‘జిగ్రీస్’ మూవీ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం సినీ స్టార్ ప్రమోషన్స్ చేయడమే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందు నుంచి ప్రచారం చేయగా.. హీరో కిరణ్ అబ్బవం, దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా భాగమయ్యారు. స్నేహితుడు కృష్ణ వోడపల్లి ఈ సినిమాను నిర్మించడంతో సందీప్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన జిగ్రీస్ కు స్టార్ సర్కిల్ డిజిటల్ మీడియా భాగస్వామ్యంగా వ్యహరించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. ఓ రోజు ముందుగానే చిత్ర యూనిట్ ప్రీమియర్ షో వేసింది. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిన్నప్పటి నుంచి కార్తిక్ (కృష్ణ బూరుగుల) ప్రవీణ్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ అయ్యాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇంతలో ప్రశాంత్‌కు కాన్సర్ అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఉండే కోరికతో తన చివరి రోజుల్లో స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళ్లాలనుకుంటాడు ప్రశాంత్. మద్యం మత్తులో అందరూ కలిసి గోవా వెళ్లాలని డిసైడ్ అయి.. మారుతీ 800లో బయలుదేరతారు. మైకంలో మొబైల్స్, మనీ పడేసి ఉత్తచేతులతో ప్రయాణిస్తారు. మధ్యలో కారు ట్రబుల్ ఇస్తుంది. రిపేర్ కోసం, తిండికి డబ్బులు ఉండవు. వీరు నలుగురు గోవాకు ఎలా చేరుకున్నారు?, అక్కడ ఏం జరిగింది?, ప్రశాంత్ మహమ్మారి కాన్సర్‌ను జయించాడా?, ప్రయాణం వీరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. సినిమా మొదటి నుండి ఎండ్ వరకు అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ నితిన్ కూడా బాగా యాక్ట్ చేశాడు. రామ్, కార్తీక్ మధ్య గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ధీరజ్ ఆత్రేయ సహజ, అమాయమైన నటనతో నవ్వులు పూయించాడు. ఇక మనీ వాక కాన్సర్ పేషేంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎమోషన్ సీన్స్‌లో ఆహా అనిపించాడు. పేషేంట్ పాత్ర సరైన న్యాయం చేశాడు. నలుగురు కూడా సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
టైటిల్‌కి తగ్గట్టే ఇది నలుగురు జిగ్రీస్ కథ. ఇలాంటి సినిమాలలో కథ పెద్దగా ఉండదు, కామెడీతోనే లాగించాల్సి ఉంటుంది. ప్రతీ సీన్‌లో మెప్పించాలి. ఒకొక్క సీన్‌తో ప్రేక్షకుడిని నవ్వించగలిగితే సినిమా నిలబడుతుంది. ఈ విషయంలో దర్శకుడు హరిష్ రెడ్డి ఉప్పుల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా దొంగల బ్లాక్, లారీ సీన్, ఆటో సీన్, నాటుకోడి ఎపిసోడ్ సహా గోవాలో కాండోమ్ సీన్, బార్ సీన్‌లు నవ్వులు పూయిస్తాయి. కథలో అహా ఓహో అనే మలుపులు ఉండవు కానీ సినిమా ముందుకు వెలుతుంటుంది. ఒక్కోసారి మన గ్యాంగ్ కూడా ఇలాంటిదే కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వారే కదా అని అనిపిస్తుంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలు తెరపై చూసుకుంటున్నట్టు ఉంటుంది. ఇక చివర 15 నిమిషాలు మనసుని ఎంతో బరువెక్కిస్తుంది. ఇదే సినిమాను బలంగా నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్‌గా ఉంది. కమ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని జిగ్రీస్ సినిమా.. సరికొత్తగా అనిపిస్తుంది.
ఫైనల్లీ: జిగ్రీస్.. మన చిన్ననాటి జాన్ జిగ్రీలతో గడిపిన క్షణాలని గుర్తుచేస్తుంది.