ఈ కాలంలో, అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్యూర్ డ్రామా మీద, నటీనటుల పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి రాసుకున్న కథ ఇది. దానిని అంతే జాగ్రత్తగా తెరమీదకు తీసుకురావడంలో మొదటిసారి అయినా సరే దర్శకుడు సఫలమయ్యాడు. అయితే, సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు.
నటీనటులు, సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ ఇప్పటికే నటుడిగా, హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే, ఇది అతని కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బహుశా బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఆయనను వరించవచ్చు. అతనితో పోటీపడి మరీ నటించాడు సముద్రఖని. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరి ముందు తేలిపోతుంది అనుకున్న భాగ్యశ్రీ కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. రానా చాలాకాలం తర్వాత స్క్రీన్ మీద కనపడినా తనదైన మ్యాజిక్ చేశాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధాన పాత్రలు కాకుండా పక్కన ఉన్న పాత్రలు కూడా అద్భుతంగా నటించేలా చేశాడంటే, అది కచ్చితంగా దర్శకుడి ప్రతిభ అని చెప్పక తప్పదు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమా మొత్తానికి ఎక్కువ క్రెడిట్ దక్కాల్సింది ఆర్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్‌కి. సినిమా మొత్తం ఒకే సెట్‌లో జరిగిపోతూ ఉంటుంది, ఫ్రేమ్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. దాన్ని ఏమాత్రం బోరు కొట్టకుండా మనకి చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా కీలకపాత్ర వహించాడు. ఇక డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, కొన్నిచోట్ల విజిల్స్ వేయించేలా ఉన్నాయంటే ఎంత శ్రద్ధ తీసుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. జేక్స్ బీజీఎమ్ మాత్రమే కాక పాటలు కూడా చాల బాగున్నాయి. ఒకప్పటి స్టూడియో సెట్స్ ని మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి ఈ సినిమా చేసిన ప్రయత్నం అభినందనీయం. అలాగే, మోసపూరిత ధోరణిలో సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీసుకొచ్చినందుకు దుల్కర్, అలాగే రానాని అభినందించాలి.
ఫైనల్లీ:
కాంత… అందరి కప్ ఆఫ్ టీ కాదు, కానీ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ కోసం మస్ట్ వాచ్.